వార్తల్లోని వ్యక్తి: నేహా బోరాతో సంభాషణ
ప్రశ్న: ముందుగా, ఇటీవలి కాలంలోని అత్యంత విజయవంత మైన, దేశానికి కొత్త ఆశను కల్పించిన ఉద్యమంలో నాయకత్వ పాత్ర పోషించినందుకు అభినందనలు. గత రెండు దశాబ్దాలుగా సమాజాన్ని ఆవరించిన భయోత్పాత వాతావరణాన్ని ఈ ఉద్యమం కొంతవరకు తొలగించగలిగింది. అందుకు మరిన్ని అభినందనలు. ఇప్పుడు ప్రశ్నల్లోకి వెళ్దాం. జంతర్ మంతర్ నుంచి దేశవ్యాప్త పర్యటన ఎందుకు?
ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యార్థి ఉద్యమాలకు సంఘీభావం ప్రకటించడం. జార్ఖండ్‌లో విద్యార్థులు జేపీఎస్‌సీ, జేఎస్‌ఎస్‌సీ పరీక్షలను రద్దు చేయాలని ఉద్యమిస్తున్నారు. అందుకే రాంచీ వెళ్లాం. కోల్‌కతాలో ఐఎస్‌ఐ విద్యార్థులు తమ విద్యాసంస్థ స్వయంప్రతిపత్తిని దెబ్బతీసే బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. అందుకే అక్కడికి వెళ్లాం. తర్వాత జైపూర్ వెళ్లాం. రాజస్థాన్ పేపర్ లీక్‌లకు కేంద్రంగా మారింది. ప్రైవేట్ కోచింగ్ మాఫియా అక్కడ పెద్ద సమస్య. విద్యా వ్యవస్థ ఒత్తిడి వల్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు అక్కడ కనిపిస్తున్నాయి. హైదరాబాదులో ఏబీవీపీ హింసకు వ్యతి రేకంగా కొంతమంది విద్యార్థులు పోరాడుతున్నారు. సీజేఐని కాన్వొకేషన్‌కు ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తే తమను బార్‌లో నమోదు చేయబోమని బెదిరించే పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు జరుగుతున్నాయి. మేము వారితో కలిసి పోరాడుతున్నాం.
జంతర్ మంతర్ ఉద్యమం ఎలాంటి పాఠాలు నేర్పింది?
ఆ ఉద్యమం విజయం సాధించడానికి ప్రధాన కారణం మేము సంఘటితంగా ఉండటం. అందుకే ఎక్కడ విద్యార్థులు పోరాడు తున్నా వారు కూడా సంఘటితం కావాలి. అధికార ధోరణులను, నిరంకుశ శక్తులను నిజంగా ఎదుర్కోవాలంటే కలిసి రావాలి, తమను తాము చైతన్యపరుచుకోవాలి.
మీ తక్షణ లక్ష్యం ఏమిటి?
ప్రత్యేకంగా ఏమీ లేదు. వీలైనంత ఎక్కువమంది విద్యార్థులను సంఘటితం చేయడం, రాజకీయాల్లోకి తీసుకుని రావడం, నిజమైన శక్తి ఐక్యతలోనే ఉందని అర్థమయ్యేలా చేయడం– ఇవే మా లక్ష్యాలు. నాణ్యమైన విద్య కోసం, విద్యార్థుల మెరుగైన భవిష్యత్తు కోసం పోరాడాలి.
జంతర్ మంతర్‌లో మూడు భిన్నమైన స్రవంతులు ఒకే వేదిక పైకి వచ్చాయి. ఇక భవిష్యత్తు?
మేమంతా కలిసి కొత్త సంస్థ ఏర్పాటు చేయబోవడం లేదు. నేను ఏఐఎస్‌ఏలో భాగం. అదే నా సంస్థ. అభిజీత్ దీప్కే సీజేపీలో భాగం. అదే ఆయన సంస్థ. సోనమ్ వాంగ్‌చుక్ స్వతంత్ర వ్యక్తి. ఆయన సొంత అభిప్రాయాలు ఆయనకు ఉన్నాయి. అయితే ఉమ్మడి సమస్యలు ఉంటే విద్యార్థుల కోసం, దేశంలోని యువత కోసం మేము ఒక ఐక్య వేదిక ద్వారా కలిసి పోరాడవచ్చు.
మీరు మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లోకి వస్తారా?
మెయిన్‌స్ట్రీమ్ రాజకీయాలపై నా అవగాహన భిన్నంగా ఉంటుంది. నేను వామపక్ష భావజాలం నుంచి వచ్చాను. ప్రధాన స్రవంతి రాజకీయాలను ఆదర్శ రాజకీయాలుగా మేము చూడం. కాబట్టి నేను ఆ రాజకీయాల్లో చేరను. నేను రాజకీయాల్లోనే ఉన్నాను – నాకు సాధ్యమైనంత లోతుగా. నా భావజాలాన్ని కొనసాగిస్తాను. ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు తమ రాజకీయాలను కొనసా
గించవచ్చు.
మోదీ అంటించిన ‘దిమాగీ నక్సల్’ లేబుల్‌పై మీ స్పందన?
అది ఏమాత్రం ప్రభావం లేని పదం. ప్రజలను చెడ్డవారిగా చిత్రీకరించడానికి, వారిని నిరుత్సాహపరచడానికి, వారి మనో ధైర్యాన్ని దెబ్బతీయడానికి కొత్త కొత్త పదాలను సృష్టిస్తున్నారు. ‘దిమాగీ నక్సల్’ అనేది ఒక జోక్ మాత్రమే. అందరూ నరేంద్ర మోదీని ఉద్దేశించి రకరకాల వ్యంగ్య నినాదాలు ఇస్తున్నారు. ఆయన కూడా ‘నేనూ ఏదైనా కొత్త పదం కనిపెట్టాలి’ అనుకుని ‘దిమాగీ నక్సల్’ అనే పదాన్ని తీసుకొచ్చినట్టుంది. కానీ ఇందులో మరో విషయం ఉంది. ‘దిమాగీ నక్సల్’ అంటే మనందరికీ మెదడు ఉంది. మనకు ఆలోచించే శక్తి ఉంది. మనం ఏమి ఆలోచిస్తున్నామో చెప్పడానికి టెలీప్రాంప్టర్ అవసరం లేదు. సామాన్య ప్రజలకు అర్థం కాని భాషలో మాట్లాడే ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచం కూడా మనకు అవసరం లేదు. ప్రజలతో స్నేహంగా ఉండాల్సింది పోయి, వారి నుంచి పూర్తిగా దూరమయ్యే భాష మనకు అవసరం లేదు. కాబట్టి ‘దిమాగీ నక్సల్స్’ అని పిలిస్తే పిలవనివ్వండి!
– డానీ, సమాజ విశ్లేషకులు


