చీకటి పడగానే ఒక్కో గుమ్మడికాయ వెలుగులు విరజిమ్ముతుంది. కొన్నింటిలో వింత ఆకృతులు, మరికొన్నింటిలో అందమైన కళారూపాలు– ఇంకొన్నింటిలో హాలోవీన్ మాయాజాలం! ఇలా వేలాది గుమ్మడికాయలు ఒకేసారి వెలిగితే– అది కళ్లముందు ఆవిష్కృతమయ్యే ఓ అద్భుత లోకం. కెనడాలోని ‘అప్పర్ కెనడా’ విలేజ్లో జరిగే ‘పంప్కిన్ ఫెర్నో’ అలాంటి ప్రత్యేక అనుభూతినే అందిస్తుంది. ఎప్పటి లాగే ఈ ఏడాది కూడా అక్టోబర్ 2 నుంచి 31 వరకు ఎంపిక చేసిన రాత్రుల్లో జరుగుతున్న ఈ వేడుక సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
పంప్కిన్ ఫెర్నో అంటే సాధారణంగా ఇంటి ముందు పెట్టుకునే జాక్–ఓ–లాంతర్లు కాదు. గుమ్మడికాయల ఆకారాన్ని పోలివుండే వాటిపై కళాకారులు ఎంతో నైపుణ్యంతో అందమైన ఆకృతులు చెక్కుతారు. వాటిలో వెలుగులు ఏర్పాటు చేసి రాత్రివేళ ప్రదర్శిస్తారు. ఫలితంగా ఒక్కో గుమ్మడికాయ ఓ చిన్న కళాఖండంలా కనిపిస్తుంది.
2012లో మొదలైన పండుగ
పంప్కిన్ఫెర్నో 2012లో అప్పర్ కెనడా విలేజ్లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది మరింత అందంగా ముస్తాబవుతూ, కొత్త ప్రదర్శనలను జోడిస్తూ ఈ వేడుక సాగుతోంది. అయితే ఈ అందమైన ఉత్సవం వెనుక యువ కళాకారుల శ్రమ ఎంతో దాగుంది. తూర్పు అంటారియోకు చెందిన విద్యార్థి కళాకారుల బృందం వసంతకాలం నుంచే ఈ అందమైన గుమ్మడి రూపాలను చెక్కడం, మెరుగులు దిద్దడం వంటి నిర్మాణ పనులను ప్రారంభిస్తుంది.
సుమారు నాలుగు నెలల పాటు శ్రమించి, దాదాపు తొమ్మిదివేలకు పైగా కృత్రిమ గుమ్మడి కాయల ఆకృతులను తయారు చేస్తారు. వీటిపై కేవలం సాధారణ ముఖాలు మాత్రమే కాకుండా, ప్రపంచ ప్రసిద్ధ చిత్రాలు, భారీ డైనోసార్లు, కెనడా చరిత్రను ప్రతిబింబించే ఆకృతులను అద్భుతంగా చెక్కి లైటింగ్ అమరుస్తారు.
సంగీతం కూడా..
ఇక్కడ కేవలం గుమ్మడికాయల ప్రదర్శనే కాదు, సంగీతానికి అనుగుణంగా వెలుగులు మార్చుకునే ప్రత్యేక లైట్ అండ్ సౌండ్ షో కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులు, పిల్లలు సరదాగా ఫొటోలు తీసుకునేందుకు, ఆటలు ఆడేందుకు ఇంటరాక్టివ్ జోన్ను కూడా ఏర్పాటు చేస్తారు. పిల్లల కోసం ప్రత్యేకంగా వెలుగులతో అలంకరించిన చిన్న రైలు ప్రయాణం కూడా ఉంటుంది. అంతేకాదు ప్రత్యేకమైన రుచులతో కూడిన వంటకాలు కూడా నోరూరిస్తుంటాయి.
19వ శతాబ్దం నుంచే...
గుమ్మడి కాయలను చెక్కి దీపాలు పెట్టే సాంప్రదాయం ఐర్లండ్, అమెరికాలలో 19వ శతాబ్దం నుంచే ఉంది. పూర్వం దుష్టాత్మలను తరిమికొట్టడానికి, చనిపోయిన పూర్వీకుల ఆత్మలకు దారి చూపడానికి టర్నిప్ దుంపలపై, ఆ తరువాత గుమ్మడికాయలపై ముఖాలను చెక్కడం ప్రారంభించారు. అలా ఆ పాత సంప్రదాయానికి సరికొత్త డిజిటల్, ఆధునిక కళాత్మక రూపాన్ని ఇచ్చిందే ఈ ‘పంప్కిన్ ఫెర్నో’ ఉత్సవం. అలా ఈ వేడుక కేవలం కెనడాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఆకర్షించే ఒక గొప్ప సాంస్కృతిక కళోత్సవంగా నిలుస్తోంది.
రమా జంబుల
ఇదీ చదవండి: రేడియంట్ బ్యూటీ! పొరపాటున కూడా ఆ తప్పు చేయొద్దు..


