ఈసీ కూడా ఎలాంటి అనుమతులు కోరలేదు
ఫారం–6 అనుబంధ డిక్లరేషన్‌పై సుప్రీంకోర్టు స్పష్టి కరణ
కొత్త మార్పులు చేసిన అధికారి ఎవరు?
సంబంధిత వివరాలు సమర్పించండి
కేంద్ర ఎన్నికల సంఘాన్నిఆదేశించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు నుంచి అనుమతి సంపాదించాకే కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించిన ఫారం–6లో చిన్న మార్పులు చేశామని కేంద్ర ఎన్నికల సంఘం గతవారం ప్రకటించిన వేళ సర్వోన్నత న్యాయస్థానం కీలక స్పష్టతనిచ్చింది. కొత్త ఓ టరుగా నమోదు చేసుకునేందుకు పౌరుడు నింపాల్సిన ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం–6కు సంబంధించిన అనుబంధ డిక్లరేషన్‌కు తాము గతంలో ఎలాంటి అనుమతులు మంజూరు చేయలేదు అని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టంచేసింది.
తోటి ఎలక్షన్ కమిషనర్ల నుంచి ఎలాంటి ఉమ్మడి ఏకాభిప్రాయం సాధించకుండానే ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలు అమలుచేస్తున్నారంటూ దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలు ఉద్యమాలు ఉధృతం చేసిన వేళ ఆ పార్టీలకు సరికొత్త విమర్శనాస్త్రంగా మారేలా ధర్మాసనం వ్యాఖ్యానాలు చేయడం విశేషం. ఎన్నికల సంఘంలోని కమిషనర్లందరికీ రాజ్యాంగం ద్వారా సమానంగా దఖలుపడిన నిర్ణయాధికారాన్ని ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ ఏకపక్షంగా లాగేసుకుని మోదీ ప్రభుత్వ అనుకూల నిర్ణయాలను వెలువరిస్తున్నా రని పలు హైకోర్టుల మాజీ న్యాయమూర్తులు సైతం అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్న వేళ సుప్రీంకో ర్టులో ఈ అంశం విచారణకు రావడం గమనార్హం.
కమిషనర్లు సుఖ్బీర్‌సింగ్ సంధూ, వివేక్ జోషీల నిర్ణయాలకు విలువ ఇవ్వకుండా జ్ఞానేశ్ ఒక్కరే నిబంధనల్లో, రూల్స్‌లో, సాఫ్ట్‌వేర్‌లో మార్పులుచేసి ఫారం–6ను చట్టవిరుద్ధంగా మార్చారంటూ న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి దాఖలుచేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహన ధర్మాసనం విచారించింది. కోర్టు నుంచి అనుమతి పొందాకే కొత్త నిబంధనను దరఖాస్తులో చేర్చామని ఈసీ ఇటీవల చేసిన మీడియా ప్రకటనతో సుప్రీంకోర్టు సోమవారం పూర్తిగా విబేధించింది.
రికార్డులన్నింటినీ తెప్పించండి..
‘‘ఫారమ్–6లో ఇటీవలికాలంలో జరిగిన ఏ రకమైన మార్పులు, చేర్పులతోనూ కోర్టుకు సంబంధమే లేదు. దరఖాస్తులో మార్పులకు మేం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ఈ విషయంలో స్పష్టతరావాల్సిందే. దరఖాస్తుకు సంబంధించి ఏఏ మార్పులు జరిగాయనేది మాకు తెలియదు. ముందుగా సంబంధిత రికార్డులను మాకు సమర్పించండి. అసలు ఈ మార్పులు చేసిందెవరో మేం తెల్సుకోవాలనుకుంటున్నాం. దరఖాస్తులో మార్పులు చేసిన అధికారి ఎవరు? అనుమతులు ఇచ్చిన అథారిటీ ఎవరనేది మాకు తెలియజేయండి. ఈ మేరకు సంబంధిత రికార్డులను తెప్పించండి.
ఈ విషయంలో మీ స్పందనను నివేదించండి’’అని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ధర్మాసనం ఆదేశించింది. పిటిషర్ తరఫున సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి, చాంద్ ఖురేషి వాదించారు. ‘‘ఉమ్మడి నిర్ణయాధికారం అనే భావనకు తూట్లు పొడుస్తూ సీఈసీ జ్ఞానేశ్ ఒంటెత్తుపోకడను అనుసరించారు. ఈయన ఈసీ నిబంధననావళిని పూర్తిగా ఉల్లంఘించారు. ఈయనపై నేరాభియోగాలు మోపాల్సిందే. కర్తవ్య నిర్వహణలో ఈయన విఫలమయ్యారు’’అని లాయర్లు వాదించారు. ‘‘జ్ఞానేశ్‌కు రాజ్యాంగబద్ధంగా ఎలాంటి రక్షణ లభించదు.
