‘కుళ్లిన టమాటా కారణంగా కూడా కొట్టేవాడు’ | He Thrashed Her Over Rotten Tomato: Sister Of Lucknow Woman | Sakshi
Sakshi News home page

‘కుళ్లిన టమాటా కారణంగా కూడా కొట్టేవాడు’

Aug 21 2026 4:12 PM | Updated on Aug 21 2026 4:31 PM

He Thrashed Her Over Rotten Tomato: Sister Of Lucknow Woman

ఢిల్లీ: లక్నోలోని ఐసీఐసీఐ బ్యాంక్ వెలుపల తన భర్త చేతిలో దివ్య మిశ్రా హత్యకు గురైన సంగతి తెలిసిందే. సంచలన రేపిన ఈ ఘటనలో దివ్య మిశ్రా సోదరి ప్రజ్ఞా మిశ్రా.. నిందితుడు మానస్ వాజ్‌పేయ్ గురించి దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించారు. హిందీ యూట్యూబర్ అయిన ప్రజ్ఞా మిశ్రా మాట్లాడుతూ, మానస్ తన సోదరి దివ్య పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించేవాడని.. అందుకే ఆమె అతని నుండి విడాకులు కోరుకుందని తెలిపారు.

ఒకసారి బ్లింకిట్ (Blinkit) ద్వారా తెప్పించిన టమోటా కుళ్లిపోయిందనే కోపంతో మానస్ తన సోదరిని దారుణంగా కొట్టాడని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రజ్ఞా మిశ్రా తెలిపారు. మానస్‌ను "సైకో"గా అభివర్ణించిన ప్రజ్ఞా మిశ్రా.. ఆ వ్యక్తి, అతని సోదరి కలిసి తల్లిని దారుణంగా కొట్టేవారని.. చివరకు అనారోగ్యంతో అతని సొంత తల్లి కూడా మరణించింది. దివ్య అతని నుంచి బయటపడాలని మాత్రమే కోరుకుంది. ఫ్యామిలీ కోర్టులోని కౌన్సిలర్‌తో కూడా మనస్ గొడవపడ్డాడని ఆమె ఒకసారి తనకు చెప్పిందని ప్రజ్ఞా తెలిపారు. తమ పెళ్లి జరిగిన రాత్రే ఇంటి ఖర్చులను ఏయే విధంగా దివ్య భరించాలో మానస్ ఒక జాబితా తయారు చేశాడని, దానికి దివ్య అంగీకరించిందని ప్రజ్ఞా తెలిపారు.

దివ్య, మానస్‌లకు 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే గత ఏడాది కాలంగా వారు విడివిడిగా ఉంటున్నారు. గత ఏడాది దివ్య విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. దివ్య తనను మోసం చేస్తోందంటూ మానస్ ఆరోపించేవాడు. గత ఏడాది నుంచి దివ్య తన వాటా ఖర్చులను చెల్లించడం ఆపేసింది. ఆ సైకో హంతకుడి దృష్టిలో అది కూడా మోసం చేసినట్టేనా? ఇంతటి బాధను అనుభవించినప్పటికీ, దివ్య ‘తీజ్’ పండుగ సందర్భంగా ఉపవాసం ఉండాలనుకుంది. ఆమె చేతిపై మానస్‌ పేరును టాటూగా కూడా వేయించుకుంది. మనసులో అతను మారాలని బలమైన కోరిక ఉండేది” అని ప్రజ్ఞా తెలిపారు.

గురువారం.. మానస్ తన భార్య పనిచేసే ప్రదేశానికి వెళ్లి, ఆమెను ఐసీఐసీఐ బ్యాంక్ బయటకు పిలిచాడు. ఆమెతో కొన్ని నిమిషాలు మాట్లాడిన అనంతరం కాల్చి చంపాడు. దివ్యను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆ తర్వాత నిందితుడు ఇంటికి తిరిగి వెళ్లి తన సోదరి శివా వాజ్‌పేయి (28)ని కూడా చంపాడు. ఆమె మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. కొన్ని నిమిషాల తర్వాత మానస్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మానస్ తన భార్య, సోదరిని తానే చంపినట్లు వాట్సాప్ స్టేటస్‌ పెట్టిన సంగతి తెలిసిందే.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement