సరిచేయాలని రాష్ట్రాల సీఈఓలకు లేఖ
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) సర్వే సమయంలోనూ ఓటర్ల పేర్లు, బంధుత్వం, పుట్టిన తేదీ వంటి వివరాలు తప్పుగా నమోదైతే వాటిని సరిచేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ప్రకటించింది. దీంతో ఎస్‌ఐఆర్ తుది జాబితా ముద్రణ తర్వాత సైతం తమ వివరాలు తప్పుగా ఉన్నాయని గుర్తించిన ఓటర్లకు భారీ ఊరట లభించినట్లయింది.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్)లో జరిగిన తప్పిదాలను స్పెషల్ సమరీ రివిజన్(ఎస్‌ఎస్‌ఆర్)లో సరిచేయాలంటూ ఈ మేరకు ఈసీ తాజాగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈఓ)లకు లేఖ రాసింది. ఓటర్ల పేర్లు, బంధుత్వం, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఫొటో వంటివి తప్పుగా ముద్రితమైతే అలాంటి వాళ్లు తమ వివరాలను సరిచేసుకునేందుకు అవకాశం కల్పించాలని సీఈఓలకు ఈసీ సూచించింది. ఎస్‌ఎస్‌ఆర్ వేళ వెరిఫికేషన్ చేసి తప్పులుంటే సరిదిద్దాలని ఆదేశించింది.
తమ వివరాలు సరిగా లేవని తమ దృష్టికి తీసుకొచ్చిన ఓటర్ల నుంచి ఫారమ్ 8ను తీసుకుని వివరాలను సవ్యంగా నమోదుచేయించాలని బూత్ లెవల్ ఆఫీసర్(బీఎల్‌ఓ)లకు సూచించింది. ఇలా వచ్చిన దరఖాస్తులను ఈఆర్‌ఓ, అసిస్టెంట్ ఈఆర్‌ఓలు ఎప్పటికప్పుడు పరిశీలించి నిబంధనలమేరకు తగు నిర్ణయాలు తీసుకోవాలని ఈసీ తెలిపింది. ఈసీఐనెట్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ ప్రక్రియ కొనసాగుతుందని, ఇందులో ఆటోమేటెడ్ ఐడెంటిఫికేషన్ విధానం అంటూ ఏమీ ఉందని ఈసీ స్పష్టంచేసింది.


