17 రాష్ట్రాల్లో ఇకపై ‘ఎస్‌ఎస్‌ఆర్‌’..‘సర్‌’కు ఎంత భిన్నం? | EC Orders Voter List Revision in 17 States | Sakshi
Sakshi News home page

17 రాష్ట్రాల్లో ఇకపై ‘ఎస్‌ఎస్‌ఆర్‌’..‘సర్‌’కు ఎంత భిన్నం?

Oct 17 2026 7:21 AM | Updated on Oct 17 2026 7:21 AM

EC Orders Voter List Revision in 17 States

దేశంలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర పరిశీలన (సర్‌)పై చర్చలు కొనసాగుతున్న వేళ.. భారత ఎన్నికల సంఘం మరో కీలక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్‌ఎస్‌ఆర్‌) చేపట్టాలని అక్టోబర్ 15న ఆదేశించింది. ఇప్పటికే ఉన్న ఓటరు జాబితాల్లో తప్పులను సరిదిద్దడం, అర్హులైన కొత్త ఓటర్లకు అవకాశం కల్పించడం ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం. అయితే ‘ఎస్‌ఎస్‌ఆర్‌’, ‘సర్‌’ పేర్లు దాదాపు ఒకేలా ఉండటంతో చాలామంది వీటిని ఒకటిగానే భావిస్తున్నారు. కానీ ఈ రెండు ప్రక్రియల విధానం, పరిధి, ప్రభావం వేర్వేరుగా ఉంటాయి.

ఏయే రాష్ట్రాల్లో అంటే?
అండమాన్‌ నికోబార్‌ దీవులు, అస్సాం, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, గోవా, గుజరాత్‌, కేరళ, లక్షద్వీప్‌, మధ్యప్రదేశ్‌, మణిపూర్‌, పుదుచ్చేరి, పంజాబ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పశ్చిమ బెంగాల్‌లలో ఎస్‌ఎస్‌ఆర్‌ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ప్రక్రియను 2027 జనవరి 1ను చేపడతారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, మణిపూర్‌, గోవా రాష్ట్రాలకు ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ‘సర్‌’ కొనసాగుతున్న లేదా ఇటీవల పూర్తయిన ఆంధ్రప్రదేశ్‌, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఢిల్లీ ప్రాంతాల్లో ‘ఎస్‌ఎస్‌ఆర్‌’ షెడ్యూల్‌ను విడిగా ప్రకటించనున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్‌ 21 ప్రకారం ఈ ప్రక్రియ చేపట్టనుండగా, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324 కింద ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

కొత్త ఓటర్లకు అవకాశం.. అర్హతలు ఏమిటి?
ప్రస్తుతం ఉన్న ఓటరు జాబితాను మరింత కచ్చితంగా, తప్పుల్లేకుండా రూపొందించడమే ‘ఎస్‌ఎస్‌ఆర్‌’ ప్రధాన లక్ష్యం. ఓటరు జాబితాలో పేర్లు లేని అర్హులైన పౌరులను చేర్చడం, ఇప్పటికే నమోదైన వివరాల్లో తప్పులను సరిచేయడం, అవసరమైన మార్పులు చేయడం ఇందులో భాగంగా ఉంటాయి. ముఖ్యంగా తొలిసారి ఓటు వేయనున్న యువతకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. 2027 జనవరి 1 నాటికి 18 ఏళ్లు పూర్తిచేసుకునే భారత పౌరులు ఓటరుగా నమోదు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. తదుపరి మూడు త్రైమాసికాలకు సంబంధించిన అర్హత తేదీల కోసం కూడా ముందస్తు దరఖాస్తు సౌకర్యం కల్పించాలని ఎన్నికల సంఘం సూచించింది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో చోటు పొందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, ఓటరు నమోదు అధికారులను ఆదేశించింది.

నవంబర్‌ 12న ముసాయిదా జాబితా
ఎస్‌ఎస్‌ఆర్‌ ప్రక్రియకు ఎన్నికల సంఘం నిర్దిష్ట కాలపట్టికను ప్రకటించింది. నవంబర్‌ 2వ తేదీలోగా పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ పూర్తి చేయాలి. నవంబర్‌ 12న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురిస్తారు. ఈ జాబితాలో పేర్లు, చిరునామాలు, ఇతర వివరాలను పరిశీలించుకోవడానికి పౌరులకు అవకాశం ఉంటుంది. జాబితాలో పేరు లేకపోయినా, వివరాల్లో తప్పులున్నా అభ్యంతరాలు లేదా దరఖాస్తులను డిసెంబర్‌ 11లోగా సమర్పించాలి. అందిన క్లెయిమ్‌లు, అభ్యంతరాలను డిసెంబర్‌ 28లోగా పరిష్కరించాల్సి ఉంటుంది. అనంతరం 2027 జనవరి 4న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు. కాబట్టి అర్హులైన పౌరులు ముసాయిదా జాబితా విడుదలైన వెంటనే తమ వివరాలను పరిశీలించుకోవడం ముఖ్యం.

