
తిరువనంతపురం: దేశ వ్యాప్తంగా చర్చాంశనీయమైన సుప్రీంకోర్టులో వీధి కుక్కల కేసు తనని వరల్డ్ ఫేమస్ చేసిందంటూ జస్టిస్ విక్రమ్ నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా పౌర సమాజం తనకు శుభాకాంక్షలు చెప్పడం మరిచిపోలేని అనుభూతిని ఇచ్చిందని అన్నారు.
కేరళ రాజధాని తిరువనంతపురంలో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ (ఎన్‌ఎస్‌ఎల్‌ఏ) నిర్వహించిన సమావేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
చిన్న చిన్న పనులు కారణంగా నేను న్యాయవాద వర్గాల్లో ప్రసిద్ధి చెందాను. కానీ వీధికక్కల కేసు కారణంగా ఈ దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మొత్తం పౌర సమాజంలో నాకు గుర్తింపు ఇచ్చినందుకు వీధి కుక్కలకు కూడా నేను కృతజ్ఞుడను. ఈ కేసును నాకు అప్పగించినందుకు మా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గువాయ్‌కి నా కృతజ్ఞతలు. సుప్రీం తీర్పును సవరించడంతో జంతు ప్రేమికులతో పాటు శునకాల నుంచి కూడా తనకు శుభాకాంక్షలు, ఆశీస్సులు అందుతున్నట్లు సందేశాలు వచ్చాయన్నారు.
వీధి కుక్కల దాడులు, రేబిస్ బారినపడి పలువురు మరణించిన ఘటనలపై మీడియాలో వచ్చిన కథనాలను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ క్రమంలో.. ఢిల్లీ ఎన్సీఆర్ లో వీధి కుక్కలన్నింటినీ డాగ్ షెల్టర్స్ కి తరలించాలని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఆగస్టు 11న తీర్పు ఇచ్చింది. ఇందుకు ఆరు నుంచి ఎనిమిది వారాల గడువును ఢిల్లీ ప్రభుత్వానికి విధించిన సుప్రీం కోర్టు.. అవి మళ్లీ జనావాసాల్లోకి వస్తే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని ఆదేశించింది.
అదే సమయంలో శునకాల తరలింపును గనుక అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవంటూ జంతు ప్రేమికులను హెచ్చరించిది కూడా. ఈ నేపథ్యంలో ఈ తీర్పు సమంజసం కాదంటూ జంతు ప్రేమికులు ఆందోళనకు దిగారు. కొందరు(వీళ్లలో రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు) సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. మరికొందరు నేరుగా కోర్టును ఆశ్రయించారు. దీనితో ఆదేశాలను పునఃపరిశీలిస్తానని హామీ ఇచ్చిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్.. ఈ పిటిషన్‌ను ముగ్గురు జడ్జిలతో కూడిన విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు.
జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి.అంజరియాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం దీన్ని విచారించింది.రేబిస్ లక్షణాలు లేదా విపరీత ప్రవర్తన కలిగిన కుక్కలు మినహా ఇప్పటివరకు షెల్టర్లకు తరలించిన వాటిని విడుదల చేయాలని ఆదేశించింది. వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేసిన తర్వాత వాటిని ఎక్కడ నుంచి తీసుకొచ్చారో అక్కడే విడిచిపెట్టాలని పేర్కొంది. ఇందుకు సంబంధించి ఆగస్టు 11న ఇచ్చిన తీర్పును సవరించింది.