Justice Vikram Nath
-
సెలవుల్లో సీనియర్లకు నో ఎంట్రీ యువ న్యాయవాదులకే ఛాన్స్!
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు వేసవి సెలవుల ధర్మాసనం (వెకేషన్ బెంచ్) ముందు వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాదులను అనుమతించేది లేదని న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్‌నాథ్ స్పష్టం చేశారు. సెలవుల్లో కేవలం యువ న్యాయవాదులు, అడ్వకేట్ ఆన్ రికార్డ్ (ఏవోఆర్)లకు మాత్రమే తన కోర్టులో అవకాశం కల్పిస్తానని తేల్చి చెప్పారు. తమ కేసులను ప్రస్తావించేందుకు ప్రయతి్నంచిన పలువురు సీనియర్లను న్యాయమూర్తి వారించారు. తనకు అధికారికంగా సీనియర్ హోదా లేనందున వాదించేందుకు అనుమతివ్వాలని న్యాయవాది మాథ్యూస్ నెడుంపర కోరగా నిరాకరించారు. ఈ నిర్ణయం తమకు ముందుగా తెలియదని, కనీసం రేపటి నుంచైనా అమలు చేయాలని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే కోరారు. గత వారం నోటీసులు జారీ చేసిన కేసుల్లో తాము ఇదివరకే హాజరైనందున, ఈ రోజైనా వాదించేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఇతర ధర్మాసనాలు సీనియర్లను అనుమతిస్తున్నాయని గుర్తుచేశారు. మరో సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే సైతం అవకాశం ఇవ్వాలని కోరారు. సీనియర్ల విజ్ఞప్తులను జస్టిస్ విక్రమ్‌నాథ్ తోసిపుచ్చారు. యువ న్యాయవాదులు, ఏవోఆర్లను ప్రోత్సహించి వారికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జూన్ ఒకటి నుంచి జూలై 12వ తేదీ వరకు సెలవుల కాలంలో పని దినాల్లో తన కోర్టులో సీనియర్లకు అనుమతి లేదన్నారు. ఈ నిబంధన ఎవరికీ తెలియదన్న వాదనపై ఆయన స్పందిస్తూ.. గత నాలుగేళ్లుగా ప్రతి వెకేషన్‌లోనూ తన బెంచ్ ఇదే విధానాన్ని పాటిస్తోందని, ఈ విషయం అందరికీ తెలుసునని జస్టిస్ విక్రమ్‌నాథ్ వ్యాఖ్యానించారు. నెడుంపర అభ్యర్థనపై స్పందిస్తూ.. తన దృష్టిలో ఆయన సీనియర్ న్యాయవాదేనని పేర్కొన్నారు. గత వారం హాజరైన కేసుల్లో వాదించేందుకు అనుమతించాలన్న అభ్యర్థనలను సైతం ధర్మాసనం అంగీకరించలేదు. తన వైఖరిని మార్చుకునేది లేదని జస్టిస్ విక్రమ్‌నాథ్ తేల్చిచెప్పారు. కోర్టు హాలు నుంచి సీనియర్ న్యాయవాదులను పంపించి వేయాలని కోర్టు మాస్టర్‌ను ఆదేశించారు. సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డేను సైతం అనుమతించని న్యాయమూర్తి.. ఆయన స్థానంలో సహాయక న్యాయవాది వాదనలు వినిపించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. -
‘వీధికుక్కల కేసుతో నేనిప్పుడు వరల్డ్ ఫేమస్’
తిరువనంతపురం: దేశ వ్యాప్తంగా చర్చాంశనీయమైన సుప్రీంకోర్టులో వీధి కుక్కల కేసు తనని వరల్డ్ ఫేమస్ చేసిందంటూ జస్టిస్ విక్రమ్ నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా పౌర సమాజం తనకు శుభాకాంక్షలు చెప్పడం మరిచిపోలేని అనుభూతిని ఇచ్చిందని అన్నారు.కేరళ రాజధాని తిరువనంతపురంలో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ (ఎన్ఎస్ఎల్ఏ) నిర్వహించిన సమావేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.చిన్న చిన్న పనులు కారణంగా నేను న్యాయవాద వర్గాల్లో ప్రసిద్ధి చెందాను. కానీ వీధికక్కల కేసు కారణంగా ఈ దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మొత్తం పౌర సమాజంలో నాకు గుర్తింపు ఇచ్చినందుకు వీధి కుక్కలకు కూడా నేను కృతజ్ఞుడను. ఈ కేసును నాకు అప్పగించినందుకు మా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గువాయ్కి నా కృతజ్ఞతలు. సుప్రీం తీర్పును సవరించడంతో జంతు ప్రేమికులతో పాటు శునకాల నుంచి కూడా తనకు శుభాకాంక్షలు, ఆశీస్సులు అందుతున్నట్లు సందేశాలు వచ్చాయన్నారు.వీధి కుక్కల దాడులు, రేబిస్ బారినపడి పలువురు మరణించిన ఘటనలపై మీడియాలో వచ్చిన కథనాలను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ క్రమంలో.. ఢిల్లీ ఎన్సీఆర్ లో వీధి కుక్కలన్నింటినీ డాగ్ షెల్టర్స్ కి తరలించాలని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఆగస్టు 11న తీర్పు ఇచ్చింది. ఇందుకు ఆరు నుంచి ఎనిమిది వారాల గడువును ఢిల్లీ ప్రభుత్వానికి విధించిన సుప్రీం కోర్టు.. అవి మళ్లీ జనావాసాల్లోకి వస్తే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని ఆదేశించింది.అదే సమయంలో శునకాల తరలింపును గనుక అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవంటూ జంతు ప్రేమికులను హెచ్చరించిది కూడా. ఈ నేపథ్యంలో ఈ తీర్పు సమంజసం కాదంటూ జంతు ప్రేమికులు ఆందోళనకు దిగారు. కొందరు(వీళ్లలో రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు) సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. మరికొందరు నేరుగా కోర్టును ఆశ్రయించారు. దీనితో ఆదేశాలను పునఃపరిశీలిస్తానని హామీ ఇచ్చిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్.. ఈ పిటిషన్‌ను ముగ్గురు జడ్జిలతో కూడిన విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు.జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి.అంజరియాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం దీన్ని విచారించింది.రేబిస్ లక్షణాలు లేదా విపరీత ప్రవర్తన కలిగిన కుక్కలు మినహా ఇప్పటివరకు షెల్టర్లకు తరలించిన వాటిని విడుదల చేయాలని ఆదేశించింది. వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేసిన తర్వాత వాటిని ఎక్కడ నుంచి తీసుకొచ్చారో అక్కడే విడిచిపెట్టాలని పేర్కొంది. ఇందుకు సంబంధించి ఆగస్టు 11న ఇచ్చిన తీర్పును సవరించింది.


