అశోక్‌నగర్: మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఒక రోజు వయసున్న ఆడ శిశువు ఎస్‌ఎన్‌సీయూ వార్డులో అనుమానాస్పదంగా మృతి చెందగా, పోస్టుమార్టం నివేదికలో గొంతు నులిమి హత్య చేసినట్లు నిర్ధారణ కావడం కలకలం రేపింది. ఘటన సమయంలో వార్డులో శిశువుతో పాటు తల్లి, అమ్మమ్మ మాత్రమే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
చందేరి ప్రాంతంలోని సక్రా గ్రామానికి చెందిన భావన ఇటీవల ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం పాపను అశోక్‌నగర్ జిల్లా ఆస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూ వార్డుకు తరలించారు. అయితే శనివారం మధ్యాహ్నం శిశువు పరిస్థితి విషమించడంతో వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ప్రకటించారు. వైద్యులు శిశువును పరిశీలించినప్పుడు ఆమె మెడపై గాయాలు కనిపించాయి. నోటి నుంచి రక్తస్రావం కూడా ఉన్నట్లు గుర్తించారు. సివిల్ సర్జన్ డాక్టర్ బి.ఎల్. ఠాగూర్ తెలిపిన వివరాల ప్రకారం.. తల్లి శిశువుకు పాలిచ్చిన కొద్దిసేపటికే పాప అపస్మారక స్థితిలో కనిపించింది. వైద్యుల పరిశీలన అనంతరం అనుమానం బలపడింది.
శిశువు మెడపై కనిపించిన గాయాలు, ఇతర పరిస్థితుల ఆధారంగా వైద్యులు అనుమానాస్పద మరణంగా గుర్తించారు. అనంతరం నిర్వహించిన పోస్టుమార్టం ద్వారా గొంతు నులిమి హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన సమయంలో శిశువుతో పాటు ఆమె తల్లి, అమ్మమ్మ మాత్రమే వార్డులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బయట నుంచి గుర్తుతెలియని వ్యక్తి ఎవరైనా వార్డులోకి ప్రవేశించినట్లు ఇప్పటివరకు ఆధారాలు లభించలేదని వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యులపైనే దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు.
ఎస్‌ఎన్‌సీయూ వార్డు లోపల సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో.. ఆస్పత్రి కారిడార్లు, పరిసర ప్రాంతాల్లోని కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. తల్లి, అమ్మమ్మను పోలీసులు క్షుణ్ణంగా ప్రశ్నిస్తున్నట్లు స్టేషన్ ఇన్‌చార్జ్ తెలిపారు. శిశువు మృతికి అసలు కారణం, ఘటనకు బాధ్యులెవరు అన్నది దర్యాప్తు పూర్తయిన తర్వాత స్పష్టమయ్యే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: ‘క్యాప్సూల్ వార్డ్‌రోబ్’ వెంట ‘జెన్ జెడ్’ పరుగులు!


