బెల్లం అన్నం
కావలసినవి: బియ్యం: కప్పు, బెల్లం: ముప్పావు కప్పు, నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు, పాలు: అర కప్పు, ఏలకుల పొడి: అర టీ స్పూన్, జీడిపప్పు, కిస్మిస్: కొద్దిగా
తయారీ: ముందుగా బియ్యాన్ని మెత్తగా ఉడికించాలి. బెల్లాన్ని కొద్దిగా నీటిలో కరిగించి వడకట్టాలి. ఒక పాత్రలో బెల్లం పాకాన్ని మరిగించి, అందులో అన్నం వేసి బాగా కలపాలి. తరువాత పాలు, నెయ్యి, ఏలకుల పొడి వేసి రెండు మూడు నిమిషాలు ఉడికించాలి. చివరగా నెయ్యిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్ వేసి కలపాలి. వేడి వేడిగా వడ్డిస్తే రుచికరమైన బెల్లం అన్నం సిద్ధం.
భగర్ కిచిడీ
కావలసినవి: భగర్ (సామలు లేదా వ్రత బియ్యం): కప్పు, పెసరపప్పు: అర కప్పు, వేరుశెనగపప్పు: 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి: 2, జీలకర్ర: అర టీ స్పూన్, నెయ్యి: టేబుల్ స్పూన్, ఉప్పు: తగినంత, నీరు: 3 కప్పులు.
తయారీ: ముందుగా భగర్, పెసరపప్పును కడిగి పక్కన పెట్టాలి. కుక్కర్లో నెయ్యి వేసి జీలకర్ర, పచ్చిమిర్చి, వేరుశెనగపప్పు వేయించాలి. తరువాత భాగర్, పెసరపప్పు, ఉప్పు వేసి కలపాలి. తగినంత నీరు పోసి కుక్కర్లో మెత్తగా ఉడికించాలి. కుక్కర్లో ఆవిరి తగ్గిన తర్వాత మూత తీసి బాగా కలపాలి. వేడి వేడిగా వడ్డిస్తే రుచికరమైన భాగర్ కిచిడీ సిద్ధం.
కదంబం
కావలసినవి: బియ్యం: కప్పు, కందిపప్పు:
అర కప్పు, కూరగాయలు (క్యారెట్, బీన్స్, వంకాయ, సొరకాయ): 2 కప్పులు,
చింతపండు: చిన్న నిమ్మకాయంత, సాంబార్ పొడి: 2 టేబుల్ స్పూన్లు, పసుపు: పావు టీ స్పూన్, ఉప్పు: తగినంత, నెయ్యి: టేబుల్ స్పూన్, తాలింపు కోసం– నూనె: టేబుల్ స్పూన్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు.
తయారీ: ముందుగా బియ్యం, కందిపప్పును కడిగి కుక్కర్లో వేసి తగినంత నీరు పోసి, మెత్తగా ఉడికించాలి. మరో పాత్రలో కొద్దిగా నూనె వేసి కూరగాయలను వేయించి, పసుపు, ఉప్పు, సాంబార్ పొడి వేసి ఉడికించాలి. తరువాత చింతపండు రసం పోసి కొన్ని నిమిషాలు మరిగించాలి. ఇందులో ఉడికించిన అన్నం, పప్పు వేసి బాగా కలిపి మరికొద్దిసేపు ఉడికించాలి. చివరగా నెయ్యి వేసి తాలింపు పెట్టాలి. వేడి వేడిగా కదంబాన్ని వడ్డిస్తే రుచిగా ఉంటుంది.
శాకాన్నం
కావలసినవి: బియ్యం: కప్పు, రకరకాల కూరగాయల ముక్కలు: 2 కప్పులు, పెసరపప్పు: అర కప్పు, పచ్చిమిర్చి: 2, అల్లం: చిన్న ముక్క, పసుపు: పావు టీ స్పూన్, ఉప్పు: తగినంత, నెయ్యి: టేబుల్ స్పూన్, తాలింపు కోసం: జీలకర్ర, ఆవాలు, కరివేపాకు.
తయారీ: బియ్యం, పెసరపప్పును కడిగి కుక్కర్లో వేసుకోవాలి. అందులో తరిగిన కూరగాయలు, పచ్చిమిర్చి, అల్లం, పసుపు, ఉప్పు, తగినంత నీరు వేసి మెత్తగా ఉడికించాలి. తరువాత నెయ్యిలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకుతో తాలింపు వేసి అన్నంలో కలపాలి. వేడి వేడిగా వడ్డిస్తే రుచికరమైన శాకాన్నం సిద్ధం.
ఇదీ చదవండి: గుమ్మడితో పండగ ముస్తాబు! దిష్టికే కాదు..అలంకరణకుకూడా..


