అమలాపురం దసరా ఉత్సవాల్లో ఎస్సైకి కత్తిపోటు
ఐదుగురు కొంకాపల్లి ఉత్సవ నిర్వాహకులపై కేసు నమోదు
అమలాపురం టౌన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో బుధవారం రాత్రి జరిగిన దసరా ఉత్సవాల ఊరేగింపుల్లో స్థానిక ముమ్మిడివరం గేటు సెంటరులో విధుల్లో ఉన్న ఐ.పోలవరం ఎస్సై ఎంవీవీ రవీంద్రబాబుపై కొంకాపల్లి ఉత్సవాలకు చెందిన ఓ వ్యక్తి కత్తితో దాడిచేసి గాయపరిచాడు. ఎస్సై ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కొంకాపల్లి ఉత్సవ కమిటీకి చెందిన ఐదుగురితోపాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై ఎన్‌ఆర్ కిశోర్‌బాబు తెలిపారు.
ఆయన చెప్పిన వివరాల ప్రకారం..
ఎస్సైపై బుధవారం అర్ధరాత్రి దాటాక 2.35 గంటలకు ఈ దాడి జరిగింది. కొంకాపల్లి వాహనానికి, మహిపాల వీధి వాహనానికి మధ్య పోలీస్ జీపును పెట్టి ఆ వీధుల మధ్య వివాదం తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కొంకాపల్లి సంబరాన్ని ముందుకు తీసుకెళ్లాలని పోలీసు అధికారులు పదేపదే ఆ వీధి ఉత్సవ కమిటీ నిర్వాహకులకు చెబుతున్నా వారు లెక్కచేయలేదు. పైగా.. మహిపాల వీధి వారిని రెచ్చగొట్టేలా కొంకాపల్లి వీధి వారు కత్తులు, కర్రలు తిప్పుతూ ఉద్రేకపూర్వకంగా మాట్లాడారు. ఈ క్రమంలో ఐ.పోలవరం ఎస్సై పోలీస్ సెక్షన్–30 అమలులో ఉందని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
అయినా కొంకాపల్లి వీధికి చెందిన కొంతమంది వ్యక్తులు పోలీసులపై దాడి చేసేందుకు కాలుదువ్వారు. ఇంతలో ఎస్సై రవీంద్రబాబును వెనుక నుంచి ఓ వ్యక్తి కత్తితో పొడిచి పరారయ్యాడు. దీంతో ఎస్‌ఐకి తీవ్ర రక్తస్రావమవడంతో ఆయన్ను తోటి పోలీసులు ఆస్పత్రికి తరలించారు. తనపై ఉద్దేశపూర్వకంగానే కత్తితో దాడిచేశారని ఎస్సై తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కొంకాపల్లి ఉత్సవ కమిటీ నిర్వాహకులు చిక్కాల రాంబాబు, పనసా ఈశ్వరరావు (బుజ్జి), దూలం అబ్బాయి తాత, పనసా అబ్బు, గుమ్మళ్ల శ్రీనుతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిశోర్‌బాబు తెలిపారు.


