ముంబై: మీరు నాన్‌వెజ్ ప్రియులా?.ఫిష్ కర్రీని లొట్టేలసుకొని మరీ లాగించేస్తారా? అయితే. మీరు చేప గురించి తెలుసుకోవాల్సిందే. సాధారణంగా కొర్రమీను, శీలవతి,బొచ్చె, జెల్లలు పేర్లు వినే ఉంటారు.అచ్చం అలాగే థాయ్ మాంగూర్ అనే పేరుతో ఓ చేపకూడా ఉంది. ఈ చేపతో చేసిన వంటల్ని రుచి చూస్తే ప్రాణాల మీదకు కొని తెచ్చుకున్నట్లే. అలాంటి 36వేల కేజీల థాయ్ మాంగూర్ చేపల్ని గొయ్యి తీసి పాతిపెట్టారు.
పైన మనం చెప్పుకున్న చేపల్లో పోషకాలు అధికం,బడ్జెట్ ఫ్లెండీ, జ్యూసీ, పులుసు పెట్టుకునేందుకు విరివిరిగా వినియోగిస్తుంటాం.కానీ ఈ థాయ్ మాంగూర్ పేరు వింటే నాన్ వెజ్ ప్రియుల్లో గొంతులో పచ్చి వెలక్కాయ పడినంత చందంగా ఉక్కిరిబిక్కిరవుతుంటారు. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో లాభాలు అర్జించేందుకు కొంతమంది వ్యాపారస్థులు అడ్డదార్లలో ఈ చేపల్ని పెంచుతుంటుంటారు. మన దేశంలో ఎప్పటి నుంచే నిషేధంలో ఉన్న ఈ చేపలు మహరాష్ట్రలో కలకలం రేపాయి.
నాగ్‌పూర్ జిల్లాలోని పార్శివని పరిధిలో ఉన్న చిచోలి-మహదులా గ్రామం పరిసర ప్రాంతాల్లో పదుల సంఖ్యలో చెరువులు ఉన్నాయి. అయితే, ఈ చెరువుల్లో ప్రాణాంతకమైన థాయ్ మాంగూర్ చేపల్ని పెంచుతున్నట్లు మత్స్యశాఖ అధికారులకు సమాచారం అందింది. మత్స్యశాఖ అధికారులకు సమాచారం అందడంతో గూగుల్ మ్యాపింగ్ ద్వారా ఆ చెరువులను గుర్తించారు. కస్టమర్లలా నటిస్తూ వెళ్లి గుట్టు రట్టు చేశారు.
ఆ వెంటనే 25 మంది స్థానిక జాలర్లతో కలిసి చెరువులపై మెరుపు దాడి చేశారు. వలలు వేసి బయటకు తీస్తుంటే అధికారులకే ఒళ్లు గగుర్పొడిచింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 36 టన్నుల (36,000 కేజీలు) థాయ్ మాంగూర్ చేపలు కుప్పలుగా పడ్డాయి. కాలకూట విషాన్ని దాచుకున్న ఆ 36 టన్నుల చేపలను భారీ గోతులు తీసి, మట్టిపెట్టి అక్కడికక్కడే సమాధి చేసేశారు.

ఎందుకంటే..
ఈ చేపలను తినడం అంటే నోటి ద్వారా నేరుగా మరణాన్ని ఆహ్వానించడమే.ఈ చేపలు పెరగడానికి స్వచ్ఛమైన నీరు అవసరం లేదు. కుళ్ళిన మాంసం, చికెన్ వేస్ట్, హాస్పిటల్ వ్యర్థాలు, మురుగు నీరు వీటికి ప్రధాన ఆహారం. ఎంత దారుణమైన వ్యర్థాలను తింటే ఇవి అంత వేగంగా, లావుగా పెరుగుతాయి. లాభాల కోసం కొందరు స్వార్థపరులు ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి వీటిని పెంచుతున్నారు.
వైద్యులు, శాస్త్రవేత్తల ప్రకారం థాయ్ మాంగూర్‌ను ఒక్కసారి తిన్నా అది శరీరంలో విషంలా పనిచేస్తుంది. ఈ చేపల శరీరంలో లెడ్ (సీసం), ఆర్సెనిక్, మెర్క్యురీ వంటి అత్యంత ప్రమాదకరమైన భారీ లోహాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలో కణాలు దెబ్బతిని క్యాన్సర్ బారిన పడటం ఖాయం.
వీటిలోని విషపూరిత రసాయనాలు నేరుగా లివర్, కిడ్నీలపై దాడి చేస్తాయి. క్రమంగా అవి పనిచేయడం ఆగిపోయి మనిషి ప్రాణాలు కోల్పోతాడు. అసహ్యకరమైన వ్యర్థాలను తిని పెరగడం వల్ల వీటి మాంసంలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది గుండె జబ్బులకు, చర్మ వ్యాధులకు మరియు రోగనిరోధక శక్తి పూర్తిగా పడిపోవడానికి కారణమవుతుంది.
మార్కెట్‌లో సాధారణ చేపల ధర కంటే ఈ థాయ్ మాంగూర్ చేపల ధర చాలా తక్కువగా ఉంటుంది. హోటళ్లలో, బిర్యానీలలో, రోడ్డు పక్కన దొరికే ఫిష్ ఫ్రై సెంటర్లలో తక్కువ ధరకు వస్తుందని కొందరు దీనిని వాడుతుంటారు. నాగ్‌పూర్‌లో దొరికిన 36 టన్నుల చేపలు గనుక మార్కెట్లోకి వచ్చి ఉంటే.. వేలాది మంది ఇళ్లల్లో కూరలుగా మారి, ఎంతోమంది ప్రాణాలను బలితీసుకునేవి. అదృష్టవశాత్తూ అధికారులు సకాలంలో స్పందించి ఆ ముప్పును తప్పించారు.
హెచ్చరిక: చేపలు ఆరోగ్యానికి మంచిదే. కానీ కొనే ముందు అది దేశవాళీ చేపేనా అని నిర్ధారించుకోండి. నల్లగా, నోటి చుట్టూ పెద్ద మీసాలతో, అతి తక్కువ ధరకు దొరికే ‘థాయ్ మాంగూర్’ కనిపిస్తే.. ప్రాణాల మీద ఆశ ఉంటే అక్కడి నుండి వెనక్కి వచ్చేయండి!


