సీజేపీ నాయకులు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌కు ఎదురుదెబ్బ తప్పలేదు. వీరి జ్యుడీషియల్ కస్టడీని మరో రెండు రోజులు పొడిగించారు. ఆ తర్వాత వారిని తీహార్ జైలుకు తరలించారు. మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట ఇద్దరు నేతలను హాజరుపరిచారు. దీంతో బుధవారం వారిని మళ్లీ కోర్టులో హాజరుపరచనున్నారు. వీరిద్దరికీ తొలుత అక్టోబర్ 14న ఐదు రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా సీజేపీ చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో నిరసన ప్రాంతంగా అధికారిక హోదాను కోల్పోయిన ఢిల్లీలోని జంతర్ మంతర్ తాళం వేసిన గేట్లను దూకి లోపలికి ప్రవేశించినందుకు అక్టోబర్ 13న వారిని అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్ 14న వారికి ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. జంతర్ మంతర్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు, నినాదాలు చేసేందుకే తాము లోపలికి వెళ్లినట్లు సీజేపీ పార్టీ స్పష్టం చేసింది. జంతర్ మంతర్ నిరసన స్థల హోదాను రద్దు చేయడాన్ని ఆ పార్టీ వ్యతిరేకిస్తోంది. నేతల విడుదలను అడ్డుకోవడానికి, కోర్టు ప్రక్రియను ఆలస్యం చేయడానికి అధికారులు ఉద్దేశపూర్వకంగానే కుట్ర పన్నుతున్నారని సీజేపీ ఆరోపించింది. సీజేపీ నాయకుడు అభిజీత్ దిప్కే, పార్టీ లీగల్ హెడ్ రత్న సింగ్ మాట్లాడుతూ.. ఢిల్లీ పోలీసులు, రాష్ట్ర అధికారులు విచారణను కావాలనే ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు.తమను అణచివేయడానికి ఈ వ్యవస్థ మొత్తాన్ని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. కానీ వారి కుతంత్రాలేవీ చెల్లవన్నారు. గొంతులను అణచివేయడానికి అధికారాన్ని ఎలా ఉపయోగిస్తున్నారో, చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారోఈ దేశ యువత గమనిస్తున్నారన్నారు.
ఇదీ చదవండి: టైగర్ ష్రాఫ్ కాల్పులు : పోలీసుల కీలక ప్రకటన


