కొలీజియం సిఫార్సుకు కేంద్రం అనుమతి
హైకోర్టు సీజేకు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు
తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శామ్ కోషి
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్‌సింగ్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టీకల్ 124(2) కింద రాష్ట్రపతి ఈ నియామకానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. జస్టిస్ ఏకే సింగ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అలాగే, గుజరాత్, ఢిల్లీ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులుగా సేవలందిస్తున్న జస్టిస్ సునీత అగర్వాల్, జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయలకూ సుప్రీంకోర్టు జడ్జీలుగా పదోన్నతి కల్పించారు.
కేంద్ర న్యాయశాఖ జాయింట్ సెక్రటరీ జగన్నాథ్ శ్రీనివాసన్ పేరుతో ఈ నోటిఫికేషన్ జారీ అయింది. జస్టిస్ ఏకే సింగ్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా గత వారం కొలీజియం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు చీఫ్ జస్టిస్ పదోన్నతి నేపథ్యంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శామ్ కోషిని నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, జస్టిస్ ఏకే సింగ్ ఇప్పటికే ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. తెలంగాణ హైకోర్టు విభజన తర్వాత ఏడుగురు ప్రధాన న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టగా, అందులో జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ అపరేశ్‌సింగ్ కుమార్ మాత్రమే నేరుగా సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందడం గమనార్హం. ఇదిలా ఉండగా, సుప్రీంకోర్టులో సీజేఐతో కలిపి మొత్తం మంజూరైన జడ్జీ పోస్టుల సంఖ్య 38 కాగా, తాజా నియామకాలతో ఈ సంఖ్య 37కి చేరింది.
న్యాయకోవిదుల కుటుంబంలో...
న్యాయకోవిదుల కుటుంబంలో మూడో తరానికి చెందిన జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ 1965, జూలై 7న జన్మించారు. ఢిల్లీ వర్సిటీ నుంచి బీఏ ఆనర్స్, ఎల్‌ఎల్‌బీ పట్టాలు పొందారు. 1990లో న్యాయవాదిగా నమోదు చేసుకుని అదే ఏడాది నుంచి 2000 వరకు పట్నా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2001 నుంచి జార్ఖండ్ హైకోర్టులో న్యాయవాదిగా కొనసాగారు. 2012, జనవరి 24న జార్ఖండ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన 2014, జనవరి 16న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2023, ఏప్రిల్ 17న త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళ్లారు. 2025, జూలై 19న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వచ్చారు.