అందుకే పోలీస్ విచారణ, సాక్ష్యాధారణసేకరణ, రోజువారీ కేసు విచారణ వంటివి ఈయనకూ వర్తిస్తాయి. సీఈసీ, ఇతర ఈసీల చట్టం,2023లోని 18వ సెక్షన్ ప్రకారం ఎలక్షన్ కమిషన్‌లో ఏదైనా నిర్ణయంలో ఏకాభిప్రాయం సాధ్యంకాని పక్షంలో మెజార్టీ నిర్ణయానికే పట్టం కట్టాలి’’అని లాయర్లు గుర్తుచేశారు. ‘ఎలక్టోరల్ రూల్స్’నిబంధనావళి ప్రకారం ఫారమ్–6 వంటి కీలక దరఖాస్తులో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే చట్టప్రకారం ముందుకెళ్లాలి.
కానీ ఎస్‌ఐఆర్ వంటి ప్రస్తుత సందర్భంలో ఎలాంటి చట్టబద్ధ నూతన నిర్ణయాలు వెలువడకుండానే ఏకపక్షంగా సాఫ్ట్‌వేర్‌లో మార్పులుచేసేసి ఆన్‌లైన్ ఫారమ్‌లో కొత్త కాలమ్ చేర్చారు. కొత్త ఓటరుగా మారాలనుకుంటున్న మీరు లేదా మీ తల్లిదండ్రులు/అంతకుముందు పూర్వీకుల పేర్లు గత ఎస్‌ఐఆర్ జాబితాలో ఉన్నాయా? అనే ప్రశ్నను చేర్చారు. ఇది చట్టవ్యతిరేకం. అందుకే జ్ఞానేశ్ నేతృత్వంలో ఈసీలో తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు, ఉత్తర్వులు, ఆదేశాలు, సాఫ్ట్‌వేర్ మార్పులు అన్నీ చెల్లనివిగా ప్రకటించండి’’అని లాయర్లు ధర్మాసనాన్ని కోరారు.
చట్టప్రకారం లేకుంటే రద్దుచేస్తాం
– ఈసీ నిర్ణయాలపై సుప్రీంకోర్టు
– సీఈసీని సస్పెండ్‌చేయాలన్న పిటిషన్‌పై విచారణ
– స్పందన తెలపాలంటూ కేంద్రం, ఈసీకి వారం గడువు
సీఈసీ జ్ఞానేశ్ సారథ్యంలోని ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాలు ఏకాభిప్రాయంతో వెలువడినవా కాదా అనేది తేలేదాకా జ్ఞానేశ్‌ను సస్పెండ్ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ‘‘సీఈసీపై నిర్ణయం తీసుకునేముందుగా ఎలక్షన్ కమిషన్ నుంచి వెలువడిన అన్ని పాత నిర్ణయాలను మేము పరిశీలించాల్సి ఉంది. చట్టప్రకారం వెలువడని ఏ నిర్ణయాన్ని అయినా మేం రద్దుచేస్తాం. సర్వోన్నత న్యాయస్థానం అసాధారణ అధికారం గురించి మీక్కూడా తెలుసు’’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
‘‘వార్తపత్రికల కథనాలను ఆధారంగా చేసుకుని మేం జ్ఞానేశ్‌ను బాధ్యతల నుంచి తప్పించబోం. ఈ విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వబోం’’అని కోర్టు స్పష్టంచేసింది. జ్ఞానేశ్‌ను సీఈసీ పదవి నుంచి తొలగించాలంటూ మంగళవారం ఎలక్షన్ కమిషన్ ప్రధాన కార్యాలయం బయట విపక్షాల ‘ఇండియా’కూటమి పార్టీలు నిరసన ర్యాలీ చేపట్టబోతున్న వేళ సుప్రీంకోర్టులో ప్రతికూల నిర్ణయం వెలువడటం గమనార్హం. ఈ వివాదం తేలేదాకా, కొత్త నిర్ణయాలు తీసుకోకుండా జ్ఞానేశ్‌ను బాధ్యతల నుంచి తప్పించండి. కమిషనర్లు సంధూ, జోషిల ఉమ్మడి ఏకాభిప్రాయాలే అమలయ్యేలా చూడండి.
ఈలోపు ఖాళీ అయిన స్థానాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సైతం భాగస్వామిగా ఉన్న కమిటీ సిఫార్సులతో భర్తీచేయండి’’అని న్యాయవాది వికాస్ సింగ్ ఈ పిటిషన్ వేశారు. ‘‘కమిషన్‌లో నిర్ణయాలు ఏకాభిప్రాయంతో వెలువడాలి లేదా మెజార్టీ సాధించిన నిర్ణయాలే అమల్లోకి రావాలి. ఇలా కాకుండా తోటి కమిషనర్ల అభిప్రాయాలను సీఈసీ పక్కనపడేశారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఈసీ నుంచి స్పందన కోరుతున్నాం. వారం లోగా స్పందన తెలియజేయండి. ఆ తర్వాతే ఈ అంశాన్ని తేలుస్తాం’’అని ధర్మాసనం ప్రకటించింది.


