మార్క్‌ఫెడ్‌లో డీసీఎంఎస్‌ విలీనం వద్దు | - | Sakshi
Sakshi News home page

మార్క్‌ఫెడ్‌లో డీసీఎంఎస్‌ విలీనం వద్దు

Nov 26 2026 1:35 AM | Updated on Nov 26 2026 1:35 AM

నల్లగొండ అగ్రికల్చర్‌ : జిల్లా నాగార్జున సహకార మార్కెటింగ్‌ సొసైటీ (ఎన్‌డీసీఎంఎస్‌)ను మార్క్‌ఫెడ్‌లో విలీనం చేయొద్దని సభ్యులు డిమాండ్‌ చేశారు. బుధవారం నల్లగొండలోని డీసీసీబీ కార్యాలయంలో ఎన్‌డీసీఎంఎస్‌ అత్యవసర సమావేశం అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న పీఏసీఎస్‌ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, బి క్లాస్‌ సభ్యులు మాట్లాడుతూ లాభాల బాటలో ఉన్న ఎండీసీఎంఎస్‌ను మార్పిడి, విలీనం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల సమస్యలతో పాటు ఆస్తులపై సభ్యులు చర్చించి పలు తీర్మానాలు చేశారు. సమావేశంలో బిజినెస్‌ మేనేజర్‌ నాగిళ్ల మురళి తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుడికి

రాష్ట్రస్థాయిలో ప్రశంస

డిండి : విద్యారంగంలో విశేష సేవలు అందిస్తూ, విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తున్న మండల పరిధిలోని కొత్తతండా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ముద్దాడ బాలరాజు బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. విద్యార్థుల సంక్షేమం, అభివృద్ధి, విధులకు మించి సేవలందించడం, వినూత్న పద్ధతిలో బోధన, విద్యార్థులకు అవసరమైన వనరులు, అభ్యసన అవకాశాలు కల్పించడంలో చూపిన అంకితభావాన్ని గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ తరఫున ఈ ప్రశంసా పత్రాన్ని అందించింది. ఈ సందర్భంగా పలువురు బాలరాజును అభినందించారు.

ఇన్‌చార్జి డీఆర్‌ఓగా అశోక్‌రెడ్డి

నల్లగొండ : నల్లగొండ ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారిగా నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డిని నియమిస్తూ కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. నల్లగొండ డీఆర్‌ఓగా పనిచేస్తున్న దశరథనాయక్‌ ఈనెల 23న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఆ స్థానంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డిని ఇన్‌చార్జి డీఆర్‌ఓగా నియమించారు.

27న జాబ్‌ మేళా

నల్లగొండ : నల్లగొండలోని ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ నెల 27న ఉదయం 10.30 గంటలకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి పి.సాహితి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్‌ఎస్‌సీ నుంచి డిగ్రీ/బీఫార్మసీ అర్హతతో 18 నుంచి 35 సంవత్సరాల వయసు కలిగిన నిరుద్యోగులు అర్హులని తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో నేరుగా నల్లగొండలోని ఉపాధి కల్పన కార్యాలయానికి హాజరు కావాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 08682 233362 పోన్‌ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

తిరుప్పాణ్‌ ఆళ్వార్‌ తిరునక్షత్ర వేడుకలు ప్రారంభం

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శ్రీతిరుప్పాణ్‌ ఆళ్వార్‌ తిరు నక్షత్ర వేడుకలు బుధవారం ప్రారంభమయ్యాయి. ప్రధానాలయంలో తిరుప్పాణ్‌ ఆళ్వార్‌కు విశేషంగా తిరుమంజనం నిర్వహించారు. మాడ వీధుల్లో తిరుప్పాణ్‌ ఆళ్వార్‌ను విశేషంగా అలంకరించి ఊరేగించారు. అనంతరం అధ్యాపక స్వాములచే సేవా కాలం జరిపించి, తీర్థ ప్రసాద గోష్ఠి ఉత్సవాన్ని చేపట్టారు. ఈ వేడుకల్లో ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, అర్చకులు, పారాణీకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement