న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్) ప్రక్రియను 2027కి సంబంధించి 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో చేపట్టేందుకు భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై నిరసనలు కొనసాగుతున్న వేళ ఈ నిర్ణయం తీసుకుంది. 2026లో వార్షిక ఎస్ఎస్ఆర్ ప్రక్రియను చేపట్టని ఎన్నికల సంఘం.. ఇప్పుడు వచ్చే ఏడాది జనవరి 1ని అర్హత తేదీగా నిర్ణయించింది. 2027 ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
రాజ్యాంగంలోని 324వ అధికరణం ప్రకారం పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల ఎన్నికల కోసం ఓటర్ల జాబితాలను సిద్ధం చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. ప్రజాప్రాతినిధ్య చట్టం-1950తో పాటు ఓటర్ల నమోదు నిబంధనలు, 1960 ప్రకారం ఈ జాబితాల తయారీ, సవరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఎస్ఎస్ఆర్లో ఇప్పటికే ఉన్న ఓటర్ల జాబితాను నవీకరిస్తారు. కొత్తగా అర్హత సాధించినవారి పేర్లను చేర్చడంతో పాటు మరణించినవారు, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లినవారి వివరాలను నిబంధనల ప్రకారం సరిచేస్తారు.
ఎస్ఎస్ఆర్, ఎస్ఐఆర్ మధ్య తేడాలివే..
| అంశం | ఎస్ఎస్ఆర్ (ప్రత్యేక సంక్షిప్త సవరణ) | ఎస్ఐఆర్ (ప్రత్యేక సమగ్ర సవరణ) |
|---|---|---|
| ఉద్దేశం | ఇప్పటికే ఉన్న ఓటర్ల జాబితాను నవీకరించి, వివరాల్లోని తప్పులను సరిచేయడం. | ఓటర్ల జాబితాను విస్తృతంగా సవరించి, ఓటర్ల అర్హతను మరోసారి నిర్ధారించడం. |
| ప్రక్రియ స్వరూపం | సాధారణంగా ఏటా చేపట్టే సవరణ ప్రక్రియ. | సమగ్ర సవరణ అవసరమైనప్పుడు చేపట్టే ప్రత్యేక ప్రక్రియ. |
| నిర్వహించే కాలం | సాధారణంగా ఏటా నిర్వహిస్తారు. జనవరి 1ను అర్హత తేదీగా పరిగణిస్తారు. | ఎన్నికల సంఘం నిర్ణయించినప్పుడు నిర్వహిస్తారు. ఇది సాధారణ వార్షిక ప్రక్రియ కాదు. |
| ఇప్పటికే ఉన్న ఓటర్ల జాబితా | ప్రస్తుత జాబితాలో అవసరమైన మార్పులు, చేర్పులు, సవరణలు చేస్తారు. | ఓటర్ల అర్హతను పరిశీలిస్తూ జాబితాను కొత్తగా రూపొందిస్తారు. |
| ఇప్పటికే నమోదైన ఓటర్లు | ప్రస్తుత ఓటర్ల పేర్లు ముసాయిదా జాబితాలో కొనసాగుతాయి. | ముసాయిదా జాబితాలో చోటు పొందేందుకు ఓటర్లు నిర్దేశిత నమోదు పత్రాలను సమర్పించాలి. |
| కొత్త ఓటర్ల నమోదు | అర్హులైన పౌరులు ఫామ్ 6 ద్వారా పేరు నమోదు చేసుకోవచ్చు. | ఎన్నికల సంఘం నిర్దేశించిన నమోదు, ధ్రువీకరణ ప్రక్రియను అనుసరించాలి. |
| పత్రాల పరిశీలన | ఇప్పటికే నమోదైన ఓటర్లందరికీ ప్రత్యేకంగా పత్రాల పునఃపరిశీలన చేపట్టే ప్రణాళిక లేదు. | ఓటర్లు తమ అర్హతను నిరూపించేందుకు నిర్దేశిత పత్రాలు, వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో పౌరసత్వ ధ్రువీకరణ కూడా ఉంటుంది. |
| పేర్ల తొలగింపు | మరణించినవారు, నకిలీ నమోదులు వంటి పేర్లను చట్టబద్ధమైన నోటీసులు, విచారణ ప్రక్రియ అనంతరం తొలగించవచ్చు. | నిర్దేశించిన ప్రక్రియలో అర్హతను నిరూపించలేని వారి పేర్లు జాబితాలో చేరకపోవచ్చు. |
| పత్రాల్లో వ్యత్యాసాలు | సాఫ్ట్వేర్ గుర్తించిన వివరాల వ్యత్యాసాలపై అందరికీ నోటీసులు జారీ చేసే ప్రత్యేక ప్రక్రియను చేపట్టే ప్రణాళిక లేదు. | వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించిన ఓటర్లకు నోటీసులు ఇచ్చి, అదనపు పత్రాలు కోరవచ్చు. విచారణకు హాజరు కావాలని సూచించవచ్చు. |
| అభ్యంతరాలు, దరఖాస్తులు | ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత పేర్ల చేర్పులు, తొలగింపులు, వివరాల సవరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. | ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత అభ్యంతరాలు, దరఖాస్తులు సమర్పించవచ్చు. అదనపు ధ్రువీకరణ కూడా అవసరం కావచ్చు. |
| 2027లో అమలు | 2027 జనవరి 1ను అర్హత తేదీగా తీసుకుని 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. | ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక సమగ్ర సవరణ పరిధిలోని ప్రాంతాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. |


