యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెంలో విషాదం నెలకొంది. హెజిలో ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో ఇద్దరు కార్మికుల మృతి చెందారు. మరో 11 మందికి గాయాలయ్యాయి. రాత్రి 10:30 గంటల టైంలో ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. పరిసర ప్రాంతంలో దట్టంగా పొగ అలముకుంది.
అయితే మూడు నెలల వ్యవధిలో కంపెనీలో రియాక్టర్ పేలడం ఇది రెండోసారి అని తెలుస్తోంది. ఈ సంఘటన కారణంగా కంపెనీ నుంచి విష రసాయనాలు వెలువడుతున్నాయి. ఘాటైన వాసన వస్తుండటంతో సమీప గ్రామాల ప్రజల ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దోతిగూడెం, అంతమ్మగూడెం వరకు రసాయనాల ఘాటు వ్యాపించింది. సంఘటన జరిగిన వెంటనే ఫార్మా కంపెనీ దగ్గరకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నా కూడా రసాయనాలు లీక్ అవుతుండటంతో పెద్ద ఎత్తున పొగ వ్యాపిస్తోంది.


