డబ్బున్నోళ్లకే గుండె జబ్బుల ముప్పు! | wealthy indians higher risk of heart disease study finds | Sakshi
Sakshi News home page

డబ్బున్నోళ్లకే గుండె జబ్బుల ముప్పు!

Oct 20 2026 8:42 AM | Updated on Oct 20 2026 8:43 AM

wealthy indians higher risk of heart disease study finds

సాక్షి,హైదరాబాద్‌: సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న భారతీయులే గుండె సంబంధిత వ్యాధులకు ఎక్కువగా గురవుతున్నారని ఓ సమగ్ర పరిశోధనలో వెల్లడైంది. పేదలతో పోలిస్తే బాల్యం నుంచే ఆర్థిక వెసులుబాటు కలిగిన వ్యక్తుల్లో గుండె వైఫల్యం, గుండెపోటు ముప్పు గణనీయంగా పెరుగుతోందని వైద్య పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనా వివరాలు ప్రఖ్యాత ‘అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌’లో ప్రచురితమయ్యాయి. 

న్యూఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌), అమెరికాలోని బోస్ట¯Œన్‌కు చెందిన హార్వర్డ్‌ టి.హెచ్‌. చాన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన 45 ఏళ్లు పైబడిన 65,364 మంది స్త్రీ, పురుషుల సమాచారాన్ని విశ్లేషించారు. బాల్యం నుంచి ప్రస్తుత స్థితి వరకు వారి సామాజిక, ఆర్థిక గమనాన్ని పరిగణనలోకి తీసుకొని గుండె ఆరోగ్యాన్ని పరీక్షించారు.  

ఇబ్బందుల్లో ఉన్నవారికంటే రెట్టింపు ముప్పు! 
జీవితాంతం ఆర్థికంగా బలమైన లేదా ఉన్నత స్థితిలో కొనసాగిన వ్యక్తులకు, నిరంతరం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారితో పోలిస్తే గుండె వైఫల్యం చెందే అవకాశం 1.8 రెట్లు (దాదాపు రెట్టింపు), గుండెపోటు వచ్చే అవకాశం 1.7 రెట్లు అధికంగా ఉందని అధ్యయన నివేదిక తెలిపింది. వీరిలో క్రమరహితంగా గుండె కొట్టుకోవటం (అరిథ్మియా), గుండె రక్తనాళాల సమస్యలు ఎక్కువగా కనిపించాయని పరిశోధకులు తెలిపారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం జీవనశైలి మార్పులేనని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన హార్వర్డ్‌ శాస్త్రవేత్తలు డా.ఇమ్మనెరెన్‌ లాంగ్‌కుమర్, ప్రొఫెసర్‌ ఎస్‌.వి. సుబ్రమణియన్‌ స్పష్టం చేశారు. సంపద పెరిగే కొద్దీ ప్రజలు ప్రాసెస్డ్‌ ఫుడ్స్, అధిక చక్కెరలు కలిగిన పానీయాలు, రిఫై¯Œన్డ్‌ పిండి పదార్థాలు, అధిక కేలరీల ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు. దీనితో పాటు శారీరక శ్రమ, వ్యాయామం తగ్గిపోవటం, కూర్చొని పనిచేసే జీవనశైలికి అలవాటుపడటమే గుండెజబ్బులకు మూలకారణమని వారు విశ్లేషించారు.  

అప్పుల ఊబిలో పేద, మధ్యతరగతి ప్రజలు 
గుండెజబ్బులు వచి్చనప్పుడు ఎదురయ్యే ఆర్థిక భారంపై కూడా పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాలు కొంత ఊరటనిస్తున్నప్పటికీ, అధిక శాతం ఆసుపత్రి ఖర్చులే పేద, మధ్యతరగతి కుటుంబాలను అప్పుల ఊబిలోకి నెడుతున్నాయని హెచ్చరించారు. గుండె వైఫల్యంతో ఒక్కసారి ఆసుపత్రిలో చేరితే సగటున రూ. 1.19 లక్షల వరకు ఖర్చవుతోందని కేరళకు చెందిన ఒక నిపుణుడు తెలిపారు. దేశంలో మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు తమ ఆహారపు అలవాట్లు, జీవనశైలిని మార్చుకోవాల్సిన తక్షణ అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement