విశ్వసనీయ వార్తలతోనే ప్రజాస్వామ్యం బలోపేతం | Governor Shivpratap Shukla at start of Federation of Press Clubs national conference | Sakshi
Sakshi News home page

విశ్వసనీయ వార్తలతోనే ప్రజాస్వామ్యం బలోపేతం

Aug 22 2026 1:04 AM | Updated on Aug 22 2026 1:04 AM

Governor Shivpratap Shukla at start of Federation of Press Clubs national conference

సదస్సులో మాట్లాడుతున్న గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా. చిత్రంలో కె. శ్రీనివాస్‌రెడ్డి, ఎన్‌.రామ్, ఎం.దానకిశోర్, గౌతమ్‌ లాహిరి, ఎస్‌.విజయ్‌కుమార్‌ రెడ్డి, వి.రమేశ్‌

ఫెడరేషన్‌ ఆఫ్‌ ప్రెస్‌క్లబ్స్‌ జాతీయ సదస్సు ప్రారంభంలో గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా 

సాక్షి, హైదరాబాద్‌: డిజిటల్‌ యుగంలో వేగం కంటే వార్తలో వాస్తవికత, నిష్పక్షపాతం, విశ్వసనీయతే అత్యంత ముఖ్య మని గవర్నర్‌ శివ ప్రతాప్‌శుక్లా అన్నారు. ‘ముందు నిజనిర్ధారణ చేయాలి.. ఆ తర్వాతే వార్తను ప్రసారం చేయాలి’అని ఆయన జర్నలిస్టులకు సూచించారు. హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం బంజారాహిల్స్‌ తాజ్‌ కృష్ణలో నిర్వహిస్తున్న ఫెడరేషన్‌ ఆఫ్‌ ప్రెస్‌క్లబ్స్‌ తొలి జాతీ య సదస్సును గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచి్చన ప్రెస్‌క్లబ్‌ల ప్రతినిధులకు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ప్రెస్‌క్లబ్‌ల ప్రతినిధులు, జర్నలిస్టులను ఉద్దేశించి గవర్నర్‌ మాట్లాడారు. మీడియా ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం మాత్రమే కాదని, సమాజానికి కళ్లు, చెవులు, ప్రజల గొంతుక అని గవర్నర్‌ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జర్నలిస్టులను ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్‌ వంటి సాంకేతిక పరిజ్ఞానాలు జర్నలిజానికి కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయన్నారు. అదే సమయంలో డీప్‌ఫేక్స్, ఏఐ రూపొందించిన వీడియోలు, తప్పుడు సమాచారంతో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు.

సోషల్‌ మీడియా ప్రభావంతో జెన్‌–జీ ఆలోచనా విధానం మారుతోందన్నారు. సంచలనాత్మకత, వైరల్‌ కంటెంట్‌ కంటే విశ్వసనీయత, నైతిక ప్రమాణాలకు మీడియా ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. ఫేక్‌ న్యూస్‌ను ఎదుర్కొనేందుకు డిజిటల్‌ లిటరసీ, ఏఐ లిటరసీ, ఫ్యాక్ట్‌ చెకింగ్‌ వంటి అంశాలపై ఫెడరేషన్‌ అవగాహన పెంచాలని సూచించారు. నషా ముక్త్‌ భారత్‌’, ‘టీబీ ముక్త్‌ భారత్‌’వంటి జాతీయ కార్యక్రమాలను ప్రజాఉద్యమాలుగా మలచడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. తమ రచనలు, వార్తా సంస్థలు, డిజిటల్‌ వేదికల ద్వారా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జర్నలిస్టులను కోరారు.

ఫెడరేషన్‌ రాజకీయాలకు అతీతంగా సమ్మిళిత, ప్రజాస్వామ్య వేదికగా ఎదగాలని ఆకాంక్షించారు. జాతీయ సదస్సు భారతీయ జర్నలిజాన్ని మరింత బలోపేతం చేసి, విశ్వసనీయంగా, ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా తీర్చిదిద్దే దిశగా దోహదపడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో  ‘ది హిందూ’గ్రూప్‌ పబ్లిషింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ ఎన్‌.రామ్, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ కె. శ్రీనివాస్‌రెడ్డి, గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దానకిశోర్, ఫెడరేషన్‌ ఆఫ్‌ ప్రెస్‌క్లబ్స్‌ అధ్యక్షుడు గౌతమ్‌ లాహిరి, హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు ఎస్‌.విజయ్‌కుమార్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వి.రమేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement