ఇటీవల కాలంలో అమెరికా నాయకులకు హెచ్-1బీ వీసాపై ద్వేషం కక్కడం పరిపాటిగా మారింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ హెచ్1బీ వీసా విధానంపై మండిపడ్డారు. ఈ విధానాన్ని తప్పుడు పద్ధతిలో వినియోగించుకుంటూ అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ఆ వ్యాఖ్యల వేడి చల్లారకముందే తాజాగా మరో అమెరికన్ కాంగ్రెస్ నేత హెచ్-1బీపై విషం చిమ్మారు. హెచ్-1బీ, ఓపీటీ కార్యక్రమాలను “మోసపూరితమైనవి” గా అభివర్ణించారు.
సేలం న్యూస్ ఛానల్ (ఎస్ఎన్సీ)లో ప్రసారమైన ‘ది స్కాట్ జెన్నింగ్స్ షో’ కార్యక్రమంలో స్కాట్ జెన్నింగ్స్తో మాట్లాడుతూ "అమెరికాలో కంప్యూటర్ సైన్స్ సహా ఇతర కోర్సులు పూర్తి చేసిన స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఈ ఉద్యోగాలు భారత్, చైనా నుంచి హెచ్-1బీ వీసాలపై వస్తున్న విదేశీ ఉద్యోగులు కొల్లగొడుతున్నారు. తక్కువ వేతనాలకు పనిచేసేందుకు సిద్ధంగా ఉండే విదేశీ ఉద్యోగులను కంపెనీలు నియమించుకుంటున్నారు". అని విమర్శించారు. దానితో పాటు హెచ్-1బీ, ఓపీటీ కార్యక్రమాలను “మోసపూరితమైనవి” గా అభివర్ణించారు.
గతేడాది అమెరికాలో కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ వంటి కోర్సుల్లో సుమారు 6.5 లక్షల మంది విద్యార్థులు డిగ్రీలు పూర్తి చేశారు. అదే సమయంలో ఐదు లక్షలకు పైగా హెచ్-1బీ వీసాలు జారీ చేశారు. ఇది నిజంగా ఆందోళనకరమైన విషయం. చివరికి తక్కువ వేతనాలకు పనిచేయడానికి సిద్ధంగా ఉండటంతో విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్నారు. దీంతో మన దేశానికి చెందిన యువత ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆయన ఆరోపించారు.
హెచ్-1బీ పరిచయం
“అమెరికాలో భర్తీ చేయడానికి తగిన ఉద్యోగులు అందుబాటులో లేని స్థానాల్లో పనిచేసేందుకు అత్యుత్తమ ప్రతిభ కలిగిన వారిని తీసుకువస్తామని హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని పరిచయం చేశారు. కానీ, ఈ కార్యక్రమం ఆ విధంగా పనిచేయడం లేదు. బదులుగా, తక్కువ వేతనాలకు పనిచేసే విదేశీ కార్మికులను తీసుకువస్తున్నారు. అకౌంటింగ్, కంప్యూటర్ సైన్స్ వంటి కోర్సుల్లో డిగ్రీలు పూర్తి చేసి ఉద్యోగాల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్న మన యువ గ్రాడ్యుయేట్ల అవకాశాలను వీరు దెబ్బతీస్తున్నారు” అని ఆయన వ్యాఖ్యానించారు.
హెచ్-1బీ వీసాదారుల కుటుంబ సభ్యులపై
హెచ్-1బీ వీసాపై అమెరికాకు వచ్చే ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులను కూడా తీసుకువస్తారని రైలీ మూర్ పేర్కొన్నారు. ఈ అంశాన్ని ఆయన చైన్ మైగ్రేషన్ (కుటుంబ సంబంధాల ఆధారంగా వలసలు కొనసాగడం)తో ముడిపెట్టారు.సాధారణంగా ఒక హెచ్-1బీ వీసాదారుడు తన కుటుంబానికి చెందిన పది మందిని అమెరికాకు తీసుకువస్తారు. దీనితో పాటు మొత్తం కుటుంబ వలసల వ్యవస్థ కూడా కొనసాగుతుందన్నారు.
హెచ్-1బీ కఠిన నిబంధనలు
ఇదిలా ఉండగా, హెచ్-1బీ, ఎల్-1 వంటి తాత్కాలిక ఉద్యోగ వీసాల పొడిగింపు దరఖాస్తుల పరిశీలన విధానంలో మార్పులు తీసుకురావాలని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్ఎస్) ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే, ముఖ్యంగా భారతీయ వలసదారులపై ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం, ఒక ఉద్యోగి వీసా పొడిగింపు కోసం దరఖాస్తు చేసినప్పుడు, గతంలో అదే పరిస్థితుల్లో ఆమోదించిన దరఖాస్తుకు సాధారణంగా ప్రాధాన్యం ఇస్తారు. అయితే, డీహెచ్ఎస్ ప్రతిపాదించిన కొత్త నిబంధన అమల్లోకి వస్తే, గతంలో దరఖాస్తు ఆమోదం పొందినప్పటికీ, అదే పరిస్థితులు కొనసాగుతున్న సందర్భంలో కూడా ఇమ్మిగ్రేషన్ అధికారులు అర్హతలను మరోసారి పరిశీలించేందుకు అవకాశం ఉంటుంది.
ఈ ప్రతిపాదన ఇంకా అమల్లోకి రాలేదు. దీనిపై ప్రజలు, సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని డీహెచ్ఎస్ కోరుతోంది. ఈ ప్రతిపాదనలోని అన్ని అంశాలపై అభిప్రాయాలను స్వీకరించనున్నట్లు విభాగం తెలిపింది.
హెచ్-1బీలో భారతీయుల వాటా
అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్సీఐఎస్) గణాంకాల ప్రకారం, 2025 ఆర్థిక సంవత్సరంలో హెచ్-1బీ వీసా లబ్ధిదారుల్లో భారతీయుల వాటా సుమారు 70 శాతంగా ఉంది. అందువల్ల హెచ్-1బీ వీసా విధానంలో మార్పులు, దరఖాస్తుల పరిశీలన కఠినతరం చేసే ప్రతిపాదనలు భారతీయ నిపుణులు, అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులు, వీసా పొడిగింపుల కోసం ఎదురుచూస్తున్నవారిపై ప్రత్యేక ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: భారత్కు ట్రంప్ ఊరట


