ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తన రాజకీయ ప్రత్యర్థి ఐసెన్‌కాట్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ఇద్దరి మధ్య అధికార మార్పిడి ఒప్పందం కుదిరితే ముందుగా ఐసెన్‌కాట్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు కూడా అంగీకరించినట్లు ఇజ్రాయెల్‌కు చెందిన పలు మీడియా సంస్థలు శనివారం వెల్లడించాయి. దేశంలో రాజకీయ స్థిరత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిర్ణయానికి సిద్ధమైనట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ తెలిపింది.
ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేసిన నెతన్యాహు.. "దేశం ఎదుర్కొంటున్న ఉనికికే ముప్పు కలిగించే ప్రమాదం తీవ్రంగా ఉంది. ఈ ముప్పుని ఎదుర్కొనే సామర్థ్యం లేని ప్రభుత్వం ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నాయకుడిగా నా బాధ్యత దృష్ట్యా, అతిపెద్ద పార్టీకి చెందిన నాయకుడే ముందుగా ప్రధాని కావాలనే సూత్రంతో సహా అన్నింటినీ పక్కన పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాను. గాడి ఐసెన్‌కాట్ ముందుగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టొచ్చు. నేను ప్రభుత్వ ప్రారంభంలో ఉప ప్రధానమంత్రి (ప్రత్యామ్నాయ ప్రధాని)గా కొనసాగుతాను" అని పేర్కొన్నారు.
గత నెలలో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యత ఐసెన్‌కాట్‌కు అప్పగించారు. అప్పటి నుంచి నెతన్యాహు వ్యతిరేక పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఐసెన్‌కాట్ ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి ఒప్పందం కుదరలేదు. మరోవైపు, తన లికుడ్ పార్టీ అతిపెద్ద పార్టీగా నిలిచినందున ఐక్య ప్రభుత్వానికి తానే నాయకత్వం వహించాలని నెతన్యాహు పట్టుబడుతూ వచ్చారు. ఈ వారాంతంలోనే ప్రభుత్వ ఏర్పాటుపై ఒప్పందం కుదుర్చుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు తన వైఖరిని మార్చుకున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పేర్కొంది.
ఇప్పటివరకు మూడు విడతల్లో మొత్తంగా 19 ఏళ్ల పాటు ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా పనిచేసిన నెతన్యాహు.. 2022లో మరోసారి అధికారంలోకి వచ్చారు. తాజాగా ప్రతిపాదించిన ఐక్య ప్రభుత్వం దేశ భద్రతని కాపాడటంతో పాటు ఎదురవుతున్న ముప్పులని తిప్పికొట్టి ఇజ్రాయెల్ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుతుందని ఆయన పేర్కొన్నారు. నెతన్యాహు ప్రతిపాదనపై ఐసెన్‌కాట్ స్పందిస్తూ.. ఆయన ప్రతిపాదనలోని నిజాయితీని, చిత్తశుద్ధిని రాబోయే 24 గంటల్లో పరిశీలిస్తానని అన్నారు.


