దేశీయ విమానయాన రంగానికి అనుకూల కేంద్రంగా మారుతున్న హైదరాబాద్ వేదికగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ (ఎంఆర్ఓ) సంస్థ ‘జీఎంఆర్ ఏరో టెక్నిక్’ (GMR Aero Technic), కెనడాకు చెందిన విమాన మాడిఫికేషన్, సర్టిఫికేషన్ దిగ్గజం ‘కార్పొరేషన్ లాజిక్ ఎయిర్ ఇంక్’(Logic Air)తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. భారతీయ, అంతర్జాతీయ విమానయాన మార్కెట్లకు అవసరమైన విమాన ఇంజినీరింగ్, మాడిఫికేషన్స్, సర్టిఫికేషన్ పరిష్కారాలను అందించడమే ఈ భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశం.
ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా విమానాల సాధారణ నిర్వహణ, రీ-డెలివరీ ప్రోగ్రామ్లు, ట్రాన్సిషన్ చెక్స్ సమయాల్లో ఎలాంటి అంతరాయం లేకుండా ఎయిర్క్రాఫ్ట్ మాడిఫికేషన్ పరిష్కారాలను అందించనున్నారు. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్, ఆసియా-పసిఫిక్ ప్రాంతాలలోని ఆపరేటర్లను లక్ష్యంగా చేసుకుని లాజిక్ ఎయిర్ అందించే ‘సప్లిమెంటరీ టైప్ సర్టిఫికేట్’ డేటా ఆధారంగా ఆధునీకరణ సేవలను విస్తరించనున్నారు. ఎయిర్లైన్స్, లీజింగ్ కంపెనీలు, కార్గో ఆపరేటర్లకు అత్యుత్తమ సేవలు అందించడమే కాకుండా భారతదేశంలో ఇన్స్టాలేషన్, శిక్షణ, మెయింటెనెన్స్, దీర్ఘకాల మద్దతు అందించే స్థానిక సాంకేతిక సామర్థ్యాలను ఈ ఒప్పందం బలోపేతం చేస్తుందని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా జీఎంఆర్ ఏరో టెక్నిక్ ప్రెసిడెంట్ అశోక్ గోపీనాథ్ మాట్లాడుతూ, ‘లాజిక్ ఎయిర్ ఇంజినీరింగ్, సర్టిఫికేషన్ నైపుణ్యంతో మా ఎంఆర్ఓ మౌలిక సదుపాయాలు తోడవ్వడం వల్ల కస్టమర్లకు ఏకీకృత పరిష్కారాలు వేగంగా అందుతాయి. ఇది భారత్, మిడిల్ ఈస్ట్, ఆసియా-పసిఫిక్ రీజియన్లోని విమానయాన రంగానికి ఎంతో లబ్ధి చేకూరుస్తుంది’ అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రోజూ చూసే రూపీ సింబల్ వెనుక దాగున్న రహస్యాలు


