సీఎం టూర్‌కు కేంద్రం నో | Revanth Reddy US Visit Cancelled After Centre Denies Permission | Sakshi
Sakshi News home page

సీఎం టూర్‌కు కేంద్రం నో

Aug 22 2026 1:44 AM | Updated on Aug 22 2026 1:44 AM

Revanth Reddy US Visit Cancelled After Centre Denies Permission

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలోని బ్లావత్నిక్‌ స్కూల్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ను సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, వర్సిటీ ప్రతినిధులు

ఆయన అమెరికా పర్యటన షెడ్యూల్‌ నిబంధనలకు అనుగుణంగా లేదన్న విదేశాంగ శాఖ  

రాజకీయ కారణాలతో అనుమతిని నిరాకరిస్తున్నట్లు వెల్లడి

ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌తో సీఎం ముఖాముఖి ఉన్నందునే యూఎస్‌ టూర్‌కు నిరాకరణ! 

యూకే పర్యటనకు మాత్రం అనుమతించినట్లు ప్రకటన 

కేంద్రం నిర్ణయంపై సీఎం విస్మయం.. 

ప్రపంచంలోని ప్రఖ్యాత విద్యాసంస్థలను తెలంగాణకు తీసుకురావడమే తన పర్యటన ఉద్దేశమని వెల్లడి 

అధికారుల బృందం యథావిధిగా అమెరికా వెళ్లాలని రేవంత్‌ ఆదేశం 

లండన్‌ నుంచి రేపు హైదరాబాద్‌కు సీఎం తిరిగి రాక

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం నో చెప్పింది. రాజకీయ కారణాలతో అనుమతిని నిరాకరిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆయన పర్యటన నిబంధనలకు అనుగుణంగా లేదని విదేశాంగ శాఖ వెల్లడించింది. అమెరికా, యూకే పర్యటనలకు విధివిధానాలు, ప్రొటోకాల్‌ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 16న కేంద్రం అనుమతి కోరారు. అయితే యూకే పర్యటనకు అనుమతిచ్చిన విదేశాంగశాఖ.. అమెరికా పర్యటనకు మాత్రం నిరాకరించింది. ‘ముఖ్యమంత్రులు లేదా ఇతర ప్రముఖుల విదేశీ పర్యటనల కోసం రాజకీయ అనుమతులు ఇచ్చేందుకు విదేశాంగ శాఖ ఆయా పర్యటనలను ఎప్పటికప్పుడు మదింపు చేస్తుంది. అలాంటి వారి విదేశీ పర్యటనలు ఆయా రాజ్యాంగబద్ధ పదవులకు, పర్యటన ఉద్దేశాలకు అనుగుణంగా ఉండాలి. కానీ తెలంగాణ సీఎం అమెరికా పర్యటన అందుకు అనుగుణంగా లేదు.

అందుకే సీఎం పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. అయితే సీఎం యూకే పర్యటనకు మాత్రం అనుమతి ఇచ్చాం’అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ«దీర్‌ జైశ్వాల్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గతంలో ఢిల్లీ సీఎంగా పనిచేసిన అరవింద్‌ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీ విదేశీ పర్యటనలకు సైతం విదేశాంగ శాఖ రాజకీయ అనుమతులు నిరాకరించడం గమనార్హం. కేంద్రం రాజకీయ అనుమతుల నిరాకరణ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు.

అయితే తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధి బృందాన్ని అమెరికా వెళ్లాలని.. ఇది వరకే అక్కడి సంస్థలతో సంప్రదింపులు జరిపినందున హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం, మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ), నార్త్‌ఈస్టర్న్‌ యూనివర్సిటీ, వర్జీనియా టెక్‌ వంటి సంస్థలతో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) కుదుర్చుకోవాలని సీఎం ఆదేశించారు. ఆయన మాత్రం ఈ నెల 23న హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ (ఐఓసీ) ఏర్పాటు చేయనున్న ముఖాముఖి కార్యక్రమాన్ని షెడ్యూల్‌లో చేర్చడం వల్లే ఆయన పర్యటనకు కేంద్రం అనుమతించలేదని సమాచారం. 

కేంద్రం నిర్ణయంపై సీఎం విస్మయం.. 
తెలంగాణ అభివృద్ధి, విద్యారంగ పురోగతికి, వికసిత్‌ భారత్‌ నిర్మాణానికి తోడ్పడే తన అమెరికా పర్యటనకు రాజకీయ కారణాలతో కేంద్రం అనుమతి నిరాకరించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కేంద్రం నిర్ణయాన్ని గౌరవిస్తూ లండన్‌ నుంచి హైదరాబాద్‌కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. ‘ఈ పర్యటన ఉద్దేశం ఒక్కటే. కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలో భాగంగా ప్రపంచంలోని ప్రఖ్యాత విద్యాసంస్థలను భారత్‌కు, తెలంగాణకు, హైదరాబాద్‌కు తీసుకురావడం. అత్యుత్తమ ఐవీ లీగ్‌ విశ్వవిద్యాలయాలను, ప్రపంచంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థల నుంచి విద్య, నైపుణ్యాలు, శిక్షణ పొందాలన్న మన యువత ఆకాంక్షలకు ఇవి సమాధానంగా నిలిచేవి. దేశ నిర్మాణం, యువత భవిష్యత్తు విషయంలో అందరూ రాజకీయాలు, ఎన్నికలకు అతీతంగా ఆలోచించాలని నేను ఎప్పుడూ విశ్వసిస్తాను’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 

ప్రపంచ అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతా.. 
‘హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి హెచ్‌సీయూ, జేఎన్‌టీయూ తదితర విశ్వవిద్యాలయాల ఏర్పాటు హైదరాబాద్‌ను అత్యుత్తమ మానవ వనరుల కేంద్రంగా మార్చింది. హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌... ప్రపంచానికి నాయకత్వం వహించగలమని నిరూపించింది. అక్కడి నుంచి ప్రపంచంలోని గొప్ప టెక్‌ నాయకుల్లో కొందరు రూపుదిద్దుకున్నారు. ఐఐటీ, ఐఎస్‌బీ, ఐఐఐటీ, నల్సార్‌ వంటి సంస్థల ఏర్పాటుతో హైదరాబాద్‌ అగ్రశ్రేణి సంస్థలు, వాటి గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లను ఆకర్షించగలిగింది.

ఇప్పుడు ప్రపంచంలోని ప్రఖ్యాత విద్య, నైపుణ్య సంస్థలకు హైదరాబాద్‌ను కేంద్రంగా మార్చి 21వ శతాబ్దపు మన ప్రగతి ప్రయాణానికి శక్తినిస్తాం. హైదరాబాద్‌ను ప్రపంచంలోని అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలన్నది నా సంకల్పం, ప్రయత్నం. ఒక సాధారణ భారతీయుడు హైదరాబాద్‌లోనే హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్‌ లేదా ఎంఐటీ, ఎల్‌బీఎస్, ఎల్‌ఎస్‌ఈ వంటి ప్రపంచస్థాయి సంస్థల నుంచి విద్య, సర్టీఫికేషన్‌ పొందగలగాలి. ఎందుకంటే చాలా మంది నాయకులు తమ పిల్లలను విదేశాలకు పంపాలని కోరుకున్నారు. కానీ నేను ప్రపంచంలోని అత్యుత్తమ విద్యాసంస్థలను భారత్‌కు తీసుకురావాలని అభిలషిస్తున్నాను’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement