'డిజిటల్‌'లో బాల భద్రత | Child Safety in Digital World Says Supreme Court Judge Justice Vikram Nath | Sakshi
Sakshi News home page

'డిజిటల్‌'లో బాల భద్రత

Oct 4 2026 2:37 AM | Updated on Oct 4 2026 2:37 AM

Child Safety in Digital World Says Supreme Court Judge Justice Vikram Nath

శనివారం హైదరాబాద్‌లో ‘నల్సా’ దక్షిణ ప్రాంతీయ సదస్సు ప్రారంభోత్సవంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కేంద్ర మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్, సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ­జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌సింగ్‌

అందుకోసం సమష్టిగా కృషి చేద్దాం 

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ పిలుపు

సోషల్‌ మీడియా, ఏఐ దుర్వినియోగంపై అప్రమత్తంగా ఉండాలి 

ప్రతి చిన్నారి మాట విని సాయం కోరితే అండగా నిలవాలన్న జడ్జి 

మహిళలు, పిల్లల రక్షణకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం: సీఎం రేవంత్‌ 

బాధితుడి జీవితాన్ని నిలబెట్టడమూ న్యాయంలో భాగమేనని వెల్లడి 

చిన్నారులపై సైబర్‌ నేరాలపై ‘నల్సా’ సదస్సు ప్రారంభం 

పాల్గొన్న సుప్రీంకోర్టు, పలు హైకోర్టుల న్యాయమూర్తులు

సాక్షి, హైదరాబాద్‌: డిజిటల్‌ యుగంలో చిన్నారుల భద్రతకు కుటుంబాలు, పాఠశాలలు, ప్రభుత్వ సంస్థలు, న్యాయ సేవా సంస్థలు, టెక్నాలజీ సంస్థలు సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి, నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ పిలుపునిచ్చారు. చిన్నారులపై సైబర్‌ వేధింపులు, ఆన్‌లైన్‌ బెట్టింగ్, లైంగిక వేధింపులు, బ్లాక్‌మెయిల్‌ వంటి ముప్పులు పెరుగుతున్న నేపథ్యంలో వారికి సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ‘పిల్లలు తమపై జరిగిన వేధింపులను వెల్లడించినప్పుడు మొదటి స్పందన అత్యంత కీలకం. ఓపికగా వినాలి.. గౌరవంగా చూడాలి. ఇకపై ఏం జరుగుతుందో వారికి అర్థమయ్యే భాషలో వివరించాలి’అని చెప్పారు. సైబర్‌ ప్రపంచంలో పిల్లలపై జరుగుతున్న లైంగిక దోపిడీని అరికట్టడం, బాలల హక్కులకు రక్షణ కల్పించడం, వారికి స్నేహపూర్వక న్యాయవ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా నల్సా నిర్వహిస్తున్న దక్షిణ ప్రాంతీయ సదస్సు శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. 

తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ (టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ఈ సదస్సు జరగనుంది. ప్రారంభ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ పమిడిఘంటం శ్రీ నరసింహా, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్, జస్టిస్‌ అలోక్‌ అరాధే, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జస్టిస్‌ శామ్‌ కోషి, కేంద్ర న్యాయ మంత్రి అర్జున్‌ మేఘ్‌వాల్, సీఎం ఎ.రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు, తెలంగాణ ఏజీ ఎ.సుదర్శన్‌రెడ్డి, ఏఎస్‌జీ నరసింహ శర్మ, ఏఏజీలు ఇమ్రాన్‌ఖాన్, తేరా రజనీకాంత్‌రెడ్డి, పీపీ పల్లె నాగేశ్వర్‌రావు, రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సభ్య కార్యదర్శి సీహెచ్‌ పంచాక్షరీ, రిజిస్ట్రార్లు తదితరులు పాల్గొన్నారు.  