పేరు నమోదు నుంచి చిరునామా మార్పు వరకు.. 
కొత్తగా ఓటరుగా నమోదు కావాలంటే ఫారం-6 సమర్పించాలి. ఇప్పటికే నమోదైన పేరును తొలగించడానికి లేదా సంబంధిత అభ్యంతరాల కోసం ఫారం-7, వివరాల్లో మార్పులు, దిద్దుబాట్లు, చిరునామా మార్పు వంటి అవసరాలకు ఫారం-8 ఉపయోగించవచ్చు. ఉత్తరప్రదేశ్‌ ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం, అర్హులైన పౌరులు ఎన్నికల సంఘం ఓటర్‌ సర్వీసెస్‌ పోర్టల్‌ లేదా ఈసీఐఎన్‌ఈటీ మొబైల్‌ యాప్‌ ద్వారా ఫారం-6ను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. ఇల్లు మారినవారు తమ చిరునామా వివరాలను కూడా సవిరిచుకోవాలి. మరోవైపు ముసాయిదా జాబితా ప్రచురణ నుంచి తుది జాబితా విడుదల వరకు సంబంధిత అధికారుల బదిలీలపై ఎన్నికల సంఘం నియంత్రణ విధించింది. ముందస్తు అనుమతి లేకుండా ఈ ప్రక్రియలో పనిచేసే అధికారులను బదిలీ చేయరాదని స్పష్టం చేసింది. ప్రధాన కార్యదర్శులు సంబంధిత ఖాళీలను భర్తీ చేసేలా చూడాలని కూడా ఆదేశించింది.

‘ఎస్‌ఎస్‌ఆర్‌’-‘సర్‌’మధ్య అసలు తేడా ఇదే!
ఎస్‌ఎస్‌ఆర్‌ను ఇప్పటికే ఉన్న ఓటరు జాబితాను సరిదిదద్దడంతో పోల్చవచ్చు. ‘సర్‌’ మాత్రం జాబితాను మరింత విస్తృతంగా పునఃపరిశీలించే ప్రక్రియ. ఎస్‌ఎస్‌ఆర్‌లో ప్రస్తుత జాబితాను ఆధారంగా చేసుకుని పేర్లు చేర్చడం, తొలగించడం, వివరాలను సరిచేయడం జరుగుతుంది. ‘సర్‌’లో బూత్‌ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను ధ్రువీకరిస్తారు. బిహార్‌లో జరిగిన ‘సర్‌’ సందర్భంగా 2003 తర్వాత నమోదైన ఓటర్లు తమ అర్హతను నిరూపించే పత్రాలు సమర్పించాల్సి వచ్చింది. ఎస్‌ఎస్‌ఆర్‌లో మాత్రం మొత్తం ఓటరు జాబితాను మొదటి నుంచి నిరూపించుకోవాలనే విధానం సాధారణంగా ఉండదు. ఎస్‌ఎస్‌ఆర్‌ను ఏడాదిలో నాలుగుసార్లు నిర్వహించే సంప్రదాయం ఉంది. మరోవైపు, 2025 జూన్‌ 24న ఎన్నికల సంఘం ‘సర్‌’కు ఆదేశాలు జారీ చేసింది. బిహార్‌ ఉదాహరణలో ‘సర్‌’ అనంతరం తుది జాబితాలో 7.42 కోట్ల మంది ఓటర్లు ఉండగా, అంతకుముందు ఈ సంఖ్య 7.89 కోట్లుగా ఉంది. అంటే ‘సర్‌’ వల్ల జాబితా పరిమాణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది.

రాజకీయంగా ప్రాధాన్యం
‘సర్‌’పై వివాదాలు కొనసాగుతున్న సమయంలో ‘ఎస్ఎస్‌ఆర్‌’ ప్రకటన వెలువడటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. సంక్షిప్త సవరణ పేరుతో బలహీన వర్గాలకు చెందిన అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా కఠినమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష ప్రతినిధులు ఎన్నికల సంఘాన్ని కోరారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ కూడా ఎన్నికలకు ముందు మరోసారి ఓటరు జాబితా సవరణ జరిగే అవకాశం ఉందని గతంలో ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే ఓటర్ల పేర్లను ఏకపక్షంగా తొలగిస్తున్నారనే ఆరోపణలను ఎన్నికల సంఘం తోసిపుచ్చుతూ, అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితాలో చోటు కోల్పోకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెబుతోంది. నవంబర్‌ 12న ముసాయిదా జాబితా వెలువడిన తర్వాత ఎంతమంది కొత్త ఓటర్లకు అవకాశం లభించింది, అభ్యంతరాలను ఎంత పారదర్శకంగా పరిష్కరించారనే అంశాలపై స్పష్టత రానుంది. పౌరులు డిసెంబర్‌ 11 గడువును గుర్తుంచుకుని తమ ఓటరు వివరాలను సరిచూసుకోవాల్సి ఉంటుంది. 

ఇదీ చదవండి: రూ.65,000 కోట్ల మహా జాతర: బెంగాల్ దుర్గమ్మ సంబరం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement