దేవి నవరాత్రులు అప్పుడే తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. మహర్నవమి రోజు అమ్మవారిని మహిషాసుర మర్ధినిగా కొలుచుకుంటారు భక్తులు. ఈవేళ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించిన అమ్మవారిని తమను చుట్టుముట్టే భయాలు, బాధలను దురంచేసే తల్లిగా ప్రార్థిస్తారు. అలాంటి ఈ పర్వదినం రోజున దుర్గతులకు దూరం చేసి ఆ తల్లికి సంబంధించిన ఒక విశిష్ట ఆలయం గురించి తెలుసుకుందామా. ఆ అమ్మ ఆలయం కేవలం దేవి నరాత్రుల్లో తప్ప మిగతా అన్ని రోజుల మూసివేసి ఉంటుంది. ఏళ్లుగా కొనసాగుతున్న ఆ ఆచారం వెనుకున్న రహస్యం ఏంటో తెలుసుకుందామా.!.
ఒడిశాలోని పారలాఖేముండిలో వెలిసిన పురాత దండు మారమ్మ ఆలయం అత్యంత మహిమాన్వితమైన గుడి. ఈ అమ్మవారు అత్యంత పవిత్రమైన శక్తిపీఠాల్లో ఒకటిగా అలరారుతోంది. పారలాఖేముండి రాజవంశ పాలనా కాలంలోనే ఈ ఆలయం నిర్మించబడినట్లు భక్తులు విశస్తిస్తుంటారు. ఆ అమ్మ అన్ని వైపుల నుంచి పట్టణాన్ని రక్షించేందుకే అలా ఈశాన్య మూలలో కొలువై ఉందని చెబుతుంటారు స్థానికులు.
ఈ ఆలయం కేవలం నవరాత్రుల ప్రారంభంలోనే తెరుస్తారు. తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజల అనంతరం దసరా రోజు రాత్రి ఈ ఆలయాన్ని మూసివేస్తారు. మిగిలిన ఏడాదికాలం పాటు భక్తులకు ఈ ఆలయం అందుబాటులో ఉండదట. ఈ ఆలయంలో అత్యంత ఆసక్తికరమైన అంశాలలో ఒకటి అమ్మవారి విగ్రహం వెనుక ఉన్న పెద్దపాముపుట్ట. స్థానికుల నమ్మకం ప్రకారం..పురాతన కాలం నుంచి ఒక నాగుపాటు పుట్టలో నివశిస్తోందని స్థానికులు నమ్మకం.
ప్రతి ఏటా అష్టమి పూజల సమయంలో ఈ పాము విగ్రహం దగ్గరకు వస్తుందని చెబుతున్నారు స్థానికులు. దీన్ని చూసేందుకే చుట్టపక్కల ప్రజలు తండోపతండాలుగా తరలివస్తుంటారని చెబుతున్నారు. అలాగే ఈ నవరాత్రుల పూర్తి అయిన తదనంతరం నుంచి ఆ నాగుపామే ఈ అమ్మవారికి రక్షగా ఉంటుందట. చాలా దశాబ్దాల క్రితం..దసరా సమయంలో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి దున్నపోతును బలి ఇచ్చేవారని, ఆ తర్వాత ప్రత్యేక ప్రార్థనలు, పూజలు నిర్వహించేవారట.
అయితే కాలక్రమేణ ఆ పూజల్లో మార్పుల్లో వచ్చి అమ్మవారికి కేవలం శాకాహార నైవేద్యాన్నే సమర్పిస్తున్నారట. ప్రస్తుతం దండుమాలసాహి ప్రాంత నివాసితులు ఈ ఆలయ నిర్వహణను చూసుకుంటున్నారట. ఏటా నవరాత్రుల సమయంలో ఇక్కడ ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయట. స్వలం కాలం వరకు తెరుచుకునే ఈ అమ్మవారిని దర్శించుకుంటే..తమకు సౌభాగ్యం, క్షేమం కలుగుతుందనేది భక్తులు ప్రగాఢ నమ్మకం.
ఇదీ చదవండి: నవరాత్రుల స్పెషల్ వంటకాలు..చేసేయండిలా!