వారి స్వేచ్ఛకు భద్రత కల్పించాలి: జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌  
చార్మినార్, గోల్కొండ వంటి చారిత్రక కట్టడాలతోపాటు హైటెక్‌ సిటీ వంటి సాంకేతిక కేంద్రానికి హైదరాబాద్‌ ప్రతీకగా నిలుస్తోంది. బాలల భవిష్యత్తును సాంకేతికత ఎలా సురక్షితంగా తీర్చిదిద్దగలదో చర్చించేందుకు నగరం సరైన వేదిక. హైదరాబాద్‌లోనే జన్మించిన ప్రముఖ కవయిత్రి సరోజినీ నాయుడు రచించిన ‘టు మై చిల్డ్రన్‌’కవితలోని భావాల ప్రకారం.. ప్రతి తల్లీదండ్రి కోరుకునేది పిల్లలు నవ్వుతూ, బాధలకు దూరంగా ఎదగడమే. పిల్లలకు నేర్చుకునే, ఆడుకునే ప్రపంచాన్ని భయం లేకుండా అన్వేషించే స్వేచ్ఛ ఉండాలి. ఆ స్వేచ్ఛకు భద్రత కల్పించడం సమాజం బాధ్యత. సోషల్‌ మీడియా, మెసేజింగ్‌ యాప్స్, ఆన్‌లైన్‌ గేమ్స్‌ పిల్లల జీవితంలో భాగమయ్యాయి. వాటి ద్వారా విద్య, స్నేహం వంటి ప్రయోజనాలతోపాటు అనేక ప్రమాదాలు కూడా ఎదురవుతున్నాయి. ఆన్‌లైన్‌ బెట్టింగ్, సైబర్‌ మోసాలు, లైంగిక వేధింపులు చిన్నారులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. నకిలీ ప్రొఫైళ్ల ద్వారా పిల్లలతో పరిచయం పెంచుకుని లైంగికంగా వేధించడం, వ్యక్తిగత ఫొటోలు పంపేలా ఒత్తిడి చేయడం, అనంతరం వాటితో బ్లాక్‌మెయిల్‌ చేయడం వంటి ఘటనలు ఆందోళనకరం. కృత్రిమ మేధ (ఏఐ) విస్తృత వినియోగం కూడా బాలల భద్రతకు కొత్త సవాళ్లు విసురుతోంది. చిన్నారుల సాధారణ ఫొటోలను మార్ఫింగ్‌ చేసి లైంగికంగా అసభ్యకరమైన నకిలీ చిత్రాలుగా రూపొందించడం, వాటిని సోషల్‌ మీడియా, మెసేజింగ్‌ గ్రూపుల్లో ప్రచారం చేయడం లేదా బ్లాక్‌మెయిల్‌కు ఉపయోగిస్తున్నారు. ఇలాంటి ఘటనలతో పిల్లల చదువు, ఆత్మవిశ్వాసం దెబ్బతినడంతోపాటు వారు ఇతరులకు దూరమయ్యే ప్రమాదం ఉంది. పిల్లలు బెదిరింపు సందేశాలు వచ్చినప్పుడు భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు చెప్పేలా ప్రోత్సహించాలి. లైంగిక బ్లాక్‌మెయిల్‌కు గురైన చిన్నారి.. ధైర్యంగా తమ సమస్యను చెప్పుకునే వ్యవస్థ అవసరం.  

జీవితాన్ని నిలబెట్టడమే న్యాయం: సీఎం రేవంత్‌రెడ్డి..  
మహాత్మాగాంధీ ఒక న్యాయవాది. ఆయన న్యాయాన్ని కేవలం వృత్తిగా చూడలేదు. పేదలు, బలహీనుల కోసం న్యాయాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించారు. అదే స్ఫూర్తితో న్యాయ సేవా సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. ప్రతి ఒక్కరికీ న్యాయం అందాలి. డబ్బు లేక ఎవరికీ న్యాయం దూరం కాకూడదు. ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువసేపు ఆన్‌లైన్‌లో గడుపుతున్నారు. వారు ఇంటర్నెట్‌లో ఏం చేస్తున్నారనేది తల్లిదండ్రులకు తెలియడం లేదు. ఇంటర్నెట్, ఏఐ, మన జీవితాలను ఎంతో సులభం చేశాయి. కానీ.. ఏది నిజం? ఏది అబద్ధం? ఏది మంచి? ఏది చెడు? అన్నది పిల్లలు వెంటనే గుర్తించలేరు. తెలియక చేసే చిన్న పొరపాటు పెద్ద సమస్యకు దారితీయొచ్చు. దాని ప్రభావం పిల్లలపైనే కాదు... వారి కుటుంబాలపై, సమాజంపైనా పడుతోంది. తెలంగాణలో మహిళలు, పిల్లల రక్షణకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యతనిస్తోంది. పోలీసులు, భరోసా కేంద్రాలు, చైల్డ్‌ ప్రొటెక్షన్‌ యూనిట్లు, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీలు, ప్రత్యేక కోర్టులు, న్యాయ సేవా సంస్థలు.. సమన్వయంతో పనిచేయాలి. న్యాయం.. అంటే నేరస్తుడికి శిక్ష పడటమే కాదు. బాధితుడి జీవితాన్ని తిరిగి నిలబెట్టడం. సైబర్‌ నేరాల కోసం–1930, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ కోసం–1098 నంబర్లు అంతా తప్పక గుర్తుంచుకోవాలి. 

భవిష్యత్‌ భద్రతతో ముడిపడిన అంశం 
–కేంద్ర న్యాయ మంత్రి అర్జున్‌ మేఘ్‌వాల్‌ 
నేడు మనం బాలలకు ఎలాంటి సురక్షిత వాతావరణం, విద్య, విశ్వాసం, న్యాయం కల్పిస్తామో.. అది రేపు దేశ భవితవ్యాన్ని నిర్దేశిస్తుంది. సాంకేతిక యుగంలో చదువుతోపాటే డిజిటల్‌ వ్యవస్థ కూడా చిన్నారులకు చేరువవుతోంది. సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ గేమింగ్‌తోపాటు ఇతర ప్లాట్‌ఫామ్‌లు చాలామంది చిన్నారుల భవిష్యత్‌ను దెబ్బతీస్తున్నాయి. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు న్యాయ వ్యవస్థ, లీగల్‌ ఎయిడ్‌ మరింత చేరువ కావాలి. న్యాయ వ్యవస్థను సంప్రదించడం సులభతరంగా చేయాలి.  

పిల్లలే అత్యంత విలువైన ‘ఆస్తి’: జస్టిస్‌ పీఎస్‌ నరసింహా 
ఆధునిక జీవన విధానం, పని ఒత్తిళ్లు, సైబర్‌ ప్రపంచం కారణంగా తల్లిదండ్రులు పిల్లలకు తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు. మానవ సమాజానికి అత్యంత విలువైన ఆస్తి పిల్లలే. అయితే, ఈ విషయాన్ని మన నాగరికత, సంస్కృతి తగినంత ప్రాధాన్యంతో గుర్తించలేదు. దేశ భవిష్యత్తును భద్రపరచాలంటే ముందుగా పిల్లల భవిష్యత్తును భద్రపరచాలి. తల్లిదండ్రులు పిల్లలతో గడపాల్సిన సమయాన్ని కూడా సైబర్‌ ప్రపంచమే ఆక్రమిస్తోంది. తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించేలా రాష్ట్రం ముందడుగు వేసి చట్టాన్ని తీసుకురావాలి. దేశంలో రోజురోజుకు పడిపోతున్న సంతానోత్పత్తి నేపథ్యంలో చిన్నారుల సంక్షేమానికి ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి.  

బాలలకు ఉచిత న్యాయసేవలు: జస్టిస్‌ అలోక్‌ అరాధే 
డిజిటల్‌ వాతావరణంలో పిల్లలను రక్షించడం కేవలం విధానపరమైన అంశం కాదు. అది రాజ్యాంగపరమైన బాధ్యత. సంప్రదాయ నేరాలకు భిన్నంగా ఆన్‌లైన్‌ లైంగిక నేరాల్లో అజ్ఞాత ఖాతాలు, ఎన్‌క్రిపె్టడ్‌ సందేశాలు, వివిధ డిజిటల్‌ వేదికలు, వేర్వేరు దేశాలు లేదా న్యాయ పరిధులు దాటి పనిచేసే నిందితులు ఉండే అవకాశం ఉంది. డిజిటల్‌ ఆధారాలను తొలగించడం లేదా మార్చడం సాధ్యమవుతున్నందున వాటిని సరైన విధానంలో భద్రపరచడం, పరిశీలించడం, విశ్లేషించడం అత్యంత కీలకం. బాలలకు ఉచిత న్యాయ సేవలు అందించడం చట్టబద్ధ హక్కు.  

చిన్నారులు హక్కుదారులు: జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌ 
సాంకేతికత పిల్లల అభ్యాసం, సృజనాత్మకత, భావ వ్యక్తీకరణకు ఉపయోగపడే సాధనంగా ఉండాలి తప్ప వారి దోపిడీకి సాధనంగా మారకూడదు. పిల్లల భద్రత, సాంకేతికతలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సిన అవసరం లేదు. సాంకేతికత బాల్యానికి ఉపయోగపడేలా చూడటమే ముందున్న ప్రధాన సవాల్‌. పిల్లలను రక్షణ అవసరమైన వ్యక్తులుగానే కాకుండా ‘హక్కుదారులు’గా చూడాలి.  

గోప్యతను కాపాడాలి: చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌ 
సాంకేతికతతో బాలలపై నేరాలు జరిగే విధానం మారుతున్నా, వారిని రక్షించాల్సిన రాజ్యాంగ బాధ్యత మాత్రం మారదు. డిజిటల్‌ ప్రపంచంలో బాలల రక్షణ, న్యాయానికి అందుబాటు కోసం న్యాయవ్యవస్థ, ప్రభుత్వం, పోలీసు, న్యాయ సేవా సంస్థలు, బాలల రక్షణ సంస్థలు సమన్వయంతో పనిచేయాలి. తరగతి గదికి పిల్లలను అనుసంధానించే సాంకేతికతే.. గుర్తు తెలియని వ్యక్తులతోనూ వారిని అనుసంధానించే అవకాశం కల్పిస్తోంది. సృజనాత్మకతకు ఉపయోగపడే వేదికలను దుర్వినియోగపర్చి పిల్లలను మోసం, ప్రలోభపెట్టడం, వేధించడం వంటి చర్యలకు పాల్పడే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసులు, కౌన్సెలర్లు పిల్లల మాటలను నిందించకుండా, సానుభూతితో వినాలి. లైంగిక నేరాల బాధిత బాలల గౌరవం, గోప్యత, వ్యక్తిగత గుర్తింపును కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

న్యాయ రథం ప్రారంభం 
బాలల రక్షణకు ‘ఫ్రీడమ్‌ ఫ్రమ్‌ బాండెడ్‌ లేబర్‌’పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. బానిస కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి, న్యాయ సాయం, బాధితుల రక్షణ, పునరావాసం, తిరిగి సమాజంలో కలిసేలా చేయడమే దీని లక్ష్యం. బాలల భద్రత, గౌరవం, రక్షణకు అన్ని వర్గాలూ సమష్టిగా కట్టుబడి పనిచేయాలన్న సంకల్పానికి ప్రతీకగా ఏర్పాటు చేసిన ‘కమిట్‌మెంట్‌ వాల్‌’ను కూడా ఆయన ఆవిష్కరించారు. ‘న్యాయ రథం’పేరుతో మొబైల్‌ లోక్‌ అదాలత్‌ వాహనాన్ని జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ జెండా ఊపి ప్రారంభించారు. న్యాయ సేవలను ప్రజల చెంతకే తీసుకెళ్లడం, న్యాయ వ్యవస్థను ఆశ్రయించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అందుబాటులో, తక్కువ ఖర్చుతో, వేగవంతమైన న్యాయం అందించడం ఈ మొబైల్‌ లోక్‌ అదాలత్‌ ప్రధాన ఉద్దేశం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement