హైదరాబాద్ శివారులోని ఓ నగల షాపులో అంతర్రాష్ట్ర దొంగల ముఠా ‘తెర’చాటు చోరీ
షట్టర్ పగులగొట్టి అది ఎవరికీ కనిపించకుండా తెల్లని వస్త్రం అడ్డుపెట్టి లోపలకు..
1.4 కిలోల నగలు కొల్లగొట్టి ఆటోలో పరారీ.. రాజస్తాన్ ముఠా పనిగా అనుమానం
సీసీ కెమెరాల్లో రికార్డయిన ఏడుగురి కదలికలు.. నిందితుల కోసం రంగంలోకి ప్రత్యేక బృందాలు
సాక్షి, హైదరాబాద్/మేడిపల్లి: హైదరాబాద్ శివారులోని మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. వరంగల్ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఓ జ్యువెలరీ దుకాణాన్ని అంతర్రాష్ట్ర దొంగల ముఠా కొల్లగొట్టి కేవలం 5 నిమిషాల్లో ఏకంగా రూ. 2 కోట్ల విలువజేసే 1.4 కిలోల బంగారు, వజ్రాభరణాలతో పరారైంది. పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఈ చోరీ జరగడం గమనార్హం. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను అధ్యయనం చేసిన పోలీసులు దుకాణం షెట్టర్ రోడ్డుపై ఉన్న వారికి కనిపించకుండా తెల్లని వస్త్రం అడ్డుపెట్టి దొంగలు ఈ నేరం చేసినట్లు తేల్చారు. రాజస్తాన్‌కు చెందిన ఏడుగురు ఈ చోరీకి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
పక్కాగా పంజా...
హనుమకొండకు చెందిన వెలిశెట్టి సుబ్రహ్మణ్యం టాటా కంపెనీకి చెందిన క్యారెట్‌లేన్ జ్యువెలరీ దుకాణాల ఫ్రాంచైజీ కలిగి ఉన్నారు. హనుమకొండలో ఒకటి, మేడిపల్లి బుద్ధనగర్‌లో మరొకటి నిర్వహిస్తున్నారు. అయితే ఈ జ్యువెలరీ ఫ్రాంచైజీకి కాపలాగా సెక్యూరిటీ గార్డు లేకపోవడంతో దొంగలు దీన్ని టార్గెట్ చేశారు. ఒకటిరెండు రోజులు గమనించి పక్కా పథకం ప్రకారం సోమవారం తెల్లవారుజామున పంజా విసిరారు. మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన ముఠా తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ దుకాణం వద్దకు చేరుకుంది. రహదారి పక్కన ప్రయాణికుల మాదిరిగా నిల్చున్న దొంగలు దుకాణం పరిసరాలను పరిశీలించి కాసేపు దూరంగా వెళ్లారు. ఆపై తెల్లవారుజామున 4:07 గంటలకు దుకాణం షట్టర్ వద్దకు ముగ్గురు రాగా మిగిలిన నలుగురు రోడ్డుపైనే ఆగిపోయారు. షట్టర్ వద్దకు వచ్చిన ముగ్గురు దొంగల్లో ఒకడు వెంట తెచి్చన ఓ వ్రస్తాన్ని షెట్టర్‌కు అడ్డుగా పెట్టి నిల్చోగా మిగిలిన ఇద్దరూ షెట్టర్ పక్కనున్న అలారం వైర్లను తొలుత కత్తిరించారు. ఆపై షెట్టర్ తాళాలను పగులగొట్టారు. అనంతరం ఆ వస్త్రాన్ని దుకాణం ఎదురుగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ మాటున దాచి కాస్త దూరంగా వెళ్లి వాహనాల రాకపోకలు, జనసంచారమేదీ లేదని నిర్ధారించుకున్నారు.

షట్టర్‌కు అడ్డు పెట్టడానికి వస్త్రాన్ని తెస్తున్న ముఠా సభ్యుడు
ఐదు నిమిషాల్లో చోరీ పూర్తి...
తెల్లవారుజామున 4:18 గంటలకు రోడ్డుపై ముగ్గురు కాపు కాయగా... నాలుగో వ్యక్తి ఆ వ్రస్తాన్ని షట్టర్‌కు మరోసారి అడ్డుగా పెట్టి నిల్చున్నాడు. మిగిలిన ముగ్గురూ ఆ తెరను చాటుగా చేసుకొని షెట్టర్ వద్ద నక్కారు. వారిలో ఇద్దరు షెట్టర్‌ను ఎత్తిపట్టుకోగా మరొకడు లోపలకు ప్రవేశించి ఐదు నిమిషాల వ్యవధిలో ఆరు ఫ్లాట్ బెడ్స్ (షోకేసులు) పగులగొట్టి వాటిలోని 435 ఉంగరాలు, 88 బ్రేస్‌లెట్లు, 19 గాజులు, 17 నెక్లెస్‌లు, 9 చెవి రింగులు, 8 పెండెంట్లు, 2 గొలుసులు, మంగళసూత్రం, ముక్కుపుడక కలిపి 580 ఆభరణాలను సంచిలో సర్దుకొని బయటకు వచ్చేశాడు. ఈ క్రమంలో టార్చిలైట్‌తోపాటు నాలుగు ఉంగరాలు షట్టర్ వద్ద పడిపోగా మిగిలిన సొత్తుతో నిందితులు ఉప్పల్ వైపు నడుచుకుంటూ వెళ్లారు. కాస్త దూరం వెళ్లాక ఆటో ఎక్కి ఉడాయించారు. నేరం జరిగిన సమయంలో దుకాణంలో రూ. 7 కోట్ల విలువైన సరుకు ఉంది. సోమవారం ఉదయం 7 గంటల వేళ దుకాణం వద్దకు వచ్చిన మేనేజర్ శ్రీనివాస్ చోరీ విషయాన్ని గుర్తించి యజమానితోపాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఉప్పల్ డీసీపీ సురేశ్‌కుమార్, మేడిపల్లి ఏసీపీ మోహన్ కుమార్, ఇన్‌స్పెక్టర్ జలందర్‌రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి పలు ఆధారాలు సేకరించారు. సీసీ కెమెరాల్లో నమోదైన వివరాలతోపాటు ఇతర అంశాలు అధ్యయనం చేసి ఇది రాజస్తాన్ ముఠా చోరీగా భావిస్తున్నారు. నిందితుల కోసం రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశి్నస్తున్నాయి. అతడు చెప్పిన వివరాల ఆధారంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌తోపాటు ఇతర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల నుంచి ఫుటేజ్ సేకరించి విశ్లేషిస్తున్నారు. దుండగులు రైల్లో పారిపోయి ఉంటారనే అనుమానంతో ఆయా రాష్ట్రాల జీఆర్పీ అధికారులను అప్రమత్తం చేశారు.


