ఎన్‌టీఏలో సంస్కరణలపై కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు
ఫూల్‌ప్రూఫ్ విధానమన్న సొలిసిటర్ జనరల్
న్యూఢిల్లీ: పరీక్షల నిర్వహణకు ఏర్పాటైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పనితీరును సంస్కరించేందుకు చేసిన మార్పులేమిటో మూడువారాల్లోగా తెలియజేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాధాకృష్ణన్, నందన్ నీలేకని కమిటీ సిఫారసుల అమలుకు తీసుకున్న చర్యలను తెలపాలని జస్టిస్ పీఎస్ నరసింహ, ఆలోక్ అరాధేల ధర్మాసనం ఆదేశించింది. ప్రవేశ పరీక్షలను సాఫీగా నిర్వహించేందుకు ఎన్‌టీఏలో సంస్కరణలను వ్యవస్థీకరించాలని, సాంకేతిక పరిజ్ఞానపరమైన మార్పులూ చేపట్టాలని అభిప్రాయపడింది.
నీట్ ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ ఏడుగురు సభ్యులతో కూడిన రాధాకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పరీక్షల నిర్వహణ, డేటా సెక్యూరిటీ నియమ నిబంధనలు, ఎన్‌టీయే వ్యవస్థాగత నిర్మాణం, పనితీరులపై సలహాలివ్వాలని కమిటీని కోరింది. దీంతోపాటే ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఒక ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్స్ పోటీ పరీక్షల్లో వ్యవస్థాగతమైన మార్పులు సిఫారసు చేసేందుకు ఏర్పాటైంది. ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) తరఫున న్యాయవాది తన్వీ దూబే, మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది.
‘‘ఎన్టీయేలో సమస్య వ్యవస్థాగతమైందని రాధాకృష్ణన్ కమిటీ సరిగ్గానే గుర్తించిందని, దీన్ని సక్రమంగా అమలు చేసేలా చేయడం కీలకమని, కాగితంపై అన్నీ బాగున్నా, ఒక పరీక్ష జరిగాక రెండో పరీక్ష నాటికి పరిస్థితి మారిపోతోంది’’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. ఎన్టీఏకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సిబ్బంది, సాంకేతిక సామర్థ్యాలు సమకూర్చాలని, ఏఐ, బ్లాక్‌చెయిన్ వంటి అధునాతన సాంకేతికతల ద్వారా పరీక్షల భద్రత, పారదర్శకతను బలోపేతం చేసేలా కమిటీ సిఫారసులు చేసినట్లు తెలిసిందని కోర్టు పేర్కొంది. ‘‘కమిటీ సిఫారసుల అమలు తీసుకున్న చర్యలు, వివరాలతో కార్యదర్శి అఫిడ విట్ దాఖలు చేయాలి. ఏ విషయం ఎంత సమ యంలోగా పూర్తవుతుందో సూచించే టైమ్‌లైన్‌తో మూడు వారాల్లో సమర్పించాలి’’ అని తెలిపింది.
‘ఫూల్‌ప్రూఫ్’ విధానం: కేంద్రం
నీట్ పరీక్షల్లో తీసుకొస్తున్న సంస్కరణలు ఫూల్‌ప్రూఫ్ అని కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి నివేదించారు. ముద్రణ నుంచి విద్యార్థులకు అందే వరకూ ప్రశ్న పత్రాల విషయంలో అన్ని భద్రత చర్యలు తీసుకున్నామని వివరించారు. క్వశ్చన్ బ్యాంకు తయారీలో పలువురు మాడరేటర్లను నియమించామని, తయారయ్యే ప్రశ్న పత్రంలో ఏ ప్రశ్న వస్తుందో వారికి తెలియదని చెప్పారు. సీసీటీవీ, సీఐఎస్‌ఎఫ్ పర్యవేక్షణలో ముద్రణ, పోలీసు బందోబస్తు, జీపీఎస్ ట్రాకింగ్‌తో రవాణా చేపడతామని, బ్యాంకు స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరుస్తామని తెలిపారు. పరీక్ష రోజున అధికారులు, విద్యార్థుల సమక్షంలో సీలు తెరవడం, వీడియోగ్రఫీ వంటి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అయితే ఈ చర్యలన్నీ రాధాకృష్ణన్ కమిటీ పరిశీలించినవేనని, కాగితాలపై కాకుండా సక్రమంగా అమలు చేయడం ముఖ్యమని కోర్టు స్పష్టం చేసింది.


