పెదవుల అందం కోసం లిప్‌స్టిక్‌లు, లిప్‌బామ్‌లు వంటి సాధనాలు చాలానే ఉన్నాయి. తాజాగా పెదవుల సంరక్షణ కోసం అమోర్ పసిఫిక్ లిప్క్యూర్ బీమ్ అందుబాటులోకి వచ్చింది. పెదవుల్లో తేమ శాతాన్ని గుర్తించడం, సంరక్షించడం, మేకప్ చేయడం– ఈ మూడు పనులూ చేసేలా అధునాతన సాంకేతికతతో ఈ పరికరాన్ని రూపొందించారు. ఈ లిప్క్యూర్ బీమ్‌లో ప్రత్యేకమైన సెన్సర్ క్యాప్ ఉంటుంది. ఇది పెదవుల్లో తేమ శాతాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది.
సెన్సర్క్యాప్ను ప్రధాన కంటైనర్ నుంచి వేరు చేసిన తరువాత బ్రష్ తరహా అప్లికేటర్ ఉంటుంది. ఈ అప్లికేటర్ మెరిసే కాంతిపుంజాన్ని ప్రసారం చేస్తుంది. ఈ కాంతిపుంజం కొలాజెన్ ఫైబర్స్‌ను బలోపేతం చేయడానికి, చర్మాన్ని సంరక్షణకు తోడ్పడుతుంది. ఇందులోని యూనివర్సల్ కలర్ సిస్టమ్ ఈ గాడ్జెట్ మరో ప్రత్యేకత. ఇది పెదవుల సహజమైన రంగుకు అనుగుణంగా మేకప్ కలర్‌ను మెరుగ్గా కనిపించేలా చేస్తుంది. ఇంట్లోనే కాకుండా, ప్రయాణాల్లో కూడా దీనిని సులువుగా ఉపయోగించుకునేలా దీనిని రూపొందించారు.
నెయిల్ కేర్‌లో ఈ తప్పులు చేస్తున్నారా?
చర్మానికి తేమ అవసరమైనట్లే గోళ్ల చుట్టుపక్కల ప్రాంతానికీ తేమ అవసరం. తరచు చేతులు కడుక్కోవడం, ఎక్కువ గాఢత గల సబ్బులు లేదా డిటర్జెంట్లను ఉపయోగించడం, ఏసీ వాతావరణంలో ఎక్కువసేపు ఉండటం వల్ల గోర్లు మరింత పొడిబారే అవకాశం ఉంది. అందువల్ల జోజోబా ఆయిల్ లేదా ఆల్మండ్ ఆయిల్‌ను గోరు, దాని చుట్టూ ఉన్న చర్మంపై క్రమం తప్పకుండా అప్లై చేయడం ద్వారా తేమను కాపాడుకోవచ్చు.
అలాగే నెయిల్‌పాలిష్‌ను త్వరగా తొలగించేందుకు అసిటోన్‌తో కూడిన రిమూవర్లను ఉపయోగిస్తుంటారు. దీనివల్ల గోరు ఉపరితలంపై ఉండే సహజమైన నూనెల పొర తొలగిపోతుంది. దాంతో గోర్లు పొడిబారి, తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. అందువల్ల నాన్ అసిటోన్ రిమూవర్‌ను ఉపయోగించడం మంచిది. గోళ్లపై గీతలు, అసమానతలు కనిపించకుండా చేసేందుకు బఫింగ్ చేస్తుంటారు.
కానీ ఎక్కువ రఫ్‌గా ఉన్న బఫర్‌తో పదేపదే గోళ్లను రుద్దడం వల్ల కెరాటిన్ పొరలు తొలగిపోయే అవకాశం ఉంది. మ్యానిక్యూర్ సమయంలో క్యూటికల్స్‌ను కత్తిరించడం చాలా సాధారణం. కానీ క్యూటికల్ అనేది తొలగించాల్సిన నిరుపయోగమైన చర్మం కాదని నెయిల్ కేర్ నిపుణులు చెబుతున్నారు. ఇది గోరు, దాని కింద ఉన్న చర్మం మధ్య ఒక సహజ రక్షణ పొరలా పనిచేస్తుంది.
రేడియంట్ బ్యూటీ!
రేడియం కనుగొన్న తొలినాళ్లలో అదొక అద్భుత సౌందర్య సాధనంగా ప్రజల దృష్టిలో నిలిచింది. వైద్య రంగంలోనే కాకుండా, కాస్మెటిక్స్ తయారీదారులు తమ ఉత్పత్తుల్లో కూడా రేడియంను విరివిగా ఉపయోగించేవారు. కొన్ని కాస్మెటిక్స్ కంపెనీలు తమ ఉత్పత్తుల్లో రేడియం ఉన్న విషయాన్ని ప్రత్యేక లక్షణంగా ప్రచారం చేసేవారు. రేడియం కలిగినటువంటి ఫేస్ క్రీములు, పౌడర్లు, సబ్బులను మార్కెట్లోకి తీసుకువచ్చేవారు.
అందం, యవ్వనం పెరుగుతుందనే ఉద్దేశంతో అప్పట్లో ప్రజలు వీటిని ఎగబడి కొనేవారు. రేడియం శరీరంలోని ఆరోగ్యకరమైన కణజాలాలను దెబ్బతీసి, క్యాన్సర్ వంటి ప్రమాదాలను పెంచుతుందని అప్పట్లో ప్రజలకు తెలిసేది కాదు. తర్వాతి కాలంలో రేడియం వల్ల తలెత్తే ప్రమాదాలు తెలిసివచ్చాక, సౌందర్య ఉత్పత్తుల్లో దీని వాడకాన్ని నిషేధించారు.
ఇదీ చదవండి: నటి కంగనా రనౌత్ పండుగ లుక్..! ఆ లెహంగా అంత ఖరీదా..


