ప్రభుత్వ మార్పునకు ప్రజలు సిద్ధంగా ఉండాలి
సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పిలుపు
జ్ఞానేశ్ కుమార్ వెళ్లిపోతే మోదీ కూడా వెళ్లిపోతారని వెల్లడి
కొచ్చి: 2029 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం కచ్చితంగా ఓడిపోతుందని కాక్రోచ్ జనతా పారీ్ట(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తేల్చిచెప్పారు. కేంద్రంలో ప్రభుత్వం మారడం ఖాయమని అన్నారు. మార్పునకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్)తోపాటు ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా శనివారం కేరళంలోని కొచ్చిలో నిర్వహించిన ‘జంతర్‌మంతర్ ఎట్ కొచ్చి’నిరసన కార్యక్రమంలో దీప్కే ప్రసంగించారు. ప్రభుత్వ మార్పు ఎన్నికల ద్వారానే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
దేశంలో స్వతంత్ర, నిష్పక్షపాత ఎన్నికల వ్యవస్థ ఉండాలని డిమాండ్ చేశారు. మోదీ అధికారంలో కొనసాగుతారని బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని, వాదనను ప్రస్తావించారు. ‘‘2029 కోసం సిద్ధంగా ఉండండి. మోదీ కచ్చితంగా దిగిపోతారు’’అని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా సాగాలంటే జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని పునరుద్ఘాటించారు. ‘‘జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి తప్పుకోవాలి. ఆయన వెళ్తే, నరేంద్ర మోదీ కూడా వెళ్లిపోతారు’’అని స్పష్టంచేశారు. సీఈసీని కాపాడేందుకు మోదీ ప్రభుత్వం దేశంలోని యువతపైనే యుద్ధం చేస్తోందని దీప్కే మండిపడ్డారు. ప్రధానమంత్రికి జ్ఞానేశ్ కుమార్ ఎందుకు అంత ముఖ్యమైన వ్యక్తి అయ్యారని ప్రశ్నించారు.
ఎన్ని అరెస్టులు చేసినా జాతీయ పతాకాన్ని వదలను
కేంద్ర ప్రభుత్వం తనను ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా సరే.. జాతీయ పతాకంతోనే దేశం మొత్తం పర్యటిస్తానని అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ, ప్రధాని నరేంద్ర మోదీలు ప్రజల ఆహార అలవాట్లు, వ్యక్తిగత సంబంధాలు, ఓటు హక్కులను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. దేశంలో స్వతంత్ర, నిష్పాక్షిక ఎలక్టోరల్ వ్యవస్థ ఏర్పాటయ్యేంత వరకూ ఈ పోరాటం కొనసాగుతుందని అన్నారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ప్రవేశించి జాతీయ పతాకాన్ని ఎగురవేసినందుకు తనను, తన ఇద్దరు సోదరులు సౌరవ్‌దాస్, అశుతోష్ రాంకాలను అరెస్ట్ చేయడాన్ని ప్రస్తావిస్తూ... ఇకపై ఎక్కడికెళ్లినా త్రివర్ణ పతాకాన్ని తీసుకెళతానని ప్రకటించారు. ‘‘తివర్ణ పతాకాన్ని ఎగురవేసినందుకు నేను జైలుకు వెళ్లాల్సి వచ్చింది. సోదరులు సౌరవ్, అశుతోష్ కూడా ఈ కారణంగానే జైలుకు వెళ్లారు. ఇలాంటి ఘటన చివరిగా జరిగింది బ్రిటిష్ పాలనలోనే’’అని అన్నారు. మోదీ ప్రభుత్వాన్ని, బ్రిటిష్ పాలనను పోలుస్తూ.. ప్రస్తుత ప్రభుత్వం వ్యక్తుల స్వేచ్ఛను నియంత్రించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
‘‘నరేంద్ర మోదీకి ఒక విషయం చెప్పదలచుకున్నా. ఎక్కడికెళ్లినా ఈ త్రివర్ణ పతాకాన్ని తీసుకువెళతా. దేశంలోని ప్రతిచోటకూ. కావాలంటే అరెస్ట్ చేసుకో. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళం లేదా తమిళనాడు ఎక్కడైనా అరెస్ట్ చేసుకో. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా అరెస్ట్ చేసుకో. వెనక్కు వస్తా. మళ్లీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తా’’అని సవాలు విసిరారు. కేంద్రం క్రమేపీ ఏం తినాలో? ఎవర్ని పెళ్లి చేసుకోవాలో? ఎవరికి ఓటేయాలో కూడా నియంత్రించే దిశగా వెళుతోందని దీప్కే ఆరోపించారు. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)ను చేపట్టారని ఆరోపించారు.


