కనీస వేతనాలపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రశ్న
ఆర్టికల్ 21తో పని హక్కును సమానం చేయలేమని స్పష్టీకరణ
తాజా గణాంకాలతో మళ్లీ పిటిషన్ వేయాలని సూచన
సాక్షి, న్యూఢిల్లీ: గ్రామీణ కార్మికులకు చట్టబద్ధంగా కల్పించిన ఉపాధి హామీని రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద పేర్కొన్న జీవించే హక్కుతో సమానంగా చూడగలమా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పని హక్కును రాజ్యాంగం ప్రాథమిక హక్కుగా గుర్తించలేదని, దీనిని ఆదేశిక సూత్రాల పరిధిలోని బాధ్యతగా మాత్రమే చేర్చిందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు చెల్లించడంతో పాటు వేతనాల చెల్లింపులో జరిగే జాప్యానికి పరిహారం ఇప్పించేలా ఆదేశాలివ్వాలంటూ అరుణా రాయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం ధర్మాసనం విచారణ చేపట్టింది.
అది ప్రజాస్వామ్య ఆకాంక్ష మాత్రమే
రాజ్యాంగం పని హక్కును ప్రాథమిక హక్కుగా చేయలేదని, ఇది కేవలం నాలుగో భాగంలో ఉన్న ప్రజాస్వామ్య ఆకాంక్ష మాత్రమేనని జస్టిస్ బాగ్చీ విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ ఆకాంక్షను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించి, దానికి అనుగుణంగా వేతనాలు ఇస్తుందని పేర్కొన్నారు. దీనిని ఆర్టికల్ 21తో సమానంగా చూడలేమన్నారు. ఒకవేళ పని హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తిస్తే, భవిష్యత్తులో ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను తగ్గించుకున్నప్పుడు పలానా పథకాన్ని అమలు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయగలదా అనే అతిపెద్ద ప్రశ్న ఉత్పన్నమవుతుందని ఆయన పేర్కొన్నారు.
పెరిగిన వేతనాలు, పనిదినాలు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) స్థానంలో కేంద్ర ప్రభుత్వం 2026 జూలై 1 నుంచి ’వికసిత్ భారత్ –గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్, అజీవికా మిషన్ (గ్రామీణ)’(వీబీ–జీ ర్యామ్ జీ) చట్టాన్ని అమల్లోకి తెచి్చంది. పాత చట్టంలో గ్రామీణ కుటుంబానికి 100 రోజుల ఉపాధి కల్పించగా, కొత్త చట్టంలో దాన్ని 125 రోజులకు పెంచారు. కొత్త చట్టం ప్రకారం జాతీయ సగటు వేతనం రూ.298 నుంచి రూ.327కు పెరిగింది. పాత చట్టం కింద ఉన్న వేతనాల కన్నా కొత్త చట్టంలో వేతనాలు తగ్గకూడదనే నిబంధన కూడా ఉంది.
కనీస వేతనం ఇవ్వకుంటే వెట్టి చాకిరీయే
ఉపాధి హామీ చట్టం మారినప్పటికీ కనీస వేతనాలకు సంబంధించిన వివాదం ఇంకా కొనసాగుతోందని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు. రాష్ట్రాలు నిర్దేశించిన కనీస వేతనాలను తప్పనిసరిగా చెల్లించాల్సిందేనని, కనీస వేతనాల కంటే తక్కువ ఇస్తే అది వెట్టి చాకిరీ కిందకే వస్తుందని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఆయన ప్రస్తావించారు.
ఉపాధి పరిధి కూడా తగ్గుతుంది
ఉపాధి హామీ పథకానికి కనీస వేతనాల పరిమితిని విధిస్తే ఎదురయ్యే ఆచరణాత్మక ఇబ్బందులను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రభుత్వ వనరులు ఒకేలా ఉన్నప్పుడు, కనీస వేతనాలు పెంచాల్సి వస్తే, ఉపాధి పొందే కార్మికుల సంఖ్య తగ్గిపోతుందని ఆయన తెలిపారు. కనీస వేతనాల చట్టం వర్తింపు అనేది ఆ ఉపాధి పథకం కింద చేపట్టే పనుల స్వభావంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఉపాధి కింద చేసే పనులు కనీస వేతనాల చట్టం పరిధిలోకి రాకపోతే, ఆ చట్టం వర్తించదని సీజేఐ స్పష్టం చేశారు. సామాజిక చట్టాలను విస్తృతంగా అర్థం చేసుకోవాలన్న వాదనతో తానూ ఏకీభవిస్తానన్నారు.
మళ్లీ పిటిషన్‌కు పిటిషనర్ అంగీకారం
కొత్త చట్టం ఈ పిటిషన్‌లో ప్రస్తావించిన వేతన నిబంధనను సూచిస్తున్నందున, ప్రస్తుత పిటిషన్‌లోనే దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని ప్రశాంత్ భూషణ్ కోరారు. కొత్త పిటిషన్ వేయడం వల్ల మరింత జాప్యం జరుగుతుందన్నారు. అయితే, పాత పిటిషన్‌కు ఆధారమైన చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ మారిపోయిందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. కొత్త పథకం అమలుపై కోర్టుకు తాజా వివరాలు, గణాంకాలు అవసరమని తేల్చి చెప్పారు. వేతనాల చెల్లింపులో జాప్యానికి సంబంధించిన అంశం గతంలోనే ’స్వరాజ్ అభియాన్’తీర్పుతో పరిష్కారమైందని, ఆ తీర్పును అమలు చేయకపోతే కొత్తగా చర్యలు చేపట్టవచ్చని సూచించారు. దీంతో కొత్త చట్టం వీబీ–జీ ర్యామ్ జీ నిబంధనల ప్రకారం కనీస వేతనాలు, వేతనాల చెల్లింపులో జాప్యానికి పరిహారం కోరుతూ సమగ్ర వివరాలతో తాజా పిటిషన్ దాఖలు చేసేందుకు ప్రశాంత్ భూషణ్ అంగీకరించారు.


