2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
మొత్తం 11,89,191 మందిలో 7,10,652 మంది పురుషులే
మహిళలు కేవలం 4,78,528 మంది మాత్రమే
అర్హత లేదని 80,635 దరఖాస్తుల తిరస్కృతి
డిసెంబర్ 10 వరకు దరఖాస్తులు, అభ్యంతరాలకు అవకాశం..30న తుది జాబితా
నామినేషన్లకు చివరిరోజు వరకు కొనసాగనున్న ఓటర్ల నమోదు
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉన్నత విద్యావంతులైన మహిళలు ఓటు హక్కు నమోదు చేసుకోవడంలో పురుషులతో పోలిస్తే గణనీయంగా వెనుకబడిపోయారు. రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేయగా, సంఖ్యాపరంగా పురుష, మహిళా ఓటర్ల మధ్య భారీ వ్యత్యాసం కనిపించింది.
రెండు స్థానాల్లో కలిపి మొత్తం 11,89,191 మంది ఓటర్లతో ముసాయిదా జాబితాను విడుదల చేయగా, అందులో ఏకంగా 7,10,652 మంది (59.75%) పురుషులే కావడం గమనార్హం. జాబితాలో 4,78,528 మంది(40.23%) మహిళలే స్థానం పొందగా, మిగిలిన 11 మంది ట్రాన్స్‌జెండర్లున్నారు. డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనుండగా, అప్పుడూ పరిస్థితి ఇలానే ఉంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పురుష ఓటర్లదే నిర్ణయాత్మక పాత్ర కానుంది.
» నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే..మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గంలో ఓటర్ల నమోదుకు 5,99,419 మంది దరఖాస్తు చేసుకోగా, 5,68,105 మందిని అర్హులుగా నిర్థారించి ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటు కల్పించారు. వీరిలో 3,36,668 మంది పురుషులు, 2,31,433 మంది మహిళలు, నలుగురు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. మిగిలిన 31,314 దరఖాస్తులను అర్హత లేదని తిరస్కరించారు.
» వరంగల్–ఖమ్మం–నల్లగొండ నియోజకవర్గం పరిధిలో 6,70,407 మంది దరఖాస్తు చేసుకోగా, 6,21,086 మందిని అర్హులుగా తేల్చి ముసాయిదా జాబితాలో చోటు కల్పించారు. వీరిలో 3,73,984 మంది పురుషులు, 2,47,095 మంది మహిళలు, ఏడుగురు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. అర్హత లేదని మిగిలిన 49,321 దరఖాస్తులను తిరస్కరించారు.
» రెండు స్థానాల్లో కలిపి మొత్తం 80,635 దరఖాస్తులను తిరస్కరించడం గమనార్హం.
» మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎస్.వాణీదేవి, వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29న ముగియనుండడంతో మళ్లీ ఎన్ని
కలు నిర్వహించడానికి కొత్తగా ఓటర్ల జాబితాను రూపొందిస్తున్నారు.
ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు
ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలతోపాటు కొత్త ఓటర్ల నమోదుకు ఫారం–18 దరఖాస్తులను డిసెంబర్ 10 వరకు స్వీకరించి 25వ తేదీలోగా పరిష్కరించనున్నారు. డిసెంబర్ 30న తుది జాబితాను ప్రచురిస్తారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సి.సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. జాబితాలో అనర్హుల పేర్లను చేర్చడంపై అభ్యంతరం/తొలగింపు కోసం ఫారం–7, ఓటర్ల వివరాల సవరణకు ఫారం–8 దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
2023 అక్టోబర్ 31 లేదా అంతకు ముందు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ/తత్సమాన అర్హత పొంది, నియోజకవర్గంలో సాధారణ నివాసి అయిన భా రత పౌరులు డిగ్రీ/డిప్లొమా సర్టిఫికెట్ ప్రతి, నివాస ధ్రువీకరణ పత్రంతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తుది జాబితా విడుదలైన తర్వాత కూడా ఓటర్ల నమోదు కొనసాగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ వరకు ఫారం–18 దరఖాస్తులను స్వీకరించి అర్హులకు ఓటు కల్పించనున్నారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ( www.ceotelangana.nic.in ) చేసుకోవచ్చు.
1,703 పోలింగ్ కేంద్రాలకు ఓకే..
మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ నియోజకవర్గంలో 809, వరంగల్–ఖమ్మం–నల్లగొండ నియోజకవర్గంలో 894 కలిపి మొత్తం 1,703 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. మహబూబ్ నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ స్థానానికి జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ (ఎన్నికలు) ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్‌ఓ)గా, వరంగల్–ఖమ్మం–నల్లగొండకు నల్లగొండ అదనపు కలెక్టర్ ఈఆర్‌ఓగా వ్యవహరిస్తున్నారు.


