ఇందిరా గాంధీ చిత్రపటం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లు కూడా.. యూనివర్సిటీ ప్రతినిధులతో భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి సూచన
సాక్షి, హైదరాబాద్: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లు, స్పెషలైజ్డ్ రీసెర్చ్ సెంటర్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణను అంతర్జాతీయ విద్య, పరిశోధనా కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన తెలంగాణ రైజింగ్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం బ్రిటన్‌లోని 900 ఏళ్ల చరిత్రగల ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా బ్లావత్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ ప్రొఫెసర్ మాయా తుడోర్, బాలియోల్ కాలేజీ ప్రొఫెసర్ ఫైసల్ దేవ్‌జీలతో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ప్రత్యేకంగా సమావేశమైంది.
హైదరాబాద్‌ను గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేందుకు ఉన్న ప్రణాళికలను సీఎం వివరించారు. కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యా విధానం ప్రకారం విదేశీ విశ్వవిద్యాలయాలకు లభించే అవకాశాలు, తెలంగాణలో అందుబాటులో ఉన్న సానుకూల వాతావరణంపై సీఎంఓ సలహాదారు కేఆర్ రామకృష్ణారావు ఒక విస్తృత ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిపై ఆక్స్‌ఫర్డ్ ప్రొఫెసర్లు సానుకూలంగా స్పందిస్తూ తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి ఆసక్తి చూపారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమీట్‌కు రావాల్సిందిగా ఆక్స్‌ఫర్డ్ ప్రతినిధులను సీఎం బృందం ఆహ్వనించింది.
సోమర్‌విల్ కాలేజీలో ఇందిరా గాంధీ చిత్రపటానికి నివాళి
అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ప్రముఖ సోమర్‌విల్ కాలేజీని సందర్శించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అక్కడ చదువుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని 2002లో సోనియా గాంధీ బహూకరించిన ఇందిరమ్మ చిత్రపటాన్ని సీఎం తిలకించి నివాళులర్పించారు.
క్రీడా మౌలిక సదుపాయాలపై జీఎంఆర్‌తో చర్చలు..
తర్వాత జీఎంఆర్ గ్రూప్ పర్యవేక్షణలోని యుటిలిటా బౌల్ సమీకృత క్రీడా ప్రాంగణాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించారు. జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రంథితో కలిసి అక్కడ ఉన్న గోల్ఫ్ కోర్స్, హోటల్, క్రీడా వసతులను పరిశీలించారు. తెలంగాణలో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక వసతుల కల్పనకు పెట్టుబడులు పెట్టాలని జీఎంఆర్ గ్రూప్‌ను రేవంత్‌రెడ్డి కోరారు. అనంతరం లండన్‌లోని ఎమిరేట్స్ స్టేడియంలో ఆర్సెనల్, కోవెంట్రీ జట్ల మధ్య జరిగే ఈపీఎల్ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను వీక్షించారు.


