ఢిల్లీ: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషస్ వద్ద ధర్నాను విరమించారు. జంతర్ మంతర్ వద్ద గత నెల జరిగిన విద్యార్థుల నిరసన సమయంలో లోచవ్ (19) అనే విద్యార్థికి పెల్లెట్ గన్‌ల వల్ల గాయాలయ్యాయి. లోచవ్ ఇచ్చిన ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దీంతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు.
పెల్లెట్ గన్ గాయాల ఘటనకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని సెక్షన్లు 118, 125 కింద ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బీఎన్‌ఎస్‌లోని సెక్షన్ 118 ప్రమాదకర ఆయుధాలు లేదా మార్గాలను ఉపయోగించి ఉద్దేశపూర్వకంగా గాయపరచడం లేదా తీవ్రమైన గాయాలు కలిగించడం గురించి చెబుతుంది. సెక్షన్ 125 ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగించే చర్యలకు సంబంధించినది.
అంతకుముందు ఏం జరిగింది?
ఈ ఘటనకు సంబంధించిన శుక్రవారం తెల్లవారుజామున నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు ఢిల్లీ పోలీసులు నిరాకరించారని లోచవ్ ఆరోపించడంతో, రాహుల్ గాంధీ కొంతమంది కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ముందుగా వారు కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అయితే న్యూఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సచిన్ శర్మ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నారని సమాచారం అందడంతో వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు.
తెల్ల టీషర్ట్, లేత గోధుమరంగు ప్యాంట్ ధరించిన రాహుల్ గాంధీ పోలీస్ స్టేషన్‌లోకి నడుచుకుంటూ వెళ్లడంతో అక్కడి అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. తొలుత ఫిర్యాదు నమోదు చేయాలని ఆయన అధికారులను ఒత్తిడి చేశారు. అయితే అధికారులు నిరాకరించడంతో పోలీస్ స్టేషన్ బయట బైఠాయించి నిరసన ప్రారంభించారు. లోచవ్ ఫిర్యాదును నమోదు చేసేందుకు అధికారులు అంగీకరించే వరకు తన నిరసనను విరమించబోనని ఆయన తెలిపారు.
“లోచవ్ కంటిలో 3 గుళ్లు దిగాయి. అతని శరీరంలో 200 గుళ్లు ఉన్నాయి. అతని గుండె సమీపంలో తాకలేని గుళ్ల ముక్కలు ఉన్నాయి. తాము గాలి తుపాకులతో కాల్పులు జరపలేదని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. పోలీసులు కాకపోతే గాలి తుపాకులతో కాల్పులు జరిపింది ఎవరు? బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవద్దని తమకు పైస్థాయి నుంచి ఆదేశాలు వచ్చాయని పోలీసులు చెప్పారు” అని రాహుల్ మీడియాతో అన్నారు. విద్యార్థి శరీరం నుంచి వెలికితీసిన లోహపు గుళ్లను కూడా ఆయన మీడియాకు చూపించారు.
ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌లో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ వాద్రా, కుమారి సెల్జా, జైరాం రమేశ్, రణదీప్ సుర్జేవాలా రాహుల్ గాంధీతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. వారు పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లారు. చివరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో కాంగ్రెస్ నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.


