ఢాకా: బంగ్లాదేశ్లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కాక్స్బజార్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఇనాని లోని టుప్టుప్ రెస్టో అండ్ రిసార్ట్లో అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో చిన్నారులతో సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.
బంగాళాఖాతానికి సమీపంలో ఉన్న ఈ రిసార్ట్కు దేశీయ పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. మూడు అంతస్తుల కలప నిర్మాణంతో ఉన్న రిసార్ట్లో ఉదయం మంటలు చెలరేగాయని, అవి వేగంగా భవనం అంతటా వ్యాపించాయని అగ్నిమాపక శాఖ జిల్లా డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ సయ్యద్ మొహమ్మద్ మోర్షెద్ హొస్సేన్ తెలిపారు.
మంటలు వేగంగా వ్యాపించడంతో పలువురు వాటి బారినపడ్డారు. ఈ ఘటనలో చిన్నారులు కూడా మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, మృతుల వివరాలను ఇంకా పూర్తిస్థాయిలో వెల్లడించలేదు. ప్రమాదంలో గాయపడిన నలుగురికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా తెలియాల్సి ఉంది.
అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ప్రమాదం ఎలా జరిగింది, మంటలు చెలరేగడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటనే అంశాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి: భారతీయులపై అమెరికా నేత వ్యాఖ్యలు


