ఇంజినీర్లకు బిగుస్తున్న ఉచ్చు | - | Sakshi
Sakshi News home page

ఇంజినీర్లకు బిగుస్తున్న ఉచ్చు

Nov 26 2026 1:35 AM | Updated on Nov 26 2026 1:35 AM

నేడో రేపో కీలక నిర్ణయం

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు పరిధిలో పల్నాడు వాటర్‌గ్రిడ్‌ పనుల వ్యవహారం తెలంగాణ ఇరిగేషన్‌ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు పనులు నెలల తరబడి కొనసాగుతున్నా సాగర్‌ ఇంజినీర్లు వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకపోవడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ విషయంపై బహిరంగంగానే విమర్శించారు. అంతేకాదు సంబంధిత అధికారులకు నోటీసుల జారీ చేసిన ప్రభుత్వం వారిపై ఒకటీ రెండు రోజుల్లో చర్యలు చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.

పర్యవేక్షణ ఎక్కడ? బాధ్యత ఎవరిది?

రిజర్వాయర్‌ పరిధిలో నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు వాటి వివరాలను తెలుసుకోవడం, సంబంధిత ఉన్నతాధికారులకు నివేదించడం స్థానిక ఇంజినీరింగ్‌ యంత్రాంగం బాధ్యత. అయితే పల్నాడు జిల్లాలోని గ్రామాలకు తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం జల్‌జీవన్‌ మిషన్‌ కింద సాగర్‌ కుడి కాలువవైపున పల్నాడు వాటర్‌గ్రిడ్‌ పనులను చేపట్టిన విషయంలో అధికారుల పర్యవేక్షణ ఎందుకు కొరవడిందన్న దానిపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. పనులు ప్రారంభమైనప్పటి నుంచి అధికారుల దృష్టికి ఎందుకు రాలేదు? క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరిగిందా? జరిగినా వివరాలు ఎందుకు నివేదించలేదు? అనే అంశాలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది.

బహిరంగంగానే మంత్రి అసహనం

వాటర్‌ గ్రిడ్‌ విషయం బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన నాగార్జునసాగర్‌ ఎస్‌ఈ మల్లికార్జునరావు, ఈఈ గోపీనాథ్‌, డీఈ రామనాథ్‌తో పాటు మరో ఏఈని హైదరాబాద్‌లోని ఉన్నతాధికారుల కార్యాలయానికి పిలిపించి వివరణ తీసుకున్నట్లు తెలిసింది. సంబంధిత అధికారులకు షోకాజ్‌ నోటీసులు కూడా జారీ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బహిరంగంగానే అసహనం వ్యక్తం చేయడం అధికారుల్లో ఆందోళన పెంచింది. మరోవైపు ఈ అంశం రాజకీయంగానూ వివాదానికి దారితీసింది. గత ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చారంటూ కాంగ్రెస్‌ నేతలు పేర్కొంటుండగా, బీఆర్‌ఎస్‌ నేతలు ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇప్పటికే వివరణలు తీసుకున్న ప్రభుత్వం తదుపరి చర్యలపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారా? ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేశారా? అన్నది తేలాల్సి ఉంది. ఒకటి రెండు రోజుల్లోనే శాఖాపరమైన చర్యలపై నిర్ణయం వెలువడవచ్చన్న ప్రచారం సాగుతోంది. మొత్తంగా పల్నాడు వాటర్‌గ్రిడ్‌ వ్యవహారం నాగార్జునసాగర్‌ ఇంజినీరింగ్‌ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠకు తెరలేపింది.

పల్నాడు వాటర్‌గ్రిడ్‌ విషయంలో ప్రభుత్వం సీరియస్‌

ఫ ఇంజినీర్ల నిర్లక్ష్యంపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం

ఫ చర్యలకు సిద్ధఛవుతున్న ప్రభుత్వం

ఫ ఉన్నతాధికారుల విచారణతో అధికారుల్లో గుబులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement