మూడేళ్ల న్యాయవాద వృత్తి అనుభవం అవసరం లేదు
ఎంపికైన అభ్యర్థులు ఏడాదిపాటు క్లర్క్‌షిప్ చేయాలి
2:1 మెజారీ్టతో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు
న్యూఢిల్లీ: న్యాయ శాస్త్ర పట్టభద్రులకు సుప్రీంకోర్టు భారీ ఊరట కల్పించింది. ప్రవేశస్థాయి న్యాయ సేవా పరీక్ష రాయడానికి వారికి ఇంతకుముందు తప్పనిసరిగా ఉండాల్సిన మూడేళ్ల న్యాయవాద వృత్తి అనుభవాన్ని ఒక సంవత్సరానికి తగ్గించింది. ఎంట్రీ లెవెల్ జ్యుడీషియల్ సర్వీసు ఎగ్జామ్ రాయడానికి ఒక ఏడాది పాటు న్యాయవాద వృత్తిలో కొనసాగితే సరిపోతుందని వెల్లడించింది. అయితే, ఎంపికైన అభ్యర్థులు జ్యుడిషి యల్ అకాడమీలో శిక్షణతోపాటు మరో ఏడాది క్లర్క్‌షిప్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ ఎ.జి.మసీహ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2:1 మెజార్టీ తో శుక్రవారం తీర్పునిచి్చంది. గత సంవత్సరం మే 20న అప్పటి సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం కనీసం మూడేళ్ల న్యాయవాద వృత్తి అనుభవాన్ని ప్రమాణంగా నిర్దేశిస్తూ, కొత్తగా న్యాయశాస్త్రం పూర్తిచేసిన వారిని ప్రవేశ స్థాయి న్యాయ సేవల పరీక్షకు హాజరు కాకుండా నిషేధించింది. తాజాగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం గత ఏడాది నాటి తీర్పును సవరించింది.
న్యాయాధికారులు కావాలనుకునే న్యాయ పట్టభద్రులకు తప్పనిసరిగా ఉండాల్సిన మూడేళ్ల న్యాయవాద వృత్తి నిబంధనను సడలించింది. ‘మూడేళ్ల ప్రాక్టీస్ (వృత్తిపరమైన అనుభవం) నిబంధనతో సంబంధం లేకుండా న్యాయశాస్త్ర పట్టభద్రులందరూ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులేనని తేల్చిచెప్పింది. సమీక్షకు గురైన 2025 నాటి తీర్పు వెలువడి ఏడాదికి పైగా సమయం గడిచింది కాబట్టి అప్పటి అభ్యర్థులు ఒక సంవత్సరంపాటు ప్రాక్టీస్ పూర్తి చేసినట్లుగా పరిగణిస్తున్నట్లు వెల్లడించింది. వారు ప్రత్యేక ‘సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్’ను సమరి్పంచాల్సిన అవసరం వారికి ఉండదని పేర్కొంది.
శిక్షణలో పనితీరు సంతృప్తికరంగా ఉంటే..
ఎంట్రీ లెవెల్ జ్యుడీషియల్ సర్వీసు ఎగ్జామ్ ద్వారా ఎంపికైన అభ్యర్థులు విధుల్లో చేరిన తర్వాత ‘ట్రైనీ జ్యుడీషియల్ ఆఫీసర్లు’గా సంబంధిత రాష్ట్ర న్యాయ అకాడమీలో సంవత్సరం పాటు తప్పనిసరిగా సమగ్ర శిక్షణను పొందాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ కాలాన్ని ‘బార్’లో ఒక సంవత్సరం ప్రాక్టీస్‌తో సమానంగా పరిగణించాలని వెల్లడించింది.
శిక్షణ పొందుతున్న న్యాయాధికారులకు శిక్షణ కాలంలో సంబంధిత రాష్ట్రంలోని జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్‌కు చెల్లించే వేతనంలో సగ భాగానికి సమానమైన స్థిర భత్యాన్ని చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా సంబంధిత రాష్ట్ర న్యాయ అకాడమీలో శిక్షణార్థులకు సాధారణంగా కల్పించే సదుపాయాలు, ఇతర ప్రయోజనాలను పొందే అర్హత వారికి ఉంటుందని వివరించింది. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత మరో ఏడాది పాటు నిర్దిష్ట విధానంతో కూడిన ‘లా క్లర్క్‌షిప్’పూర్తిచేయాల్సి ఉంటుందని తెలిపింది.
ఈ కాలాన్ని కూడా ‘బార్’లో ఒక సంవత్సరం ప్రాక్టీస్‌తో సమానంగా పరిగణించాలని వెల్లడించింది. శిక్షణలో వారి పనితీరు సంతృప్తికరంగా ఉన్నట్లయితే క్షేత్రస్థాయిలోని సాధారణ పదవిలో నియమించాలని, ఆ తర్వాత వారు ఆ పదవికి వర్తించే సాధారణ వేతన శ్రేణిని, ఇతర సేవా ప్రయోజనాలను పొందేందుకు అర్హులవుతారని తీర్పునిచ్చింది. 2027 ఏప్రిల్ 1న లేదా ఆ తర్వాత జారీ చేసే నోటిఫికేషన్ల విషయంలో సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) నియామక పరీక్షకు హాజరయ్యే ప్రతి అభ్యర్థి సంబంధిత వృత్తిలో కనీసం ఒక సంవత్సరం పాటు ప్రాక్టీస్ కలిగి ఉండాలని ధర్మాసనం పేర్కొంది.


