సాక్షి, హైదరాబాద్: టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ సునీత లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లంచం తీసుకునే విషయంలో సునీత వ్యవహరించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బాధితులు నేరుగా తనకు నగదు ఇవ్వకుండా బైక్ డిక్కీలో డబ్బులు వేసి వెళ్లాలని ఆమె షరతు విధించినట్లు తెలుస్తోంది.
రూ.4 లక్షల లంచం కోసం సునీత టెలిఫోన్ భవన్ వద్ద వేచి ఉండగా.. ఇదే సమయంలో ఏసీబీ అధికారులు మాటు వేసి పట్టుకున్నారు. అంతకుముందు మరో వ్యక్తి నుంచి రూ.2.5 లక్షలను సైతం సునీత తన బైక్ డిక్కీలో వేయించుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. తాజాగా రూ.4 లక్షలు ఇచ్చేందుకు వచ్చిన బాధితుడిని కూడా నగదును బైక్ డిక్కీలో వేయాలని సునీత చెప్పినట్లు తెలుస్తోంది.
ఇంటి నిర్మాణానికి ఎటువంటి ఆటంకం లేకుండా చూస్తానని బల్దియా టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ సిటీ రేంజ్–1 అధికారులు పట్టుకున్నారు. గోల్కొండ జోన్ మెహిదీపట్నం సర్కిల్ 33 టౌన్‌ప్లానింగ్ అసిస్టెంట్ సూపర్‌వైజర్ తులసీరామ్‌సునీత వద్దకు ఓ వ్యక్తి వచ్చాడు. డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ నుంచి తన ఇళ్లు కట్టడానికి అభ్యంతరాలు వస్తున్నాయని ఆమెతో అన్నాడు.
రూ.8 లక్షలు తనకు చెల్లిస్తే ఇంటి నిర్మాణానికి ఎటువంటి అభ్యంతరాలు రాకుండా చూస్తానని తులసీరామ్‌సునీత బేరం కుదుర్చుకుంది. బాధితుడు ఏసీబీకి సమాచారం ఇచ్చాడు. సోమవారం బల్దియా గోల్కొండ జోన్ కార్యాలయంలో సునీతకు అడ్వాన్స్‌గా రూ.4 లక్షలు ఇచ్చాడు. ముందుగానే వలపన్నిన ఏసీబీ అధికారులు ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఇదీ చదవండి: 5 నిమిషాల్లో రూ. 2 కోట్ల బంగారం లూటీ!


