భువనగిరి: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం ధర్మశాల పరిధిలో సముద్ర మట్టానికి 2,828 మీటర్ల ఎత్తులో ఉన్న ట్రియుండ్ పర్వతాన్ని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ వలంటీర్లు బుధవారం విజయవంతంగా అధిరోహించారు. జాతీయ సాహస శిబిరంలో భాగంగా ఎంజీయూ నుంచి వెళ్లిన ఈ బృందం భువనగిరి పట్టణంలోని ఎస్ఎల్ఎన్ఎస్ డిగ్రీ కళాశాల రాజనీతి శాస్త్ర అధ్యాపకుడు, కంటింజెంట్ లీడర్ కనక బాలరాజు నేతృత్వంలో ఈ సాహస యాత్రను పూర్తి చేసింది. ధర్మశాల పరిధిలోని మెక్లియోడ్ గంజ్, గల్లు దేవి ఆలయం మీదుగా దట్టమైన దేవదారు అడవుల గుండా సుమారు 9 కిలోమీటర్లమార్గాన్ని దాటుకుంటూ వలంటీర్లు శిఖరానికి చేరుకున్నారు. పర్వత శిఖరంపై వలంటీర్లు జాతీయ పతాకంతో పాటు ఎన్ఎస్ఎస్ పతాకాన్ని ఎగురవేసి తమ దేశభక్తిని, సాహస స్ఫూర్తిని చాటుకున్నారు. అత్యంత ఎత్తైన పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించిన వలంటీర్లు, కంటింజెంట్ లీడర్‌ను ఎంజీయూ వైస్ చాన్స్‌లర్ అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ వెంకటరమణారెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, రమేష్ తదితరులు అభినందించారు.


