దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి దుష్టశక్తులు కుట్రలు సాగిస్తున్నాయి
‘వికసిత్ భారత్’ లక్ష్య సాధన కోసం కలిసికట్టుగా కృషి చేయాలి
దసరా వేడుకల్లో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: మన దేశాన్ని విచ్చిన్నం చేయడానికి దుష్టశక్తులు కుట్రలు సాగిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. దేశ ప్రజలందరూ ఏకం కావాలని, మన శత్రువులపై ఉమ్మడిగా పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. దేశ గౌరవం, ప్రతిష్ట, సామాజిక సామరస్యం, సాంస్కృతిక వారసత్వాలను దెబ్బతీసే శక్తులకు వ్యతిరేకంగా దేశం ఐక్యంగా నిలవాలని కోరారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని డీడీఏ ఉత్సవ్ మైదానంలో శ్రీరామ్‌లీల కమిటీ నిర్వహించిన దసరా వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు.
రావణ దహన కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. విజయదశమి పర్వదినం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. దేశ గౌరవానికి హాని కలిగించే శక్తులు, సమాజాన్ని విభజించే వ్యక్తులు, మన సంస్కృతిని ద్వేషించే మనస్తత్వం కలిగిన మనుషులే నేడు మనకు శత్రువులు అని తేల్చిచెప్పారు. పవిత్ర విజయదశమి సందర్భంగా మన సంకల్పాన్ని పునరుద్ఘాటించుకోవాలని సూచించారు. భరతమాతకు శత్రువులైనవారిని కచ్చితంగా ఓడించాలని తేల్చిచెప్పారు.
అధికారం అంటే ప్రజలకు సేవ చేయడమే
ప్రజలంతా ఎల్లవేళలా ఐక్యంగా ఉండాలని పిలుపునిస్తూ ప్రాచీన బోధనలను ప్రధాని మోదీ ప్రస్తావించారు. మనమంతా కలిసికట్టుగా ఉండాలని మన ప్రాచీన రుషులు బోధించినట్లు గుర్తుచేశారు. నేడు దేశంలోని ప్రతి మూల శ్రీరామ నామస్మరణతో పులకిస్తోందని అన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న రామ్‌లీల కార్యక్రమాలు ఉత్సాహంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ పండుగలు శ్రీరాముడి ఆదర్శాలను సజీవంగా ఉంచుతున్నాయని, అసత్యంపై సత్యం విజయం సాధిస్తుందన్న సందేశాన్ని ఇస్తున్నాయని పేర్కొన్నారు.
ఇవన్నీ కేవలం పండుగలు మాత్రమే కాదని.. భారతదేశ జీవశక్తులు అని వ్యాఖ్యానించారు. ఒక దేశాన్ని ఎలా ముందుకు నడిపించాలనే విషయంలో శ్రీరాముడి ఆదర్శాలు ఇప్పటికీ సందర్భోచితంగానే ఉన్నాయని వివరించారు. పౌరుల సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యతనిచ్చే ‘రామరాజ్యం’అనే భావన ఇప్పటికీ ఒక కొలమానంగా నిలుస్తోందని కొనియాడారు. నేటికీ దీనినే సుపరిపాలనకు ప్రమాణంగా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు. రామరాజ్యం అంటే.. ఎవరి పట్లా వివక్ష లేని పాలన, అందరికీ న్యాయం చేకూర్చే వ్యవస్థ, సమాన అవకాశాలు లభించే సమాజం అని తెలియజేశారు. అధికారం అంటే పాలించడం కాదని, ప్రజలకు సేవ చేయడమేనని తేల్చిచెప్పారు.
కష్టాలు మనల్ని ఆపలేవు
ప్రజలను దైవస్వరూపులుగా భావించి, ‘పౌరుడే దైవం’అనే మంత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం నిరంతరం ముందుకు సాగాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పేదలు, అణగారిన వర్గాల సేవకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. శ్రీరాముడు లంకకు సాగించిన ప్రయాణాన్ని స్వావలంబనకు, దృఢ సంకల్పానికి, సామూహిక కృషికి ప్రతీకగా మోదీ అభివర్ణించారు. మన లక్ష్యాలను సాధించే క్రమంలో ఎదురయ్యే సవాళ్లకు వెనకడుగు వేయకూడదని స్పష్టంచేశారు. ‘వికసిత్ భారత్’సాధనే మన ధ్యేయమని మరోసారి ఉద్ఘాటించారు. కఠిన శ్రమతో, మన సామర్థ్యాలపై నమ్మకంతో సవాళ్లకు పరిష్కారాలను కనుగొనాలని అన్నారు. సంక్షోభం ఎంత పెద్దదైనా, సవాలు ఎంత కఠినమైనా మనం ఇతరులపై ఆధారపడి, చేతులు కట్టుకుని కూర్చోకూడదని వెల్లడించారు.
మన సొంత శక్తిని గుర్తించాలని, మన వనరులపై నమ్మకం ఉండాలని తెలిపారు. మన దృఢ సంకల్పాన్ని శక్తిగా మార్చుకుని, కఠిన శ్రమ ద్వారా అనుకున్నది సాధించాలని చెప్పారు. లక్ష్య సాధన కోసం చేసే ప్రయాణంలో ఎదురయ్యే కష్టాలు మనల్ని ఆపలేవని శ్రీరామచంద్రుడు మనకు నేర్పించారని పేర్కొన్నారు. ముందు సముద్రం ఉంది, లంక చాలా దూరంలో ఉంది, అయినప్పటికీ శ్రీరాముడు ప్రజల సామూహిక శక్తిని మేల్కొలిపి, వారి భాగస్వామ్యాన్ని తనకు అండగా చేసుకుని, అసాధ్యమనిపించిన లక్ష్యాన్ని సుసాధ్యం చేశారని మోదీ వివరించారు. విజయానికి ఇదే మూల మంత్రమని పేర్కొన్నారు. ఎంతటి కఠిన సవాళ్లు ఎదురైనా చివరికి సత్యమే, మానవత్వమే గెలుస్తాయనే నమ్మకాన్ని విజయదశమి కలిగిస్తుందని తెలిపారు.


