అమెరికా విదేశాంగ మంత్రి రూబియో వెల్లడి
వాషింగ్టన్: భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు తుది దశకు చేరుకుందని అమెరికా విదేశాంగ మంత్రి మా ర్కో రూబియో సోమవారం చెప్పారు. అయితే, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై అమల్లోకి వచ్చే టారిఫ్‌లకు సంబంధించిన నిర్ణయం మాత్రమే ఇంకా మిగిలి ఉందన్నారు. జాతీయ భద్రత, అందుకు సంబంధించిన ఇతర అంశాలపై అధ్యక్షుడు నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ వాణిజ్య ఒప్పంద అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటామని రూబియో వెల్లడించారు. కొన్ని వాస్తవ పరిస్థితులు, ఇబ్బందుల దృష్ట్యా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందని చెప్పారు.
కేవలం ఈ ఒక్క సమస్యను ఆధారంగా చేసుకుని ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలను ఒక్కసారిగా మార్చలేమని, ఇది చాలా సంక్లిష్టమైన విషయమని రూబియో పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ విధానం కేవలం రష్యా–ఉక్రెయిన్ యుద్ధం చుట్టూనే తిరగదని, ఇతర దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు, వారి ఇంధన అవసరాలను తీర్చుకునే వాస్తవ సామర్థ్యాలు వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. రూబియో త్వరలో ముంబైలో మంత్రి జైశంకర్‌తో ఒప్పందానికి సంబంధించిన నిర్ణయాలను ఖరారు చేసే అవకాశాలున్నాయని సమాచారం.


