మూడో రోజూ నిరసన హోరు  | Protest demanding the resignation Chief Election Commissioner Gyanesh Kumar | Sakshi
Sakshi News home page

మూడో రోజూ నిరసన హోరు 

Oct 5 2026 5:52 AM | Updated on Oct 5 2026 5:52 AM

Protest demanding the resignation Chief Election Commissioner Gyanesh Kumar

జ్ఞానేశ్‌ రాజీనామా చేయాలని ఏఐఎస్‌ఏ డిమాండ్‌ 

జంతర్‌మంతర్‌ వైపు దూసుకొస్తుండగా అడ్డుకున్న పోలీసులు

న్యూఢిల్లీ: చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ జ్ఞానేశ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆలిండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌(ఏఐఎస్‌ఏ) నేతలు, కార్యకర్తలు ఢిల్లీలో వరుసగా మూడో రోజు ఆదివారం సైతం కదం తొక్కారు. జంతర్‌మంతర్‌ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. జంతర్‌మంతర్‌ చుట్టూ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 

అశోక రోడ్డులోని ఆంధ్రభవన్‌ సర్కిల్‌ నుంచి దూసుకొచ్చిన నిరసనకారులు జంతర్‌మంతర్‌ సమీపంలో బారికేడ్లను ఛేదించడానికి ప్రయత్నించగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఏఐఎస్‌ఏ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా బారీకేడ్‌ ఎక్కగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. నిరసనకారులను పోలీసులు ఈడ్చుకెళ్లిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి, పోలీసు స్టేషన్‌కు తరలించారు.    

మహిళా జర్నలిస్టులకు లైంగిక వేధింపులు 
ఢిల్లీలో ఈనెల 3న జరిగిన నిరసన సందర్భంగా పోలీసులు తమను లైంగికంగా వేధించారని ముగ్గురు మహిళా జర్నలిస్టులు ఆరోపించడం కలకలం సృష్టించింది. నిష్పాక్షిక విచారణ కోసం వారి ఫిర్యాదులను క్రైమ్‌ బ్రాంచ్‌కు బదిలీ చేసినట్లు పోలీసు అధికారులు ఆదివారం తెలిపారు. తనపై ఒక ఏసీపీ లైంగిక దాడి చేశారని పాత్రికేయురాలు ఆరోపించారు. నిరసనకారులను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో మహిళా పోలీసులు ఎవరూ లేరంటూ తాను ప్రశ్నించానని, దాంతో ఏసీపీ వివేక్‌ భగత్‌ తనను అసభ్యకరంగా తాకుతూ నెట్టేశాడని తెలిపారు. 

వేధింపులపై మరో ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. మహిళా జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ది్రగ్బాంతి వ్యక్తం చేసింది. పోలీసుల వ్యవహార శైలిని కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఖండించారు. ఈ విషయంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా సమాధానం చెప్పాలని నిలదీశారు. నిరసనల సందర్భంగా మహిళా జర్నలిస్టులను లైంగికంగా వేధించిన పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని తేల్చిచెప్పారు.  

నంబర్‌లేని వాహనంలో నేహా తరలింపు
ఏఐఎస్‌ఏ అధ్యక్షురాలు నేహా బోరాను ఢిల్లీ పోలీసులు నంబర్‌ ప్లేట్‌లేని ఒక వాహనంలో ఎక్కించారు. అందులో గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్లారని ఏఐఎస్‌ఏ సభ్యులు ఆరోపించారు. ‘‘మా నాయకురాలి జాడ తెలీకుండా ఉండేందుకు నంబర్‌లేని వాహనంలో ఎత్తుకెళ్లారు. తీసుకెళ్లే సమయంలో వాహనంలో మహిళా పోలీసులు ఎవరూ లేరు. ఇది నిబంధనల్ని పూర్తిగా ఉల్లంఘించడమే. ఆమె ఫోన్, బ్యాగ్‌ను పోలీసులు లాక్కున్నారు’’ అని నిరసనకారులు ఆందోళన వ్యక్తంచేశారు. అదుపులోకి తీసుకున్న నేహా బోరాను నరేలా పారిశ్రామిక ప్రాంత పోలీస్‌ స్టేషన్‌ నుంచి పోలీసులు తర్వాత విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement