‘కలిసుంటే బలం.. విడిపోతే బలహీనం’ అన్న రాజకీయ సామెతకు భిన్నంగా.. ఉత్తరప్రదేశ్‌లో ఇండియా కూటమి మిత్రపక్షాల మధ్య అప్పుడే మాటల వేడి మొదలైంది. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ శివ్‌పాల్ సింగ్ పటేల్ కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్పీతో పొత్తు లేకపోయి ఉంటే 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలిచేది కాదని అన్నారు. అంతేకాదు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయడానికి కూడా ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ భరోసా ఇవ్వాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
శివ్‌పాల్ సింగ్ పటేల్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు వల్లే కాంగ్రెస్‌కు ఆరు సీట్లు దక్కాయని అన్నారు. ఎస్పీతో పొత్తు లేకపోతే కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా గెలిచేది కాదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు కేటాయించిన స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ప్రతి ఓటు ఆ పార్టీ అభ్యర్థులకే పడిందని, అందుకే ఆరు స్థానాలు గెలుచుకోగలిగారని చెప్పారు.
రాహుల్ భయపడ్డారు..
రాహుల్ గాంధీ అమేథీ నుంచి కాకుండా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయడంపైనా పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక దశలో రాహుల్ పోటీ నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, అఖిలేశ్ యాదవ్ భరోసా ఇచ్చి పోటీ చేయాలని ఒప్పించారని అన్నారు. తాను పోటీ చేయకపోతే ఎస్పీ తరఫున సొంత అభ్యర్థిని బరిలోకి దింపుతానని అఖిలేశ్ హెచ్చరించడంతోనే రాహుల్ రాయ్‌బరేలీ నుంచి పోటీకి అంగీకరించారని పటేల్ పేర్కొన్నారు. ఇక, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ 37 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ ఆరు స్థానాల్లో గెలిచింది. బీజేపీ 33 సీట్లకు పరిమితమైంది. ఎన్డీయే మొత్తం 36 స్థానాలు దక్కించుకుంది. అయోధ్య ఉన్న ఫైజాబాద్ లోక్‌సభ స్థానాన్ని కూడా ఎస్పీ గెలుచుకోవడం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
ఎస్పీ సాధించిన 37 సీట్లను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ఎక్కువ సీట్లు ఆశించకూడదని పటేల్ అన్నారు. మేమే పెద్దన్న.. చాలా పెద్దన్న అని వ్యాఖ్యానిస్తూ ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీదే పైచేయి అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సహకరిస్తే పొత్తు ద్వారా ఇరు పార్టీలకు ప్రయోజనం ఉంటుందని, పొత్తు లేకపోయినా ఎస్పీకి పెద్దగా నష్టం ఉండదని అన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం సున్నా సీట్లకు పడిపోతుందని పటేల్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే ప్రజలు ఆ పార్టీ అభ్యర్థులను కేవలం ఓట్లు చీల్చేందుకే బరిలోకి దిగుతున్నారని భావించే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు వేరే స్థాయి ఉండొచ్చని, కానీ ఒంటరిగా పోటీ చేసిన చోట ఆ పార్టీ తన బలాన్ని కోల్పోయిందని విమర్శించారు. అలాగే.. కాంగ్రెస్, బీజేపీ పాలనలో దళితుల అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదని, ఎస్పీ పాలనలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
కాంగ్రెస్ సీరియస్..
ప్రస్తుతం 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఎస్పీకి 101 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. కాంగ్రెస్‌కు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సీట్ల పంపకంలో తమ పార్టీదే పైచేయి అన్న సంకేతాలను పటేల్ ఇచ్చారు. అయితే, పటేల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. యూపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అన్షు అవస్థి.. ఇలాంటి వ్యాఖ్యలు చేసే నేతలను ఎస్పీ నాయకత్వం అదుపులో పెట్టాలని అన్నారు. ఇండియా కూటమి కారణంగానే పటేల్ ఎంపీగా గెలిచారని గుర్తుచేస్తూ.. ఆయన తన పరిమితులు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. కాగా, 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఈ విభేదాలు మరింత ముదురుతాయా? లేక ఇరు పార్టీలు సర్దుకుపోయి పొత్తును కొనసాగిస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: బీజేపీకి ఊహించని షాక్..


