క్రిస్మస్ సందర్భంగా ఇంటి అలంకరణలో కొత్తదనం తేవడానికి గ్లాస్‌బౌల్‌లో మినియేచర్ డెకర్ చక్కగా సరిపోతుంది. చిన్న చిన్న వస్తువులతో పెద్ద క్రిస్మస్ ప్రపంచాన్ని ఇంట్లో మనమే సృష్టించుకోవచ్చు. క్రిస్మస్ డెకర్ బౌల్‌ను టేబుల్, షెల్ఫ్, కార్నర్‌లాంటి చోట్ల అమర్చుకుంటే, ఇంటికి పండుగ కళ వస్తుంది. రకరకాల మినియేచర్ క్రిస్మస్ డెకర్ బౌల్స్, జార్స్ రెడీమేడ్‌గా మార్కెట్‌లోనూ దొరుకుతున్నాయి.
గ్లాస్ బౌల్ డెకర్
పారదర్శకంగా ఉండే క్రిస్మస్ మినియేచర్ బౌల్స్, జార్స్‌కు చాలామంది ప్రాధాన్యం ఇస్తున్నారు. వీటిని తక్కువ స్థలంలో ఏర్పాటు చేసుకోవచ్చు.
ఆకాశమే హద్దు...
నేలంతా పరుచుకున్న మంచు తివాచీ, వాటి మీదుగా మంచు తెరలు కప్పుకున్న వృక్షాలు, ఇళ్లు, క్రిస్మస్ తాత, మెరిసే తారలు.. ఇలా సమస్త విశ్వపు వేడుక అందాన్ని ఒక గాజు పాత్రలోకి ఇట్టే తీసుకురావచ్చు. ఫిష్ అక్వేరియంకు ఉపయోగించే గాజు పాత్రను కూడా ఈ మినియేచర్ ఆర్ట్‌కు కేటాయించవచ్చు. మంచు అనుభూతిని తెప్పించడానికి తెల్లని, మెత్తని దూది, చిన్న చిన్న క్రిస్మస్ ట్రీలు, మినీ సాంటా, జింక, స్నో మ్యాన్, హౌస్ ఫిగర్స్, పైన్‌కోన్స్, చిన్న చిన్న ఆర్నమెంట్స్, మినీ ఎల్‌ఈడీ ఫెయిరీ లైట్స్‌తో ఊహలకు ఓ రూపం తీసుకురావచ్చు.
స్నో గ్లోబ్ స్టయిల్
తెల్లటి ఫేక్ స్నో, ఒక ట్రీ + ఒక హౌస్ ఫిగర్‌తో మినిమలిస్టిక్ లుక్ తీసుకురావచ్చు. కృత్రిమ ఆకులు, చెర్రీపండ్లు, రిబ్బన్లు కూడా ఉపయోగించవచ్చు.
క్రిస్మస్ విలేజ్ థీమ్
చిన్న చిన్న ఇళ్లు, మంచు దారికి కాటన్ పాత్, ఎల్‌ఈడీ స్ట్రీట్ ల్యాంప్స్‌తో చిన్న గ్రామాన్ని గాజు పాత్రలో రూపొందించవచ్చు.
ఎక్కడ ఉంచాలంటే..
సిద్ధం చేసుకున్న మినియేచర్ క్రిస్మస్ బౌల్‌ను లివింగ్ రూమ్‌లో సెంటర్ టేబుల్, షెల్ఫ్, ఎంట్రన్స్ టేబుల్, బెడ్‌సైడ్ లాంప్ పక్కన, డైనింగ్ టేబుల్ సెంటర్ పీస్‌గా... ఎక్కడ పెట్టినా క్రిస్మస్ పండగ ప్రపంచం కళ్లకు కనువిందు చేస్తూ చూపులను ఇట్టే కట్టిపడేస్తుంది.
- ఎన్నార్


