ముంబై: ముంబైలో నటుడు టైగర్ ష్రాఫ్ ప్రయాణిస్తున్న కారుపై దుండగులు ఆదివారం అర్ధరాత్రి కాల్పులు జరపడం తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిలో టైగర్ ష్రాఫ్ స్వల్ప గాయాలతో బయటపడగా, ఆయన డ్రైవర్ చేతికి బుల్లెట్ తగలడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మహారాష్ట్ర ప్రభుత్వం నిందితులను గుర్తించేందుకు ముంబై క్రైమ్ బ్రాంచ్‌తో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది.
ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. దాడిని తీవ్రంగా ఖండించారు. పోలీసులకు ఇప్పటికే కీలక ఆధారాలు లభించాయని, అనుమానితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. ఈ దాడికి సూత్రధారులు మహారాష్ట్ర బయట లేదా విదేశాల్లో ఉండి వ్యవహారం నడిపిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎక్కడున్నా వారిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
అదే సమయంలో శాంతిభద్రతలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను సీఎం తీవ్రంగా తిప్పికొట్టారు. గత ప్రభుత్వాల హయాంలో పోలీస్ వ్యవస్థను రాజకీయాల కోసం వాడుకున్న చరిత్రను గుర్తు చేస్తూ, ప్రజలకు, చిత్ర పరిశ్రమకు ముంబై పోలీసులపై పూర్తి నమ్మకం ఉందన్నారు. ఈ దాడికి తామే కారణమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకోగా, పోలీసులు అన్ని కోణాల్లో లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి: ప్రభుత్వం గాడి తప్పితేనే ‘టైగర్’ లాంటి ఘటనలు: దిప్కే


