రాజ్యాంగం ప్రకారం న్యాయవ్యవస్థ అత్యంత స్వతంత్రంగా పని చేయాలి. పౌరహక్కులకు, స్వేచ్ఛకు భంగం కలిగినప్పుడు న్యాయ వ్యవస్థ రక్షణ కవచంగా ఉండాలి. అందుకోసమే రాజ్యాంగ నిర్మాతలు న్యాయవ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించారు. దేశంలోని న్యాయవ్యవస్థకు గౌరవం, ప్రజలలో నమ్మకం కలగడానికి న్యాయవాదుల పాత్ర, కృషి, నిబద్ధత విస్మరించరానివి.
అలాంటి న్యాయవాదులను తయారుచేసే నల్సర్ విశ్వవిద్యా లయం విద్యార్థులు తమ ఉపకులపతి, రిజిస్ట్రార్లకు ఒక లేఖ రాశారు. తమ స్నాతకోత్సవానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించే అంశాన్ని పునః పరిశీలించాలని అందులో కోరారు. స్నాతకోత్సవ తేదీ ఇంకా ఖరారు కాలేదు, ముఖ్య అతిథి ఎంపిక కూడా తుది దశకు రాలేదని తమకు తెలుసునని చెబుతూనే అధికారిక నిర్ణయం తీసుకునే ముందు తమ అభిప్రాయాన్ని వినాలని కోరారు. విద్యార్థులు స్నాతకోత్సవాన్ని బహిష్కరిస్తామని చెప్పలేదు, న్యాయవ్యవస్థను తిరస్కరించలేదు, న్యాయమూర్తి తీర్పులన్నింటినీ ప్రశ్నించలేదు. విద్యార్థుల అభ్యంతరం, ఆవేదన... ఒక నిర్దిష్ట సందర్భంలో న్యాయవ్యవస్థ ప్రవర్తించిన తీరుపై మాత్రమే. కానీ విద్యార్థులు ప్రశ్నించారనే కారణంతో వారి గొంతును నొక్కివేయడం ప్రజాస్వామ్య పద్ధతి కాదు.
న్యాయ విద్య అంటే సెక్షన్లు బట్టీ పట్టడం, కోర్టులో వాదించడం మాత్రమే కాదు. న్యాయ విద్య అంటే అధికారాన్ని ప్రశ్నించడం, బలహీనుడి పక్షాన నిలబడటం, అన్యాయాలకు గురైనవారి వెంట, పౌర హక్కులకు దూరమైనవారి వెంట నిలబడి రాజ్యాంగాన్ని కాపాడటం కూడా. ప్రజాస్వామ్యానికి ప్రశ్నలు ప్రమాదకరం కాదు, ప్రశ్నలకు సమాధానాలు లేకపోవడం ప్రమాదం. న్యాయవ్యవస్థను బలహీనపరిచేది విమర్శ కాదు, న్యాయవ్యవస్థపై విమర్శ వినే ఓపిక లేకపోవడమే ప్రమాదకరం.
ఆ అధికారం ఎక్కడిది?
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లా విద్యార్థులపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికార పరిధి లేదు. విద్యార్థుల ప్రవర్తన కోర్టు ధిక్కరణ చర్య కానీ లేదా దేశ చట్టాల ఉల్లంఘన కానీ కానే కాదు. కొందరు విద్యార్థులు ఒక ప్రముఖుడు తమ స్నాతకోత్స వంలో భాగం పంచుకోవడాన్ని వ్యతిరేకిస్తూ చేసిన శాంతియుత ప్రాతినిధ్యం ఆధారంగా పట్టభద్రులవుతున్న వారిని బార్ కౌన్సిల్స్‌లో నమోదు చేసుకోవద్దని నిషేధం విధించడం కరెక్టు కాదు. తమ సొంత కాన్వొకేషన్ కొరకు ముఖ్య అతిథి ఎంపికపై విద్యార్థులు అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం తప్పెలా అవుతుంది?
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు... బార్ స్వతంత్రతను, సమగ్రతను పరిరక్షించడం ప్రాథమిక బాధ్యత. బార్ కౌన్సిల్ చైర్మన్ చేసిన ఈ చర్య అప్రజాస్వామికం. నిషేధాన్ని వెనక్కి తీసుకుని, చైర్మన్ ఇప్పటికే క్షమాపణ చెప్పినప్పటికీ ఆయనపై అధికారిక విచారణ చేపట్టాలి. తక్షణమే ఆయనను తొలగించాలి. నల్సర్ విద్యార్థులు సహజ న్యాయం గురించి చదివారు. అలాగే రాజ్యాంగానికి అతీతమైన అధికారం ఏదీ లేదని నల్సార్‌లోనే వారికి బోధించారు. ఈ జ్ఞానంతోనే విద్యార్థులు తమ సొంత సంస్థకు హేతుబద్ధమైన లేఖ రాసి బెదిరింపులకు గురికావడం బాధాకరం. ప్రజాస్వామ్యానికి అవసరమైనది అంధభక్తి కాదు, సంస్థలను గౌరవిస్తూనే వాటిని ప్రశ్నించే సంస్కృతి కావాలి. ప్రజాస్వామ్యంలో గౌరవమంటే జవాబుదారితనం నుంచి మినహాయింపు కాదనేది అర్థం చేసుకోవాలి.
– దిగుపాటి రాజగోపాల్ ‘ ఏఐఎల్‌యూ ఏపీ గౌరవ అధ్యక్షులు


