అలా మొదలైంది..!∙ 1757... ఓ కార్నివాల్‌.. | Devotion: What has changed this Durga Puja in Bengal | Sakshi
Sakshi News home page

అలా మొదలైంది..!∙ 1757... ఓ కార్నివాల్‌..

Oct 18 2026 8:57 AM | Updated on Oct 18 2026 8:57 AM

Devotion: What has changed this Durga Puja in Bengal

వినాయక చవితి తర్వాత వచ్చే నవరాత్రి ఉత్సవాలను దేశవ్యాప్తంగా వాడవాడలా ఘనంగా జరుపుకుంటారు. దేవీ నవరాత్రులకు దుర్గామాతను రోజుకో వేషధారణలో అలంకరించి భక్తులు ఎంతో శ్రద్ధతో ఆరాధిస్తారు. అయితే గణనాథుని ఆరాధించినట్టే దుర్గామాతను పెద్దపెద్ద విగ్రహాలతో నడివీధుల్లో పందిరి వేసి ఎందుకు ఆరాధిస్తారో తెలుసా? నిజం చెప్పాలంటే బహిరంగ ప్రదేశాలలో వినాయక విగ్రహారాధన కంటే ముందే దుర్గామాత ఆరాధించడం మొదలైంది. అది తెలుసుకోవాలంటే మనం చరిత్రలో ఒక్కసారి వెనక్కి వెళ్లాలి. 

1757కు పూర్వం, బెంగాల్‌ ప్రావిన్స్‌లో దుర్గాపూజ అనేది గ్రామీణ జమీందారుల గృహాలకే పరిమితమైన ఒక నిరాడంబర మతాచారం. అయితే, 1757 ప్లాసీ యుద్ధంలో నవాబు సిరాజ్‌–ఉద్‌–దౌలాపై ఈస్టిండియా కంపెనీ సాధించిన విజయం ఈ వేడుకల రూపురేఖలను సమూలంగా మార్చివేసింది. చారిత్రక ఆధారాల ప్రకారం, ప్లాసీ విజయోత్సాహంలో రాబర్ట్‌ క్లైవ్‌ ఘనంగా కృతజ్ఞతా ప్రార్థనలు జరపాలని భావించాడు. అయితే యుద్ధంలో కలకత్తాలోని ఏకైక చర్చి నేలమట్టం కావడంతో, క్లైవ్‌ ఆంతరంగికుడు, పర్షియన్‌ అనువాదకుడైన రాజా నబకృష్ణ దేబ్‌ చర్చికి ప్రత్యామ్నాయంగా దుర్గామాతకే కృతజ్ఞతా నివేదనలు సమర్పించాల్సిందిగా క్లైవ్‌ను తన రాజభవనానికి ఆహ్వానించాడు. 

క్లైవ్‌ రాకను పురస్కరించుకుని ఈ వేడుకను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు, దేబ్‌ బెంగాల్‌ నలుమూలల నుంచి నిపుణులైన శిల్పులను, కుమ్మరులను రప్పించి అత్యద్భుతమైన దుర్గాదేవి మృణ్మయ ప్రతిమను రూపొందించాడు. ఈ ఘటనే భవిష్యత్తుకు ఒక ఒరవడిగా మారింది. అయితే 1840లో అనేక ఒత్తిళ్ల కారణంగా స్థానిక మతోత్సవాలలో బ్రిటిష్‌ అధికారులు, సైనికులు పాల్గొనడాన్ని, నిధులు కేటాయించడాన్ని ఈస్టిండియా కంపెనీ అధికారికంగా నిషేధించింది. తర్వాత ఈస్టిండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా 1857లో పెల్లుబికిన ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం నాటికి, దుర్గాపూజ బ్రిటిష్‌ విజయాల సంబరాల స్థాయి నుంచి పూర్తిగా వైదొలిగింది. 

బెంగాల్‌ ప్రజల్లో జాతీయ భావాన్ని, ఐక్యతను, ఆత్మగౌరవాన్ని రగిలించేందుకు స్వాతంత్య్ర సమరయోధులు సమర్థవంతంగా వినియోగించుకున్న శక్తిమంతమైన వలస పాలనా వ్యతిరేక వేదికగా దుర్గా పూజ అవతరించింది. స్వాతంత్య్రానంతరం బెంగాల్‌లో దుర్గాపూజ ఒక మహోన్నత సాంస్కృతిక కార్నివాల్‌గా విలసిల్లుతూ, భారతదేశంలో బెంగాలీ జాతి ప్రత్యేక అస్తిత్వానికి, సాంస్కృతిక వైభవానికి తిరుగులేని ప్రతీకగా నిలిచింది. 
– బి.మల్లారెడ్డి, ఐపీఎస్‌ రిటైర్డ్‌

ఇదీ చదవండి: పీఎం సీట్లో ఉన్నా..తప్పని ఇంటపనులు..! జపాన్‌ మహిళా ప్రధాని కష్టాలు..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement