రాజకీయ రణరంగం వేళ.. రాహుల్‌ వియత్నాం టూర్‌ | Congress over sir Rahul Gandhi leaves for Vietnam | Sakshi
Sakshi News home page

రాజకీయ రణరంగం వేళ.. రాహుల్‌ వియత్నాం టూర్‌

Oct 19 2026 1:28 PM | Updated on Oct 19 2026 1:33 PM

Congress over sir Rahul Gandhi leaves for Vietnam

న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న వేళ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆకస్మికంగా వియత్నాం బయలుదేరి వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం 1:35 గంటల సమయంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆయన హనోయ్ బయలుదేరినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ పర్యటన వ్యక్తిగతమైనదా లేక అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకా అనే అంశంపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో ఈ పర్యటన చోటుచేసుకుంది. బీజేపీతో కలిసి ఎన్నికల సంఘం ‘ఓట్ల చోరీ’ చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలతో సీఈసీ పని చేస్తున్నారని పేర్కొంటూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, జ్ఞానేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.

వియత్నాం పర్యటనకు వెళ్లడానికి ముందు ఆదివారం గోవాలోని మార్గావ్‌లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రణాళికతో, అమిత్ షా అమలు చేస్తూ, సీఈసీ జ్ఞానేష్ కుమార్ ద్వారా ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తమ చర్యలకు మోదీ, అమిత్ షా, జ్ఞానేష్ కుమార్ తప్పకుండా న్యాయపరంగా మూల్యం చెల్లించుకోక తప్పదని, వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు.

రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై భారతీయ జనతా పార్టీ ఎప్పటిలాగే తీవ్ర విమర్శలు గుప్పించింది. దేశంలో కీలక రాజకీయ పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన విదేశాలకు వెళ్లడంపై ప్రశ్నిస్తూ, గతంలో జనవరిలో కూడా ఆయన వియత్నాం వెళ్లిన విషయాన్ని ప్రస్తావించింది. విదేశీ వేదికలపై ప్రధాని మోదీని, భారత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ దేశ ప్రతిష్టను దిగజార్చేలా ఆయన వ్యవహరిస్తున్నారని, ఆయనను విదేశాలకు ఎవరు ఆహ్వానిస్తున్నారో కాంగ్రెస్ పార్టీ బహిర్గతం చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. 

ఇదీ చదవండి: మణిపూర్‌లో మళ్లీ హింస: ఒకరు మృతి, పలువురికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement