జనసేన ఎంపీ లింగమనేని కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదాన్ని పక్కదారి పట్టించే కుట్ర వెలుగులోకి
ఓ ప్రైవేటు డ్రైవర్‌ను నిందితుడిగా చూపేందుకు పక్కా ప్రణాళిక
యాక్సిడెంట్ చేసింది తానేనంటూ స్టేషన్‌లో లొంగిపోయేందుకు వచ్చిన వ్యక్తి
పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ముసుగు డ్రైవర్‌గా గుర్తించిన సీనియర్ ఐపీఎస్ అధికారి
పెద్దల నుంచి ఫోన్లు, రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా లెక్కచేయకుండా కేసు విచారణపై నేరుగా పర్యవేక్షణ
దీంతో వేరే దారి లేక సంజూషే కారు నడిపినట్లు అధికారికంగా పోలీసుల నిర్ధారణ.. కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: జనసేన రాజ్యసభ సభ్యుడు, వ్యాపారవేత్త లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజూష్ (21) చేసిన రోడ్డు ప్రమాదం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 16న హైదరాబాద్‌లోని మాదాపూర్ ఇనార్బిట్ మాల్ ముందు రోడ్డు దాటుతున్న భారతి ముఖి (26) అనే సేల్స్ గర్ల్‌ను అతివేగంగా, నిర్లక్ష్యంగా లగ్జరీ కారుతో (టీజీ 09 జీ 0666) సంజూష్ ఢీకొట్టడం వల్ల ఆమె మృతిచెందడం తెలిసిందే. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే కేసు నుంచి సంజూష్‌ను తప్పించేందుకు, మరొకరిని కారు నడిపిన డ్రైవర్‌గా చిత్రీకరించేందుకు విశ్వప్రయత్నాలు జరిగినట్లు తెలిసింది. మొదట్లో కారు రిజి్రస్టేషన్ నంబర్ మాత్రమే బయటకు రావడంతో కేసును పక్కదారి పట్టించేందుకు ప్రైవేట్ డ్రైవర్‌ను నిందితుడిగా చూపే యత్నాలు జరిగాయి.
నిందితుడు జనసేన ఎంపీ కొడుకు కావడంతో కేసు తీవ్రతను తగ్గించేందుకు రాజకీయ, ఆర్థిక వర్గాల నుంచి పోలీసు ఉన్నతాధికారులకు తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు మొదలయ్యాయి. కారు నడిపినది తమ వద్ద పనిచేసే ప్రైవేట్ డ్రైవర్ అని చూపించేందుకు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు. కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా పోలీసులు ప్రాథమిక విచారణ చేపడుతున్న సమయంలోనే బాధ్యతను తనపై వేసుకోవడానికి ఒక ప్రైవేట్ డ్రైవర్ ముందుకొచి్చనట్లు తెలిసింది. ‘కారు నేనే నడిపాను, ప్రమాదం నా వల్లే జరిగింది’అని పోలీసు స్టేషన్‌లో లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ వ్యవహారంలో వచి్చన పెద్దల ఫోన్ కాల్స్, రాజకీయ వర్గాల ఒత్తిళ్లను లెక్కచేయకుండా ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి కేసు విచారణను నేరుగా తన పర్యవేక్షణలోకి తీసుకున్నారు.

సంజూష్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహిస్తున్న దృశ్యం (ఫైల్)
సీన్ వద్ద ఉన్న పరిస్థితులు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలంతో డ్రైవర్ చెప్పిన కథనానికి పొంతన లేకపోవడాన్ని ఆ అధికారి గుర్తించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అసలు నిందితుడిని మార్చడానికి వీల్లేదని.. డ్రైవర్‌ను ముసుగుగా పెడితే కఠిన చర్యలు ఉంటాయని అధికారులను తీవ్రంగా హెచ్చరించారు. దీంతో వేరే దారి లేక పోలీసులు కారు యాజమాన్య సంస్థ ప్రతినిధులను, సంజూష్ ను పిలిపించి అసలు డ్రైవర్ అతనేనని అధికారికంగా నిర్ధారించారు.
అనంతరం అతన్ని స్టేషన్‌కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితుడిపై మాదాపూర్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 106(1) (అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల మరణం సంభవించడం) కింద కేసు నమోదు చేశారు. మద్యం, డ్రగ్స్ పరీక్షల ఫలితాలు నెగెటివ్‌గా వచ్చాయని, చట్టప్రకారం 7 ఏళ్ల కంటే తక్కువ శిక్ష పడే సెక్షన్ కావడంతో అతనికి పోలీసులు 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. వాహనాన్ని స్వా«దీనం చేసుకొని తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
హానర్ ప్రైమ్ హౌసింగ్ పేరు మీద కారు..
అమెరికాలోని టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి సీఎస్ డిగ్రీ పూర్తి చేసిన సంజూష్.. బ్లాక్ రిడ్జ్ ఎనర్జీ, క్యాపిటల్ ఎనర్జీ సంస్థల్లో డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. సంజూష్ నడిపిన టీజీ 09జీ 0666 నంబర్‌గల ఆస్టిన్ మారి్టన్ లాగోండ లగ్జరీ కారు హానర్ ప్రైమ్ హౌసింగ్ ఎల్‌ఎల్‌పీ కంపెనీ పేరిట రిజిస్టర్ అయిఉంది. హైదరాబాద్‌లో ప్రముఖ స్థిరాస్తి కంపెనీ అయిన హానర్ హోమ్స్ అనుబంధ సంస్థ ఇది. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ విభాగంలో కారు యజమాని జూబ్లీహిల్స్‌లోని కేఆర్బీ టవర్ ఫ్లాట్ నంబర్–1 చిరునామా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో సంజూష్‌తోపాటు ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎంవీఐ నివేదిక కీలకం
కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్
కేసు నమోదైన వెంటనే ప్రమాదానికి కారణమైన వాహనం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని మద్యం, డ్రగ్స్‌కు సంబంధించి ప్రాథమిక పరీక్షలు నిర్వహించామని కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ చెప్పారు. ఆ పరీక్షల్లో నెగెటివ్ ఫలితాలు వచి్చనట్లు వెల్లడించారు. అనంతరం నిందితుడి రక్త నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపించామని తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని సీజ్ చేసి మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ) తనిఖీకి పంపినట్లు చెప్పారు. ఎంవీఐ నివేదిక ఇంకా రావాల్సి ఉందని.. అది కూడా దర్యాప్తులో కీలక ఆధారంగా ఉంటుందని పేర్కొన్నారు.
సెక్షన్ 106 (1) కింద నమోదైన నేరానికి గరిష్టంగా ఐదేళ్ల శిక్ష విధించే అవకాశం ఉన్నందున ఏడేళ్లలోపు శిక్ష పడే నేరాల్లో అరెస్ట్ అవసరమా లేదా? అనే అంశాన్ని బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 35 ప్రకారం పరిశీలించాల్సి ఉంటుందని డీసీపీ తెలిపారు. అరెస్ట్‌కు సంబంధించి సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసులో ఇచ్చిన మార్గదర్శకాలను కూడా దర్యాప్తు అధికారి పరిగణనలోకి తీసుకున్నారని చెప్పారు.
ఆ సమయంలో అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించాక నిందితుడిని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితులు కనిపించలేదని.. అందుకే బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 35 కింద నోటీసు జారీ చేసి దర్యాప్తుకు సహకరించాలని ఆదేశించినట్లు డీసీపీ రితిరాజ్ వెల్లడించారు. పూర్తిగా చట్టపరమైన నిబంధనలు, కేసులో అప్పటివరకు అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగానే నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఎంవీఐ నివేదికతోపాటు ఇతర ఆధారాలను సేకరించి పరిశీలిస్తామని తెలిపారు. తదుపరి దర్యాప్తులో అరెస్ట్ అవసరమని తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీసీపీ రితిరాజ్ స్పష్టం చేశారు.


