మణిపూర్‌లో మళ్లీ హింస: ఒకరు మృతి, పలువురికి గాయాలు | One dead, several injured in clashes in Manipur | Sakshi
Sakshi News home page

మణిపూర్‌లో మళ్లీ హింస: ఒకరు మృతి, పలువురికి గాయాలు

Oct 19 2026 1:02 PM | Updated on Oct 19 2026 1:05 PM

One dead, several injured in clashes in Manipur

తౌబాల్: మణిపూర్‌లోని తౌబాల్ జిల్లా పరిధిలోని ఖంగాబోక్ గ్రామంలో ఆదివారం రాత్రి సంగీత కచేరీ జరుగుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత మొదలైంది. ఈ వివాదం కాస్తా రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఖంగాబోక్, సంగైయుంఫమ్ పరిసర ప్రాంతాల్లో ఇరువర్గాలు పరస్పరం రాళ్లు విసురుకోవడంతో పాటు కొన్ని ఇళ్లు, వాహనాలకు నిప్పంటించారు.

ఈ ఘర్షణల సమయంలో దుండగులు జరిపిన కాల్పుల్లో తలకు తీవ్ర గాయమైన లైష్రామ్ రాకేష్ అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, రాళ్ల దాడిలో గాయపడిన పలువురు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అసాంఘిక శక్తుల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు జిల్లా మేజిస్ట్రేట్ ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత’ (బీఎన్‌ఎస్‌ఎస్‌) సెక్షన్ 163 కింద రాత్రి 11 గంటల నుంచి ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని నిషేధాజ్ఞలు జారీ చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు రాష్ట్ర, కేంద్ర భద్రతా బలగాలను సంఘటనా స్థలానికి తరలించారు. భద్రతా బలగాల మోహరింపుతో సోమవారం ఉదయానికి రెండు గ్రామాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చిందని, ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చదవండి: నోబెల్ గ్రహీతను అభినందించరా?.. కేంద్రంపై శశి థరూర్ గుర్రు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement