ఆరోగ్యాన్ని సాగు చేసే దిశగా... | Healthy agriculture can prevent that very disease | Sakshi
Sakshi News home page

ఆరోగ్యాన్ని సాగు చేసే దిశగా...

Aug 22 2026 3:46 AM | Updated on Aug 22 2026 3:46 AM

Healthy agriculture can prevent that very disease

భారత వ్యవసాయం దశాబ్దాలుగా ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించింది. ఆకలి నుంచి దేశాన్ని బయటకు తీసుకువచ్చింది. ఆహార ధాన్యాల కొరతతో బాధపడిన దేశాన్ని ఆహార భద్రత కలిగిన దేశంగా మార్చింది. ఇప్పుడు మన ముందున్న సవాలు మాత్రం భిన్నమైనది. ప్రజలకు తినడానికి ఆహారం ఉండటమే కాదు... వారు తింటున్న ఆహారం వారిని ఆరోగ్యంగా ఉంచుతున్నదా? అనే ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన సమయం వచ్చింది.

ఈ నేపథ్యంలో 2026 మే 11న భారత వైద్య పరిశోధనామండలి (ఐసీఎంఆర్‌), భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐకార్‌) సంయుక్తంగా ప్రారంభించిన ‘సెహత్‌’ (సైన్స్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ హెల్త్‌ త్రూ అగ్రికల్చరల్‌ టాన్స్‌ఫర్మేషన్‌) ప్రాధాన్యం సంతరించుకుంది. వ్యవసాయం, పోషకాహారం, ప్రజారోగ్యాన్ని ఒకే వేదిక పైకి తెచ్చి, వ్యవసాయ పరిశోధన ఫలితాలను నేరుగా ప్రజల ఆరోగ్య ఫలితాలతో అనుసంధానించడం దీని ప్రధాన లక్ష్యం. జీవ పోషక సమృద్ధి కలిగిన, పోషక విలువలు అధికంగా ఉన్న పంటలు; వైవిధ్యభరిత సమగ్ర వ్యవసాయ వ్యవస్థలు; రైతుల వృత్తిపర ఆరోగ్యం; మధుమేహం, ఊబకాయం వంటి జీవనశైలి వ్యాధుల నివారణ; ఒకే ఆరోగ్యం– ఇవీ దీని ఐదు ప్రధాన దిశలు.

పరస్పర విరుద్ధ పరిస్థితి
ఇది భారతదేశానికి అవసరమైన విధాన మార్పు. ఒకవైపు పోషకాహార లోపం కొనసాగుతుండగా, మరోవైపు ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటివి పెరుగుతున్నాయి. 6వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) ప్రకారం,దేశంలో ఐదేళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపం 35.5 శాతం నుంచి 29.3 శాతానికి తగ్గడం ఆశాజనకం. కానీ తక్కువ బరువున్న పిల్లలు ఇప్పటికీ 31.8 శాతం ఉన్నారు. అదే సమయంలో 15–49 ఏళ్లమధ్య ఉన్న మహిళల్లో అధిక బరువు/ఊబకాయం జాతీయ స్థాయిలో 30.7 శాతానికి చేరింది. అంటే ఒకే సమాజంలో పోషకా హార లోపం, అధిక పోషణ రెండూ కనిపిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సమస్య మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సర్వే ప్రకారం 15–49 ఏళ్ల మహిళల్లో ఏకంగా 47.9 శాతం మంది అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారు; గత ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఇది 36.3 శాతం. పురుషుల్లోనూ ఇది 31.1 నుంచి 41.5 శాతానికి పెరిగింది. మహిళల్లో 21.8 శాతం, పురుషుల్లో 24.1 శాతం మంది అధిక రక్త చక్కెర స్థాయులు లేదా మధుమేహ మందుల వినియోగం ఉన్న వర్గంలోకి వస్తున్నారు. అదే సమయంలో పిల్లల్లో ఎదుగుదల లోపం 31.2 నుంచి 24.6 శాతానికి తగ్గడం మంచి పరిణామం.

తెలంగాణలోనూ ఇదే చిత్రం దర్శనమిస్తోంది. ఐదేళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపం 33.1 శాతం నుంచి 27 శాతానికి తగ్గింది. కానీ 6–23 నెలల పిల్లల్లో సరిపడా ఆహారం అందుకుంటున్న వారు కేవలం 15.3 శాతమేమే. మరోవైపు మహిళల్లో 36.3 శాతం, పురుషుల్లో 35.5 శాతం అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారు. మహిళల్లో రక్తంలో అధిక చక్కెర ఉన్నవారు లేదా మధుమేహ మందుల వినియోగం చేయవలసిన స్థితిలో ఉన్నవారు 19.6 శాతం ఉండగా, పురుషుల్లో 24.5 శాతం మంది ఉన్నట్లుతేలింది. ఈ గణాంకాలు ఆరోగ్య సమస్యను కేవలం ఆసుపత్రిలో మాత్రమే పరిష్కరించలేమనీ, దానిలో ఒక భాగాన్ని పొలంలోనే పరిష్కరించాల్సి ఉంటుందనీ సందేశం ఇస్తున్నాయి.

వైవిధ్యానికి ప్రాధాన్యం
ఇప్పటివరకు వ్యవసాయ రంగంలో సాధించిన విజయాన్ని ప్రధానంగా దిగుబడి, ఉత్పత్తి, ధర, రైతు ఆదాయం ఆధారంగా కొలిచాం. ఇకపై పోషక విలువ, ఆహార వైవిధ్యం, ఆహార భద్రత, ఆరోగ్య ఫలితాలు కూడా వ్యవసాయ ప్రణాళికలో భాగం కావాలి. బియ్యం, గోధుమలతో కేలరీల భద్రత సాధించాం. ఇప్పుడు పప్పులు, చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, నూనెగింజలు, పాలు, గుడ్లు, చేపలు వంటి ఆహార వైవిధ్యానికి ప్రాధాన్యంపెంచాలి. తెలుగు రాష్ట్రాల్లో  ఇందుకు అపారమైన అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌కు ఉద్యానవన పంటలు, మత్స్యరంగం, చిరు ధాన్యాలు, పప్పుధాన్యాల్లో బలం ఉంది. తెలంగాణకు చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనెగింజలు, ఉద్యానవన పంటలు, పశుసంపద రంగాల్లో ప్రత్యేక సామర్థ్యం ఉంది. అధిక ఐరన్, జింక్‌ ఉన్న జీవపోషక సమృద్ధి పంటలు; మంచి మాంసకృత్తుల నాణ్యత కలిగిన పప్పుధాన్యాలు; రక్తంలో తక్కువ చక్కెర ప్రతిస్పందనకు అనుకూలమైన చిరుధాన్యాలు; యాంటీఆక్సిడెంట్లు, సూక్ష్మపోష కాలు సమృద్ధిగా ఉన్న పండ్లు, కూరగాయలు– ఇవన్నీ వ్యవసాయ పరిశోధన, విత్తన వ్యవస్థ, సాగు విస్తరణలో ప్రాధాన్యం పొందాలి. సెహత్‌ కూడా పోషక విలువలు అధికంగా ఉన్న, జీవపోషక సమృద్ధి పంటలను ప్రత్యేక ప్రాధాన్యంగా గుర్తించింది.

రైతు ఆరోగ్యమూ ముఖ్యమే!
అయితే రైతు ఆరోగ్యాన్ని మర్చిపోకూడదు. వ్యవసాయం ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వడమే కాకుండా, ఆ ఆహా రాన్ని పండించే రైతు కూడా సురక్షితంగా ఉండాలి. పురుగుమందుల ప్రభావం, తీవ్రమైన వేడి, యంత్ర ప్రమాదాలు, జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు వంటి అంశాలను వ్యవసాయ విస్తరణలో భాగం చేయాలి. ఇదే సెహత్‌లో వృత్తిపర ఆరోగ్యం, ఏక ఆరోగ్యానికి ఇచ్చిన ప్రాధాన్యం వెనుక ఉన్న భావన.

ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాల యాలు, వైద్య కళాశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌ వాడీలు కలిసి పనిచేసే కొత్త నమూనా అవసరం. ఒక జిల్లాలోఏ పోషకాహార లోపం లేదా అసాంక్రమిక వ్యాధులు ఎక్కువగా ఉన్నాయో ఆరోగ్య శాఖ గుర్తిస్తే... ఆ అవసరానికి తగిన పంటలు, వ్యవసాయ వ్యవస్థలు, ఇంటి తోటలు, పోషకాహార తోటలు,జీవ పోషక సమృద్ధి రకాలను వ్యవసాయ వ్యవస్థ ప్రోత్సహించ వచ్చు. జిల్లా ఆరోగ్య స్థితి వివరాలకు జిల్లా వ్యవసాయ ప్రణాళిక స్పందించాలి. అలాగే ప్రభుత్వ సేకరణ విధానం కూడా మారాలి. పాఠశాల మధ్యాహ్న భోజనం, అంగన్ వాడీలు, వసతి గృహాలు, ఆసుపత్రుల ఆహారంలో స్థానిక పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, గుడ్లు వంటి వాటికి స్థిరమైన డిమాండ్‌ సృష్టిస్తే ఒకేసారి రైతుకు మార్కెట్, పిల్లలకు పోషణ లభిస్తాయి.

ఇప్పటి వరకు మనం ఆహార భద్రత గురించి మాట్లాడాం.ఇక ఆరోగ్య భద్రత దిశగా అడుగు వేయాలి. మన వ్యవసాయశాస్త్రం ఒకప్పుడు ఆకలిని జయించింది. ఇప్పుడు మధుమేహం, ఊబకాయం, సూక్ష్మపోషక లోపాలు, ఆహార సంబంధిత వ్యాధులతో పోరాడటంలో కూడా తన పాత్రను విస్తరించాలి. ఆసుపత్రులు అనారోగ్యానికి చికిత్స చేస్తాయి. కానీ ఆరోగ్యకరమైన వ్యవసాయం ఆ అనారోగ్యాన్నే రాకుండా చేయగలదు. సెహత్‌ ఇచ్చే అసలైన సందేశం ఇదే. పొలం నుంచి పళ్లెం వరకు మాత్రమే కాదు; పళ్లెం నుంచి ప్రజారోగ్యం వరకూ వ్యవసాయ పాత్ర ఉందనిగుర్తించి ఆ దిశగా అడుగులు వేయాలి.

-వ్యాసకర్త ఐకార్‌–అటారి, హైదరాబాద్‌ డైరెక్టర్‌
-డా‘‘ షేక్‌ ఎన్‌. మీరా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement